19, జులై 2026, ఆదివారం

జ్ఞానేంద్ర రెడ్డి ప్రాబల్యానికి చెక్ పెట్టడానికి టీడీపీ వ్యూహం


పెనుమూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)

సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాల నేపథ్యంలో పెనుమూరు మండల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కూటమి నేతలు వ్యూహాలు రచిస్తుండగా, వైసీపీ తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పెనుమూరు గ్రామ పంచాయతీతో చార్వాకానిపల్లె విలీనం అంశం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. 1981 నుంచి ఇప్పటి వరకు పెనుమూరు పంచాయతీలో టీడీపీ అనుకూల సామాజిక వర్గం మద్దతుతోనే సర్పంచులు ఎన్నికవుతూ వచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకు జ్ఞానేంద్ర రెడ్డి చొరవతో 2020 జనవరి 17న జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.241 ద్వారా చార్వాకానిపల్లె పంచాయతీని పెనుమూరులో విలీనం చేశారు. అయితే ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ మండల టీడీపీ అధ్యక్షుడు పి. రుద్రయ్య నాయుడు తదితరులు 2020 మార్చి 13న హైకోర్టులో రిట్ పిటిషన్ నెం.5738/2020 దాఖలు చేసి స్టే పొందారు. అనంతరం ఈ ఏడాది మార్చి 31న హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేయడంతో విలీనానికి మార్గం సుగమమైంది.

ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే పెనుమూరులో గెలుపు కష్టమవుతుందని భావిస్తున్న టీడీపీ నాయకత్వం చార్వాకానిపల్లెను తిరిగి ప్రత్యేక పంచాయతీగా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అది సాధ్యం కాకపోతే తిరివిరెడ్డిపల్లె పంచాయతీని పెనుమూరులో విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు అంశాల్లో ఏదైనా నిర్ణయం తీసుకున్నా వైసీపీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికలు మరింత ఆలస్యమైతే కేంద్ర నిధులు నిలిచిపోయి అభివృద్ధి పనులు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బస్టాండ్ వేలం విషయంలో దళిత నాయకులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌తో ఆ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉంది. ఇదిలా ఉండగా, టీడీపీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి పెనుమూరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. చార్వాకానిపల్లె ప్రాంతంలో ఆయన కుటుంబానికి గట్టి పట్టుంది. ఆయన తండ్రి ఎన్. బాలి రెడ్డి, భార్య ఎన్.బి. రాధ ఒక్కోసారి, చిన్నతాత ఎన్. ఇరగమ రెడ్డి రెండుసార్లు, చిన్నాన్న ఎన్. మునిరత్నం రెడ్డి మూడుసార్లు సర్పంచులుగా పనిచేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పెనుమూరు పంచాయతీతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి జ్ఞానేంద్ర రెడ్డి ప్రాబల్యానికి చెక్ పెడతానని పార్టీ అధిష్ఠానానికి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే పెనుమూరు మండలంలో జ్ఞానేంద్ర రెడ్డి రాజకీయ పట్టు ఇప్పటికీ బలంగానే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన మద్దతుదారులు ఇప్పటి వరకు ఐదుసార్లు ఎంపీపీ, నాలుగుసార్లు జడ్పీటీసీ స్థానాలను దక్కించుకున్నారు. 2014లో మాజీ మంత్రి డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ, మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పి. కృష్ణారెడ్డి టీడీపీలో చేరడంతో హరిబాబు నాయుడు ఎంపీపీగా, రుద్రయ్య నాయుడు జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అనంతరం కుతూహలమ్మ దూరం కావడం, కృష్ణారెడ్డి వైసీపీలో చేరడంతో 2021 ఎన్నికల్లో మళ్లీ జ్ఞానేంద్ర రెడ్డి మద్దతుదారులే ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్నారు. ఆయన వదిన మహాసముద్రం ప్రమీలమ్మ ఒకసారి ఎంపీపీగా, మరోసారి జడ్పీటీసీగా పనిచేయగా, గత ఎన్నికల్లో ఆయన బంధువు హేమలతా రెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు.

 జ్ఞానేంద్ర రెడ్డి గతంలో గుంటిపల్లి సర్పంచ్, జీడీ నెల్లూరు సమితి అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు రెండుసార్లు చిత్తూరు పార్లమెంట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుగానూ బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేదు. 2020 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. జ్ఞానేంద్ర రెడ్డి చొరవతో అప్పటి ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి ఆదేశాల మేరకు పెనుమూరులో బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టగా, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, టీటీడీ కళ్యాణమండపం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెనుమూరులో కనీస మురుగుకాలువల మరమ్మతులు కూడా చేపట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు సన్నిహితంగా కలిసి పనిచేసిన మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి, డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి రాజకీయంగా ఎదురెదురుగా నిలిస్తే పెనుమూరు స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు ఎటువైపు మలుపుతిప్పుతాయో ఎన్నికల నాటికి తేలనుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *