31, జులై 2026, శుక్రవారం

ఎల్‌నినో దెబ్బకు ఖరీఫ్ విలవిల...


విత్తనాల కొరతతో రైతన్నకు రెట్టింపు కష్టం

వాన లేదు... వేరుశనగ విత్తనాలు లేవు... 

పచ్చిరొట్టెతో సరిపెడుతున్న వ్యవసాయశాఖ

జిల్లాలో 27,225.9 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల అవసరం...

 పంపిణీ మాత్రం నామమాత్రం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)

చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే రైతాంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన వర్షాలు కురవక కరువు పరిస్థితులు నెలకొనగా, మరోవైపు వేరుశనగ విత్తనాల కొరత రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది వర్షాభావంతో వేరుశనగ దిగుబడులు పూర్తిగా దెబ్బతినడంతో రైతుల వద్ద విత్తన నిల్వలు లేకపోయాయి. ఈ పరిస్థితిలో ప్రభుత్వంపై ఆధారపడిన రైతులకు అవసరమైన స్థాయిలో విత్తనాలు అందకపోవడంతో ఖరీఫ్ సాగు ముందుకు కదలడం లేదు.

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌కు 27,225.9 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో చిత్తూరు డివిజన్‌కు 11,329.2 క్వింటాళ్లు, పలమనేరు డివిజన్‌కు 7,380 క్వింటాళ్లు, పుంగనూరు డివిజన్‌కు 3,840 క్వింటాళ్లు, నగరి డివిజన్‌కు 2,831.7 క్వింటాళ్లు కేటాయించగా, అదనంగా 1,845 క్వింటాళ్ల బఫర్ నిల్వలు ఉంచారు. అయినప్పటికీ రైతుల అవసరాలకు సరిపడా విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో అనేక మండలాల్లో రైతులు నిరాశ చెందుతున్నారు. సాధారణంగా చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో అత్యధికంగా వేరుశనగ సాగు జరుగుతుంది. గత ఏడాది వర్షాభావం కారణంగా 10 శాతం కూడా సాగు జరగకపోవడంతో రైతులు విత్తనాలను నిల్వ చేసుకోలేకపోయారు. ఈసారి కూడా ప్రభుత్వ సరఫరాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విత్తనాలు అవసరాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటంతో రైతులు విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇక ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్టె పంటలను ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ విత్తనాల పంపిణీ చేపట్టింది. సన్‌హెంప్ (పచ్చిరొట్టె) విత్తనాలు 1,407 క్వింటాళ్లు కేటాయించగా, 980 క్వింటాళ్లు మండలాలకు చేరాయి. వాటిలో 815.8 క్వింటాళ్లు రైతులకు పంపిణీ చేశారు. అలాగే డయాంచా పచ్చిరొట్టె విత్తనాలు 426.9 క్వింటాళ్లు కేటాయించగా, 334 క్వింటాళ్లు మండలాలకు చేరి, 253.3 క్వింటాళ్లు మాత్రమే పంపిణీ అయ్యాయి. నేల సారాన్ని పెంచేందుకు పచ్చిరొట్టె పంటలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నప్పటికీ, రైతుల ప్రధాన అవసరం వేరుశనగ విత్తనాలేనని రైతులు అంటున్నారు. వర్షాభావం ప్రభావం జిల్లాలో ఖరీఫ్ సాగుపై స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో 44,267 హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 7,374 హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. 21,903 హెక్టార్లలో వేరుశనగ సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 923 హెక్టార్లలో మాత్రమే విత్తనాలు పడ్డాయి. వరి, కందులు, ఇతర ఆహార పంటల సాగు కూడా ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు.

జూన్ నెలలో జిల్లాకు 79.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, కేవలం 52.7 మిల్లీమీటర్ల మాత్రమే కురవడంతో 33.8 శాతం వర్షపాతం లోటు నమోదైంది. జిల్లాలోని 28 మండలాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతుండగా, చెరువులు, కుంటలు ఎండిపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం రైతులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ప్రత్యామ్నాయ పంటల సాగుపై కూడా స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వర్షాభావ పరిస్థితుల్లో ఉలవలను ప్రత్యామ్నాయ పంటగా సిఫారసు చేస్తారు. అయితే గత ఏడాది ఉలవల విత్తనాలు సరఫరా కాకపోగా, ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఒకవైపు వర్షాలు లేక, మరోవైపు విత్తనాల కొరత వెంటాడుతుండటంతో చిత్తూరు జిల్లా రైతన్న తీవ్ర అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అవసరమైన విత్తనాలు అందించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను సమృద్ధిగా సరఫరా చేసి, రైతులకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతం రైతన్నకు వానతో పాటు విత్తనాలే అత్యవసరమయ్యాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *