24న జిల్లాలో మెగా పీటీఎంకు విస్తృత ఏర్పాట్లు
2,140 పాఠశాలలు, 31 జూనియర్ కళాశాలల్లో
హాజరయ్యే తల్లిదండ్రులు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
అన్ని శాఖలతో సమన్వయం
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం–3.1)ను ఈ నెల 24న జిల్లాలోని 2,140 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, 31 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సమావేశానికి హాజరయ్యే తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలోని ప్రతి పాఠశాలలో సమావేశానికి వచ్చే వారి సంఖ్యను ప్రధానోపాధ్యాయులు ముందుగానే అంచనా వేసి వంట సంస్థలకు సమాచారం అందిస్తున్నారు. అవసరమైన బియ్యం, గుడ్లు, కూరగాయలు, ఇతర వంట సామగ్రి, ప్లేట్లు, గ్లాసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా బియ్యం కొరత తలెత్తితే వెంటనే పౌర సరఫరాల శాఖ ద్వారా సరఫరా చేసేలా సమన్వయం చేస్తున్నారు. సమావేశానికి హాజరయ్యే వారందరికీ వేడి వేడి భోజనం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మెనూలో తెల్ల బియ్యం, ఆకుకూరలతో పప్పు, గుడ్డు కూర, స్థానిక కూరగాయలతో కూర, మిల్లెట్ వేరుశెనగ బెల్లం చిక్కీ అందించనున్నారు. వంట నుంచి భోజనం వడ్డించే వరకు పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, సురక్షిత తాగునీరు, చేతులు కడుక్కునే సౌకర్యాలు కల్పించాలని జిల్లా అధికారులు ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అలాగే పాఠశాలల మరుగుదొడ్ల పరిశుభ్రత, ప్రాంగణాల శుభ్రత, విద్యుత్, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సమావేశం ముగిసిన అనంతరం హాజరైన వారి సంఖ్య, భోజనం చేసిన వారి వివరాలను లీప్ యాప్ (పీటీఎం మాడ్యూల్)లో నమోదు చేయాలని ఆదేశించారు. మెగా పీటీఎం 3.1ను విజయవంతం చేయడానికి విద్యాశాఖతో పాటు మధ్యాహ్న భోజన సంస్థలు, పౌర సరఫరాల శాఖ, స్థానిక సంస్థలు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

