సర్ లో మిస్టరీగా మారిన 60 వేల మంది ఓటర్ల ఆచూకీ
పట్టణ ప్రాంతాల్లో బీఎల్‌వోలకు పెనుసవాల్..
అద్దె ఇళ్లు, మారిన చిరునామాలతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు..
వలసలు, మరణాలు, ఇతర నియోజకవర్గాల పేరుతో చెల్లుచీటి
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
చిత్తూరు జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతూ 91 శాతానికి చేరుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలో సుమారు 60 వేల మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్‌వోలకు తిరిగి అందకపోవడం, వారి ఆచూకీ లభించకపోవడం ఎన్నికల యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసించే కుటుంబాలు తరచూ ఇళ్లు మారడం, ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలోకి ప్రవేశానికి పరిమితులు ఉండటం, ఓటర్లు ఇచ్చిన చిరునామాల్లో అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో వేలాది మంది ఓటర్లను గుర్తించడం బీఎల్‌వోలకు సాధ్యం కావడం లేదు.
జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను గుర్తించడం, ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం, కుటుంబ సభ్యుల సంతకాలు తీసుకోవడం గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఎంతో క్లిష్టంగా మారింది. రాష్ట్ర ఎన్నికల సంఘం దాదాపు అన్ని ఫారాలు పంపిణీ చేశామని చెబుతున్నప్పటికీ, కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఇంకా ఓటర్లకు ఫారాలు అందలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిరునామా మార్పులు, వలసలు, అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. జిల్లా గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లు ఉండగా, 11,27,771 మంది ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. ఇది 84.15 శాతం. అయితే క్షేత్రస్థాయిలో అందుబాటులో లేని 59,857 మంది ఓటర్లను అన్‌కలెక్టబుల్ కేటగిరీలో నమోదు చేశారు. వీరిని కూడా కలుపుకుని మొత్తం డిజిటలైజేషన్ 11,87,628 మందికి, అంటే 88.62 శాతానికి చేరుకుంది. ఇంకా 1,52,498 మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పెండింగ్‌లో ఉంది. అన్‌కలెక్టబుల్ కేటగిరీలో ఉన్న ఓటర్ల సంఖ్య జిల్లాలో దాదాపు 60 వేల మందికి చేరడం విశేషం. వీరంతా ఓటరు జాబితా నుంచి తొలగించినట్లు కాదని, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో గుర్తించలేక తాత్కాలికంగా ఆ విభాగంలో నమోదు చేసిన వారేనని అధికారులు చెబుతున్నారు. మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినవారు, ఇతర నియోజకవర్గాల్లో ఇప్పటికే ఓటరుగా నమోదైనవారు, ఇచ్చిన చిరునామాలో అందుబాటులో లేని వారిని ఈ జాబితాలో చేర్చారు. తుది నిర్ణయానికి ముందు వీరి వివరాలను మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా చిత్తూరు నియోజకవర్గంలో 13,232 మంది అన్‌కలెక్టబుల్‌గా నమోదయ్యారు. ఇది ఆ నియోజకవర్గ ఓటర్లలో 6.50 శాతం. తర్వాత పూతలపట్టు నియోజకవర్గంలో 12,162 మంది (5.46 శాతం), నగరిలో 11,896 మంది (5.84 శాతం), పలమనేరులో 10,382 మంది (3.81 శాతం) ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో 6,275 మంది (2.72 శాతం), గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 5,910 మంది (2.85 శాతం) అన్‌కలెక్టబుల్‌గా నమోదయ్యారు. ఈ గణాంకాలు పట్టణీకరణ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సమస్య తీవ్రతను సూచిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇంకా గుర్తించాల్సిన వారిలో సుమారు 27 వేల మంది మరణించినవారు, 15 నుంచి 16 వేల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినవారు, దాదాపు 10 వేల మంది ఇతర నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదైనవారు, సుమారు 3 వేల మంది చిరునామాలో అందుబాటులో లేని వారు ఉన్నారు. వీరి వివరాలను పూర్తిగా ధృవీకరించిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జిల్లాలోని 1,511 పోలింగ్ కేంద్రాల్లో 82 కేంద్రాలు ఇప్పటికే 100 శాతం పని పూర్తి చేశాయి. మరో 642 పోలింగ్ కేంద్రాలు 90 నుంచి 99 శాతం, 643 కేంద్రాలు 80 నుంచి 89 శాతం, 135 కేంద్రాలు 70 నుంచి 79 శాతం, 9 కేంద్రాలు 60 నుంచి 69 శాతం పురోగతిలో ఉన్నాయి. ఇంకా 405 మంది బీఎల్‌వోలు 85 శాతం కంటే తక్కువ పురోగతిలో ఉండగా, జూలై 11 ఒక్కరోజే 22,945 ఫారాలను డిజిటలైజ్ చేయడం ద్వారా పురోగతిని వేగవంతం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్లు లేదా వారి కుటుంబ సభ్యులు సంబంధిత ఎన్యూమరేషన్ ఫారంపై తప్పనిసరిగా సంతకం చేయాలని, లేకపోతే వారి పేరు ముసాయిదా ఓటరు జాబితాలో ఉండకపోయే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఇంకా గడువు ఉన్నందున సంబంధిత బీఎల్‌వోలను సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని, మొత్తం ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ లక్ష్య దిశగా వేగంగా సాగుతున్నప్పటికీ, దాదాపు 60 వేల మంది ఓటర్ల ఆచూకీ లభించకపోవడం ఎన్నికల యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారింది. మారుతున్న జీవన విధానం, పట్టణీకరణ, అద్దె నివాసాల పెరుగుదల, వలసలు వంటి సామాజిక పరిస్థితులు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ఎంతటి ప్రభావం చూపుతున్నాయో ఈ గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

