చిత్తూరు జిల్లాలో 1.36 లక్షల ఓట్లు గల్లంతు..!
ఎక్కడికి వెళ్లాయి ఈ ఓట్లు? ఏమై పోయాయి ?
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్య..
మరణాలు, వలసలు, డూప్లికేట్ ఓట్లు, ఫారాల గందరగోళం, సాంకేతిక నిబంధనలే కారణమా?
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు జిల్లాలో ప్రత్యేక విస్తృత ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)-2026 ప్రక్రియ అనంతరం విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితా రాజకీయంగా, పరిపాలనాపరంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో జిల్లాలో 13,40,126 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 12,04,067 మంది మాత్రమే ఉన్నారు. దీంతో 1,36,059 మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో కనిపించకుండా పోవడం రాజకీయ పార్టీలను, ఓటర్లను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ తగ్గుదల నమోదైంది. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు ముసాయిదా జాబితాలో లేకపోవడానికి ఒక్క కారణం కాకుండా పలు పరిపాలనా, సాంకేతిక, సామాజిక అంశాలు కలిసి ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణలో బోగస్ ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారి పేర్లను గుర్తించి తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా ఇలాంటి పేర్లు ముసాయిదా జాబితాలో కనిపించకుండా పోయాయి.
అదే సమయంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ అమలు విధానంపైనా పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినప్పటికీ, అనేక ప్రాంతాల్లో వాటిని తిరిగి సేకరించేందుకు మళ్లీ ఇంటింటికీ వెళ్లలేదని సమాచారం. ఫారాలు నింపిన ఓటర్లే బీఎల్‌వోలు, సచివాలయాలు లేదా సంబంధిత కార్యాలయాలకు తీసుకెళ్లి ఇవ్వాల్సి రావడంతో చాలా మంది వాటిని సమర్పించలేదు. వృద్ధులు, నిరక్షరాస్యులు, రోజువారీ కూలీలు, ఉద్యోగ రీత్యా బయట ఉన్నవారు, ఫారంపై ఆసక్తి చూపని వారు, చివరకు గడువు దాటిపోయిన వారు కూడా వేల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫారం నింపడంలోనూ అనేక మందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుత ఓటరుకు సంబంధించిన వివరాలతో పాటు కుటుంబానికి సంబంధించిన పాత సమాచారం కూడా నమోదు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా 2002 నాటి ఓటర్ల జాబితాలో తల్లిదండ్రుల ఓటరు సంఖ్య, పోలింగ్ బూత్ నంబరు, అసెంబ్లీ నియోజకవర్గ నంబరు తదితర వివరాలు ఇవ్వాల్సి రావడం చాలామందికి సాధ్యం కాలేదు. ఆ వివరాలు లేకుంటే కంప్యూటర్ వ్యవస్థ నమోదు స్వీకరించలేదని, దీంతో అనేక దరఖాస్తులు పూర్తికాకపోయినట్లు స్థానికంగా వినిపిస్తోంది. ఎస్‌ఐఆర్ సమయంలో బీఎల్‌వోలు పలుమార్లు వెళ్లినప్పటికీ, అనేక ఇళ్లు తాళం వేసి ఉండటం, ఉద్యోగాలు, విద్య, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉండటం వల్ల పలువురు ఓటర్లు అందుబాటులోకి రాలేదు. దీంతో వారి వివరాలు ధ్రువీకరించలేక అన్‌కలెక్టబుల్ గా గుర్తించారు. జిల్లాలో ఇలాంటి వారి సంఖ్య 1,36,059గా నమోదైంది. అలాగే మ్యాపింగ్ పూర్తికాని 23,881 మంది, తల్లిదండ్రుల పేర్లు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తార్కిక దోషాలు ఉన్న 1,10,205 మంది ఓటర్లకు ప్రత్యేకంగా నోటీసులు జారీ చేయనున్నారు. సామాజిక పరిస్థితులు కూడా ఓటర్ల సంఖ్య తగ్గడానికి కారణమయ్యే అవకాశాన్ని ఎన్నికల విశ్లేషకులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి యువత ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం పట్టణాలు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడం, అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకోవడం, పాత గ్రామాల్లో ఓటరు నమోదును కొనసాగించకపోవడం వంటి పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయి. ఒకే కుటుంబం మొత్తం వేరే ప్రాంతానికి మారినా పాత చిరునామాలో ధ్రువీకరణ జరగకపోతే పేర్లు ముసాయిదా జాబితాలో కనిపించకపోవచ్చు. ఇక ఎన్నికల నిర్వహణలో పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, బూత్ మార్పులు, నియోజకవర్గాల పరిధిలో జరిగిన పరిపాలనా మార్పులు కూడా కొంత మేర ప్రభావం చూపే అవకాశముంది. అయితే చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం విడుదలైన ముసాయిదా జాబితాలో ప్రధానంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో జరిగిన ధ్రువీకరణ ఆధారంగానే ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో అత్యధికంగా పలమనేరు నియోజకవర్గంలో 29,381 మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో కనిపించలేదు. ఆ తర్వాత చిత్తూరులో 26,436 మంది, కుప్పంలో 24,418 మంది, నగరిలో 20,879 మంది, పూతలపట్టులో 20,321 మంది, జీడీ నెల్లూరులో 14,624 మంది ఓటర్ల పేర్లు ముసాయిదాలో లేవు. ఈ సంఖ్యలు జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తున్నాయి. అయితే ఇది తుది జాబితా కాదని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ముసాయిదా జాబితాపై జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. కొత్తగా పేరు నమోదు కోసం ఫారం-6, పేరు తొలగింపు లేదా అభ్యంతరాల కోసం ఫారం-7, సవరణల కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అందిన దరఖాస్తులపై విచారణ పూర్తిచేసిన తర్వాత అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. ప్రస్తుతం గల్లంతైన 1.36 లక్షల మంది ఓటర్లలో ఎంతమంది తిరిగి తుది జాబితాలో చోటు దక్కించుకుంటారన్నది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

