21, జులై 2026, మంగళవారం

జిల్లాలో తల్లికి వందనంకు సర్వం సిద్ధం


గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు

అర్హత ఉంటేనే ఆర్థిక సాయం.. 

పేరు లేకుంటే వెంటనే అభ్యంతరం నమోదు చేయాలి

నేడే తొలి విడత నగదు జమ.. 

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అమలుకు చిత్తూరు జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం తొలి విడతగా అర్హులైన విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయనున్నారు. అదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను అందుబాటులో ఉంచారు. జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హత ఉండి పేరు లేకపోతే సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయంలో వెంటనే అభ్యంతరం నమోదు చేసి అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, నివాస పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. తల్లి లేని కుటుంబాల్లో సంరక్షకుడి పేరుతో కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఏడాది నుంచి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పిల్లలను కూడా పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా చూడడం, పాఠశాలల నుంచి మధ్యలో చదువు మానేసే పరిస్థితులను తగ్గించడం, తల్లిదండ్రుల్లో విద్యపై మరింత బాధ్యత పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం పొందాలంటే ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలసరి ఆదాయం రూ.10 వేలలోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు ఉండాలి. కుటుంబానికి బియ్యం కార్డు తప్పనిసరి. మూడు ఎకరాల వరకు మాగాణి లేదా పది ఎకరాల వరకు మెట్ట భూమి మాత్రమే ఉండాలి. కుటుంబానికి ప్రైవేటు నాలుగు చక్రాల వాహనం ఉండరాదు. నెలకు 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉండాలి. ఇంటి విస్తీర్ణం వెయ్యి చదరపు అడుగులలోపు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే కుటుంబాలు సాధారణంగా ఈ పథకానికి అర్హులు కావు. విద్యార్థి గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదువుతూ కనీసం 75 శాతం హాజరు కలిగి ఉండాలి. అదే సమయంలో ప్రభుత్వం కొన్ని వర్గాలను పథకం పరిధి నుంచి మినహాయించింది. పాఠశాలల్లో చదవని పిల్లలు, ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయం, ఆస్తి, ఇతర అర్హత ప్రమాణాలు నెరవేర్చని కుటుంబాలు, అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించని వారు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే పారిశ్రామిక శిక్షణ సంస్థలు, సాంకేతిక విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేసింది. అయితే అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అభ్యంతరాలు నమోదు చేసి, అవసరమైన పత్రాలు సమర్పిస్తే పరిశీలన అనంతరం అర్హత ఉంటే జాబితాలో చేర్చనున్నట్లు తెలిపారు.

జూలై 22 నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, కొత్త దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 4 నుంచి 10 వరకు వాటిని పరిశీలించి అర్హుల తుది జాబితాను సిద్ధం చేస్తారు. కొత్తగా ఒకటో తరగతి, ఇంటర్మీడియట్‌లో చేరిన విద్యార్థుల వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 30న అదనపు లబ్ధిదారులకు ఆర్థిక సాయం విడుదల చేయనున్నారు. దీంతో అర్హులైన ఏ విద్యార్థి కూడా ఈ పథకం నుంచి దూరం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది తుది లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే విద్యాశాఖ అంచనాల ప్రకారం జిల్లాలో సుమారు 2.10 లక్షల నుంచి 2.25 లక్షల మంది విద్యార్థులు, 1.35 లక్షల నుంచి 1.45 లక్షల మంది తల్లులు లేదా సంరక్షకులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇందుకోసం రూ.280 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. లబ్ధిదారులు తమ ఆధార్ సంఖ్య ఆధారంగా అర్హత, నగదు జమ వివరాలను కూడా పరిశీలించుకోవచ్చని అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి సందేహాలను నివృత్తి చేసే ఏర్పాట్లు చేశారు. పత్రాల్లో లోపాలు ఉన్నవారికి వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అర్హత ఉండి ఇప్పటివరకు పేరు నమోదు కాకపోయినా నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేస్తే పరిశీలన అనంతరం పథకం వర్తింపజేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో జిల్లాలో వేలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు ఈ పథకం ద్వారా గణనీయమైన ఆర్థిక భరోసా లభించనుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *