కడపలో కరోనా కలకలం.. జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్!
అన్ని జిల్లాలకు అత్యవసర ఆదేశాలు..
పర్యవేక్షణ, పరీక్షలు, వైద్య సంసిద్ధత పెంపు
చిత్తూరు జిల్లాలోనూ అప్రమత్తమైన వైద్యశాఖ..
ఇప్పటివరకు అనుమానిత కేసులు నమోదు కాలేదన్న డీఎంహెచ్‌వో
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
కడప జిల్లాలో కోవిడ్-19 కేసులు వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అన్ని జిల్లాల యంత్రాంగానికి అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు, జిల్లా పర్యవేక్షణ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, సమగ్ర వ్యాధుల పర్యవేక్షణ కార్యక్రమం (ఐడీఎస్‌పీ) అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తూ కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.
కోవిడ్ కేసులు పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో వచ్చే ప్రతి రోగిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించింది. ఇన్‌ఫ్లుయెంజా తరహా అనారోగ్యాలు (ఐఎల్‌ఐ), తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు (ఎస్‌ఏఆర్‌ఐ) ఉన్న రోగుల నుంచి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నమూనాలు సేకరించి వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ప్రయోగశాలల్లో నిర్ధారణ అయిన ప్రతి కోవిడ్ కేసును ఆలస్యం లేకుండా సమగ్ర ఆరోగ్య సమాచార వ్యవస్థలో నమోదు చేయాలని స్పష్టం చేసింది. జిల్లాల్లో శ్వాసకోశ వ్యాధుల సమూహ కేసులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడైనా అసాధారణంగా కేసులు పెరిగితే వెంటనే విచారణ చేపట్టి నియంత్రణ చర్యలు ప్రారంభించాలని వైద్యశాఖ ఆదేశించింది. ఆర్‌టీపీసీఆర్ పరీక్షల కోసం అవసరమైన కిట్లు, వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియం, నమూనాల సేకరణ పరికరాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీ.పీ.ఈ కిట్లు), మాస్కులు, క్రిమిసంహారక ద్రావణాలు, ఆక్సిజన్, అత్యవసర మందులు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు, ఆక్సిజన్ పడకలు, అత్యవసర చికిత్స విభాగాలు, వెంటిలేటర్ సౌకర్యాలు, రిఫరల్ వ్యవస్థ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయో లేదో వెంటనే సమీక్షించాలని ఆదేశించింది. ఆరోగ్య సిబ్బంది సంక్రమణ నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అవసరమైతే కోవిడ్ పాజిటివ్ నమూనాలను జన్యు విశ్లేషణ కోసం గుర్తించిన ప్రయోగశాలలకు పంపించాలని పేర్కొంది. ప్రజల్లో చేతుల పరిశుభ్రత, దగ్గు, తుమ్ము సమయంలో జాగ్రత్తలు, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన అవసరంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అదే సమయంలో అనవసర భయాందోళనలు సృష్టించకుండా ప్రజలకు సరైన సమాచారాన్ని అందించాలని ఆదేశించింది. కోవిడ్ రోగుల తరలింపునకు అవసరమైన ప్రత్యేక అంబులెన్స్ సేవలను కూడా సిద్ధంగా ఉంచాలని పేర్కొంది. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా కోవిడ్ కేసులు, సమూహ వ్యాప్తి, ఆసుపత్రుల్లో చేరికలు లేదా మరణాలు అసాధారణంగా పెరిగితే సాధారణ నివేదికల కోసం వేచి చూడకుండా వెంటనే రాష్ట్ర పర్యవేక్షణ విభాగానికి సమాచారం అందించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాలు పూర్తి స్థాయి సంసిద్ధతతో ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది.
*జిల్లాలో అప్రమత్తమైన వైద్యశాఖ*
కడప జిల్లాలో కోవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కూడా అప్రమత్తమైంది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో అత్యవసర సమీక్ష సమావేశాలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.
జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో వచ్చే రోగులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన వారిని తిరుపతిలోని ప్రత్యేక కేంద్రాలకు పరీక్షల కోసం పంపిస్తున్నామని చెప్పారు. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచిస్తున్నామని తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ సిద్ధంగా ఉంచామని, ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఐసీయూ పడకల వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కోవిడ్ అనుమానిత కేసులు ఏవీ నమోదు కాలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలే తప్ప భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

