17, జులై 2026, శుక్రవారం

చెన్నై బెంగళూరు కారిడార్ పనులకు టెండర్లు

 డిజైన్‌లు, సర్వేలు, భూసాంకేతిక పరిశోధనల కోసం టెండర్ల ఆహ్వానం

 చిత్తూరు సహా 8 స్టేషన్లతో 305 కి.మీ. హైస్పీడ్ కారిడార్ ప్రతిపాదన

 గంటకు 320 కి.మీ. వేగంతో రైళ్లు.. 73 నిమిషాల్లో చెన్నై–బెంగళూరు ప్రయాణం

 ఆగస్టు 13 వరకు టెండర్ల దాఖలు.. నిర్మాణ పనులకు త్వరలో మార్గం సుగమం 


(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

దక్షిణ భారతదేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుగా భావిస్తున్న చెన్నై బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ అమలుకు కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక ఇంజినీరింగ్ రూపకల్పన, భూసాంకేతిక పరిశోధనలు, డ్రోన్ సర్వేలు, అలైన్‌మెంట్ ఖరారు, సొరంగాలు, వంతెనలు, స్టేషన్లకు వివరణాత్మక డిజైన్‌ల తయారీ కోసం జాతీయ హైస్పీడ్ రైలు సంస్థ టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు ఆగస్టు 13, 2026ను చివరి తేదీగా నిర్ణయించింది. ఈ టెండర్లు పూర్తయిన తర్వాత నిర్మాణ పనులకు సంబంధించిన భారీ ప్యాకేజీలను దశలవారీగా పిలిచే అవకాశం ఉంది. 

కేంద్ర బడ్జెట్‌–2026లో ప్రకటించిన ఏడు కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లలో చెన్నై బెంగళూరు కారిడార్‌కు అత్యంత ప్రాధాన్యం లభించింది. ఢిల్లీ వారణాసి హైస్పీడ్ మార్గంతో పాటు ఈ కారిడార్‌కు కూడా ఒకే విధమైన ప్రమాణాలతో డిజైన్‌లు సిద్ధం చేయాలని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ నిర్ణయించింది. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో పొందిన అనుభవాన్ని ఉపయోగించి భవిష్యత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. సుమారు 305 కిలోమీటర్ల పొడవుతో రూపొందిస్తున్న ఈ కారిడార్‌లో బుల్లెట్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అయితే మొత్తం వంతెనలు, ట్రాక్‌లు, భూగర్భ నిర్మాణాలు, ఇతర మౌలిక వసతులను గంటకు 350 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా నిర్మించనున్నారు. దీంతో ప్రస్తుతం నాలుగు నుంచి ఐదు గంటలు పడుతున్న చెన్నై బెంగళూరు ప్రయాణం కేవలం 73 నిమిషాలకు తగ్గనుంది. ఈ హైస్పీడ్ రైలు మార్గంలో చెన్నై సెంట్రల్, పూనమల్లీ, పరందూర్, చిత్తూరు, కోలార్, కొడిహళ్లి, వైట్‌ఫీల్డ్, బయ్యప్పనహళ్లి ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది స్టేషన్లు ప్రతిపాదించారు. చిత్తూరుకు స్టేషన్ రావడం వల్ల జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, రియల్ ఎస్టేట్ రంగం, రవాణా సౌకర్యాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చెన్నై, బెంగళూరు టెర్మినల్ స్టేషన్లను పూర్తిగా భూగర్భంలో ఆరు ట్రాక్‌లతో నిర్మించనున్నారు. రెండు ఐలాండ్ ప్లాట్‌ఫారాలు, రెండు సైడ్ ప్లాట్‌ఫారాలతో కూడిన ఈ స్టేషన్లలో 415 మీటర్ల పొడవున్న బుల్లెట్ రైళ్లు నిలిచేలా ఏర్పాట్లు చేయనున్నారు. వైట్‌ఫీల్డ్‌లో మధ్యంతర భూగర్భ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ అన్ని రైళ్లు ఆగేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైన నిర్మాణాల్లో దాదాపు 35 కిలోమీటర్ల భూగర్భ సొరంగాలు కీలకంగా నిలవనున్నాయి. చెన్నై టెర్మినల్ వద్ద 3.87 కి.మీ., బెంగళూరు టెర్మినల్ వద్ద 15.92 కి.మీ., అలాగే కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం గుండా 14.79 కి.మీ. పొడవైన పర్వత సొరంగాన్ని నిర్మించనున్నారు. పర్యావరణానికి తక్కువ నష్టం కలిగేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుత టెండర్ల పరిధిలో హైడ్రాలజీ సర్వేలు, డ్రోన్ సర్వేలు, భూసాంకేతిక పరీక్షలు, సొరంగాల పరిశీలన, వయాడక్టులు, నదులపై వంతెనలు, స్టేషన్ భవనాలు, నిర్వహణ కేంద్రాలు, డ్రైనేజీ వ్యవస్థలు, శబ్ద నిరోధక గోడలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, వెంటిలేషన్ షాఫ్ట్‌లు, భూగర్భ నిర్మాణాలకు సంబంధించిన పూర్తి ఇంజినీరింగ్ డిజైన్‌లను సిద్ధం చేయనున్నారు. జపాన్, చైనా, యూరప్, అమెరికా దేశాల్లో అమలవుతున్న హైస్పీడ్ రైలు ప్రమాణాలను అధ్యయనం చేసి భారత పరిస్థితులకు అనుగుణంగా తుది నమూనాలు రూపొందించనున్నారు. ఈ డిజైన్‌లు సిద్ధమైన అనంతరం భూసేకరణ, నిర్మాణ ప్యాకేజీల ఖరారు, భారీ సివిల్ పనులకు ప్రత్యేక టెండర్లు పిలవనున్నారు. దక్షిణ భారతదేశంలో హైస్పీడ్ రైలు యుగానికి శ్రీకారం చుడుతూ, చిత్తూరును జాతీయ స్థాయి వేగవంతమైన రవాణా వ్యవస్థతో అనుసంధానించే కీలక ప్రాజెక్టుగా చెన్నై బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కారిడార్ మారనుందని అధికారులు భావిస్తున్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *