23, జులై 2026, గురువారం

కుప్పంకు రెండేళ్లలో రూ.9,321.57 కోట్ల పెట్టుబడులు..


• రెండేళ్లలో జీఎస్‌డీపీ రూ.5,331 కోట్ల నుంచి రూ.7,334 కోట్లకు.. 38 శాతం వృద్ధి

• రూ.9,321.57 కోట్ల పెట్టుబడులతో 30 కొత్త పరిశ్రమలు.. 

. 87 వేలకుపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల అవకాశాలు

• సూపర్-6 పథకాల కింద రూ.550 కోట్లకుపైగా లబ్ధి.. 

• వ్యవసాయం, మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్య, పర్యాటక రంగాల్లో భారీ మార్పులు

• ప్రపంచస్థాయి ఆదర్శ నియోజకవర్గంగా కుప్పంను తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు

. సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతున్న సీఎం సొంత నియోజకవర్గం 

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం గత రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. స్వర్ణ కుప్పం విజన్ 2029 లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా పారిశ్రామిక రంగం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం, పర్యాటకం, సంక్షేమ రంగాల్లో గణనీయమైన పురోగతి నమోదైంది. 2023–24 నుంచి 2025–26 మధ్య నియోజకవర్గ స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.5,331 కోట్ల నుంచి రూ.7,334 కోట్లకు పెరిగి 38 శాతం వృద్ధిని నమోదు చేసింది. స్థూల విలువ జోడింపు (జీవీఏ) రూ.4,942 కోట్ల నుంచి రూ.6,781 కోట్లకు పెరగగా, తలసరి ఆదాయం రూ.1.59 లక్షల నుంచి రూ.2.14 లక్షలకు చేరుకుంది. పారిశ్రామిక రంగంలో కుప్పం నవ శకానికి నాంది పలుకుతోంది. మొత్తం రూ.9,321.57 కోట్ల పెట్టుబడులతో 30 కొత్త పరిశ్రమలు ముందుకు రావడం ద్వారా 39,535 ప్రత్యక్ష, 47,539 పరోక్ష ఉద్యోగాల అవకాశాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే ఎనిమిది పరిశ్రమలు నిర్మాణ దశలో ఉండగా, మరో 12 పరిశ్రమలు భూసేకరణ దశలో ఉన్నాయి. మరో 10 పరిశ్రమలు త్వరలో పనులు ప్రారంభించనున్నాయి.

సంక్షేమ పథకాల అమలులోనూ కుప్పం ముందంజలో నిలిచింది. ఎన్‌టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం 2, స్త్రీశక్తి వంటి సూపర్ 6 పథకాల ద్వారా దాదాపు రూ.550 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఎన్‌టీఆర్ భరోసా కింద 39,846 మందికి రూ.422.66 కోట్లు, అన్నదాత సుఖీభవ ద్వారా 36,473 మంది రైతులకు రూ.67.01 కోట్లు, తల్లికి వందనం కింద 32,973 మంది విద్యార్థులకు రూ.42.10 కోట్లు అందించారు. మహిళలకు 37.33 లక్షల ఉచిత బస్సు ప్రయాణాలు, దివ్యాంగులకు 27,853 ఉచిత ప్రయాణాలు కల్పించడంతో పాటు నాలుగు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగంలో ప్రకృతి సాగు విస్తరణ, ఉద్యానవన ఉత్పత్తి పెరుగుదల, డ్రిప్ ఇరిగేషన్ విస్తరణ, పాల ఉత్పత్తి పెరుగుదల వంటి అంశాలు రైతులకు కొత్త ఆశలు కల్పించాయి. ప్రకృతి వ్యవసాయం 20,166 ఎకరాలకు విస్తరించగా, ఉద్యానవన ఉత్పత్తి 68.6 శాతం పెరిగింది. ఆరోగ్య రంగంలో టాటా సంజీవని ద్వారా 1.15 లక్షల మందికి వైద్య సేవలు అందించగా, కేర్ ఎన్ గ్రో కార్యక్రమం ద్వారా వేలాది చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మహిళా సాధికారత, యువతకు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం వంటి కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. జీరో పావర్టీ పీ4 కార్యక్రమం ద్వారా వేలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పించడంతో పాటు సీఎస్‌ఆర్ నిధులతో అంబులెన్సులు, ఎలక్ట్రిక్ ఆటోలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టారు. కాడా ప్రాంతంలో 40 వినూత్న ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. స్వచ్ఛ కుప్పం కార్యక్రమంతో 93 శాతం గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా మారగా, ఇంటింటా చెత్త సేకరణ, లెగసీ వ్యర్థాల శుద్ధి వంటి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వేలాది ఇళ్లు పూర్తి చేయడంతో పాటు రూఫ్‌టాప్ సోలార్, తాగునీటి పథకాలు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు అందించారు.
రూ.396.79 కోట్లతో రహదారులు, వీధి దీపాలు, చెక్‌డ్యాంలు, పాఠశాలలు, హాస్టళ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. హంద్రీ.నీవా సుజల స్రవంతి ద్వారా 110 చెరువులు నింపడంతో పాటు కేంద్రీయ విద్యాలయం ప్రారంభించారు. కంగుంది హెరిటేజ్ విలేజ్, బౌల్డరింగ్ పార్క్, మల్లప్పకొండ మోటార్ రేసింగ్ వంటి కార్యక్రమాలతో పర్యాటక రంగానికి కూడా ఊతమిచ్చారు. కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టు కోసం భూ సేకరణకు రైతులకు ఇప్పటికే రూ.90 కోట్లు పరిహారం చెల్లించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ కుప్పాన్ని దేశానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *