23, జులై 2026, గురువారం

రైతుకు భారమవుతున్న పండ్ల రారాజు


ప్రపంచాన్ని ఏలుతున్న మామిడి.. 

చిత్తూరు రైతును మాత్రం కన్నీళ్లు పెట్టిస్తోంది

గిట్టుబాటు ధర లేదు కాయలు తీసుకునే దిక్కులేదు 

ప్రతిపాదనలకే పరిమితమైన మామిడి బోర్డు

జాతీయ మామిడి దినోత్సవం ప్రత్యేక కథనం

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

ప్రపంచవ్యాప్తంగా పండ్లలో రాజుగా పేరొందిన మామిడి పండుకు ప్రత్యేక గుర్తింపుగా ప్రతి ఏడాది జూలై 22న జాతీయ మామిడి దినోత్సవాన్ని జరుపుకుంటారు. రుచి, సువాసన, పోషక విలువలతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఈ పండు భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఉగాది పచ్చడి నుంచి ఆవకాయ వరకు, తాజా పండ్ల నుంచి పల్ప్, జ్యూస్, ఐస్‌క్రీమ్‌ల వరకు మామిడి వినియోగం విస్తరించింది. ప్రపంచంలో అత్యధికంగా మామిడి ఉత్పత్తి చేసే దేశంగా భారత్ నిలుస్తుండగా, దేశంలో ఉత్తర ప్రదేశ్ తర్వాత మామిడి సాగులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. కర్ణాటక మూడవ స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో ఉంది. అయితే ప్రపంచానికి తీపిని పంచే ఈ పండు... చిత్తూరు జిల్లాలో మాత్రం వేలాది మంది రైతుల జీవితాల్లో చేదు జ్ఞాపకంగా మారుతోంది. జిల్లాలో ఒకటిన్నర లక్షల ఎకరాలకు పైగా మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా తోతాపురి, నీలం, బర్నిషా, ఖాదర్  వంటి రకాలను విస్తృతంగా సాగు చేస్తున్నారు. సగటు జిల్లాలో సగటున ఏడు నుంచి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల మామిడికాయలు పండుతాయి. ఈ పంట ఆధారంగా జిల్లాలో 31 మామిడి పల్ప్ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే మామిడి గుజ్జును గల్ఫ్ దేశాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తున్నారు. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమ వెనుక రైతులే ప్రధాన ఆధారం.

అయితే గత ఐదేళ్లుగా కరోనా ప్రభావం, అంతర్జాతీయ యుద్ధాల కారణంగా ఎగుమతులు మందగించడం, ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, పల్ప్ పరిశ్రమల కొనుగోళ్లు తగ్గిపోవడంతో చిత్తూరు మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయారు. పెట్టుబడులు పెరుగుతున్నా, గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఒకప్పుడు బంగారు పంటగా పేరొందిన మామిడి ఇప్పుడు అప్పుల పంటగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి కాయలు కోసిన తర్వాత రైతుల కష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఒక ట్రాక్టర్ మామిడి కాయలు కోయించడానికి సుమారు రూ.4 వేల వరకు ఖర్చవుతోంది. కోసిన కాయలను ఫ్యాక్టరీకి తరలించడానికి ట్రాక్టర్ అద్దె, కూలీల ఖర్చులు కలిపి మరో రూ.4 వేల నుంచి 5 వేల వరకు వ్యయం అవుతోంది. అంటే ఒక ట్రాక్టర్ కాయలను ఫ్యాక్టరీ గేటు వరకు తీసుకురావడానికే రైతు రూ. 8 వేల నుంచి 9 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత ఖర్చు చేసి తీసుకొచ్చిన కాయలను వెంటనే కొనుగోలు చేస్తారనే హామీ కూడా లేదు. ఫ్యాక్టరీల వద్ద రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఒకసారి కాయలు తీసుకొచ్చాక వారం రోజుల వరకు టోకెన్ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈలోపు ట్రాక్టర్లలోనే కాయలు మాగిపోతున్నాయి. నాణ్యత తగ్గిపోయిందని చెప్పి ఫ్యాక్టరీలు ధర తగ్గించడం లేదా పూర్తిగా తిరస్కరించడం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా మాగిపోయిన కాయలకు ఎవరు బాధ్యత వహించరని, నష్టమంతా రైతులే భరించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. టోకెన్ల కేటాయింపులో కూడా పారదర్శకత లేదని రైతులు విమర్శిస్తున్నారు. చాలా ఫ్యాక్టరీల్లో సాధారణ రైతులకు కాకుండా బంధుమిత్రులు, మధ్యవర్తులు, పరిచయస్తులకు మాత్రమే ముందుగా టోకెన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా చిన్న, మధ్య తరహా రైతులు ఫ్యాక్టరీ గేట్ల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ ఆలస్యం వల్ల కాయల నాణ్యత దెబ్బతిని చివరకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం ఫ్యాక్టరీలు రైతులకు కిలోకు కేవలం రూ. 4 నుంచి 
5 మాత్రమే చెల్లిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయం, ఎరువులు, కూలీలు, రవాణా ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ధరతో పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని రైతులు చెబుతున్నారు. గత ఏడాది, ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి మామిడికి కిలోకు ₹4 మద్దతు ధర (సబ్సిడీ) ప్రకటించినప్పటికీ అది రైతుల నష్టాలను పూడ్చేందుకు సరిపోవడం లేదని అభిప్రాయపడుతున్నారు. నిరంతరం నష్టాలు వస్తుండటంతో జిల్లాలో అనేక మంది రైతులు మామిడి సాగుపై ఆసక్తి కోల్పోతున్నారు. మామిడి చెట్లు భారంగా భావిస్తున్నారు. పాత తోటలను తొలగించి వాటి స్థానంలో ఇతర వాణిజ్య పంటలు సాగు చేయాలని నిర్ణయించుకుంటున్నారు. మరికొందరు తోతాపురి చెట్లకు నీలం వంటి రకాల అంట్లు కట్టి మార్కెట్‌లో మంచి ధర వచ్చే రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో చిత్తూరు జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని ఉద్యాన నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. మామిడి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, ధరల స్థిరీకరణ, మార్కెటింగ్, ఎగుమతులు, నిల్వ సదుపాయాల అభివృద్ధి కోసం ప్రత్యేక మామిడి బోర్డు అవసరమని రైతు సంఘాలు నిరంతరం కోరుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కూడా ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు. అయినప్పటికీ ఇప్పటివరకు మామిడి బోర్డు ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. ప్రత్యేక బోర్డు ఏర్పాటైతే రైతులకు గిట్టుబాటు ధర, పారదర్శక కొనుగోళ్లు, ఎగుమతుల విస్తరణ, శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధి వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మామిడి దినోత్సవం సందర్భంగా ప్రపంచం మామిడి తీపిని ఆస్వాదిస్తున్న వేళ, ఆ తీపిని అందించే రైతు మాత్రం నష్టాలు, అప్పులు, మార్కెట్ అనిశ్చితి, కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యం, ఫ్యాక్టరీల వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. పండ్లలో రారాజుగా వెలుగొందుతున్న మామిడి... రైతు జీవితంలో కూడా రాజులాంటి ఆదాయాన్ని అందించాలంటే గిట్టుబాటు ధరకు చట్టబద్ధ హామీ, పారదర్శక కొనుగోలు వ్యవస్థ, మామిడి బోర్డు ఏర్పాటు, ఎగుమతులకు ప్రోత్సాహం, ప్రాసెసింగ్ పరిశ్రమల నియంత్రణ వంటి చర్యలను ప్రభుత్వం అత్యవసరంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు. లేదంటే ప్రపంచానికి తీపిని అందించే చిత్తూరు మామిడి, రైతుల పొలాల్లో మాత్రం చేదు జ్ఞాపకంగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తమవుతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *