5, జులై 2026, ఆదివారం

క్వాంటం, సెమీకండక్టర్ రంగాల్లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు




 డిసెంబరుకు అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం 

కుప్పంలో భారీ పారిశ్రామిక ప్రాజెక్టులతో వేగవంతమైన అభివృద్ధి

 ప్రతి నియోజకవర్గం కుప్పం తరహాలో అభివృద్ధి 

 పెండింగ్ భూ సమస్యలను పరిష్కరించి పరిశ్రమలకు అనుకూల వాతావరణం 

విలేకరులతో చిట్ చాట్ లో  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

కుప్పం, జూలై 5 (ఆంధ్రప్రభ ) రాష్ట్రాన్ని దేశంలోనే అత్యాధునిక సాంకేతిక, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, ఆధునిక తయారీ రంగాలతో పాటు పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కుప్పం పర్యటనలో భాగంగా మీడియాతో ఆదివారం నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, రాజకీయాలు, సాగునీటి ప్రాజెక్టులు, భూ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. మూడు రోజుల పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..  రాష్ట్రంలో విస్తృత స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పం నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ రాని స్థాయిలో పారిశ్రామిక ప్రాజెక్టులు వస్తున్నాయని పేర్కొన్నారు. రోడ్లు, కమ్యూనికేషన్, రవాణా, మౌలిక వసతులు, డిజిటల్ అనుసంధానం వంటి అన్ని రంగాల్లో కుప్పాన్ని వేగంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. త్వరలో ప్రజలు పూర్తిగా మారిపోయిన కుప్పాన్ని చూస్తారని, ఇదే అభివృద్ధి నమూనాను రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్ రంగాల్లో ప్రపంచ స్థాయి పెట్టుబడులను తీసుకురావడానికి చర్చలు కొనసాగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. భవిష్యత్ సాంకేతికతకు అవసరమైన నైపుణ్యాలు, పరిశోధనలు, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇంధన రంగంలో కూడా రాష్ట్రాన్ని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని విస్తరిస్తున్నామని, వాటితో పాటు ఆధునిక విద్యుత్ సరఫరా విధానాలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పచ్చదనానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ సమతుల్య అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. పారిశ్రామిక రంగంలో ప్రముఖ ఉక్కు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్సెలార్ మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ వంటి సంస్థలు తమ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. గతంలో భూముల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలు, వివాదాల కారణంగా విలువైన భూములు, ఖనిజ సంపద వినియోగానికి నోచుకోలేదని వ్యాఖ్యానించారు. ఓబుళాపురం, ఆన్‌రాక్ వంటి అంశాలు కూడా ఇదే తరహా సమస్యల్లో చిక్కుకున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తుంటే కొందరు ప్రతి అడుగులోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం లేకపోవడంతో అనేక సంస్థలు రాష్ట్రం విడిచి వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి ప్రాజెక్టును తామే తీసుకొచ్చామని ప్రతిపక్షం చెప్పుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారు. వాస్తవాలు లేకపోయినా పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాలను గత పాలకులు గంజాయి సాగుకు కేంద్రాలుగా మార్చారని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా 'మాదకద్రవ్యాల రహిత భారత్' కార్యక్రమాన్ని ప్రారంభించి మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు చేపడుతోందని గుర్తు చేశారు. తిరుమల ప్రసాదం కల్తీ వ్యవహారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అలాంటి ఘటనలకు కారణమైనవారే ఇప్పుడు నీతులు చెప్పడం విచారకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలకు నిధులు సమకూరుస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. తనపై, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అసత్య ప్రచారం చేయడానికి కొన్ని వేదికలను ఉపయోగిస్తున్నారని అన్నారు. హింస, దూషణలు, ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించడం కొందరి రాజకీయ విధానంగా మారిందని విమర్శించారు. సాగునీటి రంగంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ హంద్రీ–నీవా కాలువ ద్వారా కుప్పం వరకు నీటిని తీసుకురావడం చారిత్రాత్మక విజయమని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమకు మరింత సాగునీరు అందించేందుకు గాలేరు–నగరి ప్రాజెక్టును కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. సాగునీరు, పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *