20వ తేదీకి ముందు తోలిన మామిడికీ మద్దతు ధర వర్తిస్తుందా?
20వ తేదీకి ముందు తోలిన మామిడికీ మద్దతు ధర వర్తిస్తుందా?
ప్రభుత్వ విధివిధానాల కోసం వేలాది మంది రైతుల ఎదురుచూపులు
రూ.4 సబ్సిడీపై స్పష్టత లేక అయోమయం
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)
తోతాపురి మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కిలోకు రూ.4 ప్రభుత్వ మద్దతు (సబ్సిడీ) ధర అమలుపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఈ నెల 20వ తేదీకి ముందు గుజ్జు పరిశ్రమలు, ప్రభుత్వం అనుమతించిన ర్యాంపులకు మామిడిని సరఫరా చేసిన రైతులకు కూడా ఈ సబ్సిడీ వర్తిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఇప్పటివరకు ఈ అంశంపై స్పష్టమైన విధివిధానాలు విడుదల చేయకపోవడంతో వేలాది మంది రైతులు సందిగ్ధంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తోతాపురి మామిడికి మార్కెట్ ధరతో పాటు కిలోకు రూ.4 ప్రభుత్వ మద్దతు అందించాలని ప్రకటించింది. అయితే ఈ సబ్సిడీ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది, ఎవరికి వర్తిస్తుంది, ఇప్పటికే పంటను విక్రయించిన రైతులకు కూడా వర్తిస్తుందా లేదా అనే అంశాలపై అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ నెల 20వ తేదీ తర్వాత సరఫరా చేసిన మామిడికాయలకు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీ వర్తిస్తుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అంతకుముందే పంటను విక్రయించిన రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 20వ తేదీకి ముందే తమ పంటను గుజ్జు పరిశ్రమలు, ర్యాంపులకు సరఫరా చేసిన రైతులకు కూడా ప్రభుత్వం ప్రకటించిన రూ.4 మద్దతు ధరను వర్తింపజేయాలని జిల్లా రైతు సంఘం నాయకులు ఇటీవల జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచే తోతాపురి మామిడి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలుత ఐదు, ఆరు గుజ్జు పరిశ్రమలు మాత్రమే కొనుగోళ్లు చేపట్టగా, అనంతరం జిల్లాలోని దాదాపు అన్ని పరిశ్రమలు, ప్రభుత్వం అనుమతించిన ర్యాంపులు కొనుగోళ్లను ప్రారంభించాయి. ఈ క్రమంలో ఈ నెల 20వ తేదీ నాటికి సుమారు లక్ష టన్నుల వరకు తోతాపురి మామిడిని రైతులు విక్రయించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రైతులంతా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ తమకూ వర్తిస్తుందా అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై ఆంధ్రప్రభ జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సతీష్‌ను సంప్రదించగా, ఈ నెల 20వ తేదీ నుంచి సరఫరా చేసిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.4 సబ్సిడీ తప్పకుండా వర్తిస్తుందని తెలిపారు. అయితే 20వ తేదీకి ముందు సరఫరా చేసిన రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేకంగా విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 20వ తేదీ నుంచి మామిడి కొనుగోళ్లపై ఉద్యానవన శాఖ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టింది. గుజ్జు పరిశ్రమలు, ర్యాంపుల వద్ద శాఖ సిబ్బందిని నియమించి రైతులు సరఫరా చేస్తున్న మామిడి పరిమాణాన్ని నమోదు చేస్తున్నారు. రైతుల నుంచి వన్-బి, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ ప్రతులను కూడా సేకరిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని నమోదిత ర్యాంపుల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే 20వ తేదీకి ముందు మామిడిని విక్రయించిన రైతుల వివరాలను కూడా సేకరించి వారికి సబ్సిడీ వర్తింపజేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం త్వరగా విధివిధానాలు ప్రకటించి సందిగ్ధానికి తెరదించాలని, లేకపోతే వేలాది మంది రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులందరి దృష్టి నెలకొంది.

