కుప్పానికి పారిశ్రామిక మహర్దశ
రూ.6,486 కోట్ల పెట్టుబడులతో 27 ప్రాజెక్టులకు శ్రీకారం
45 వేలకుపైగా ఉపాధి అవకాశాలకు నాంది..
దేశంలోనే ఆదర్శ పారిశ్రామిక నియోజకవర్గంగా కుప్పం
ఏ పథకం ప్రవేశపెట్టినా కుప్పం దృష్టిలో పెట్టుకునే
బెంగళూరు నుండి కుప్పానికి ఉద్యోగం కోసం రావాలని ఆకాంక్ష
కుప్పం వాసులకు ప్రపంచ స్థాయి ఉద్యోగాల కల్పన
ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మనసంతా కుప్పం మీదనే
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ పారిశ్రామిక, విద్యా, సాంకేతిక, హరిత నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అడుగు వేశారు. కుప్పం పర్యటనలో భాగంగా రూ.6,486 కోట్ల పెట్టుబడులతో 27 పారిశ్రామిక, మౌలిక వసతులు, విద్య, పర్యాటక, విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేసి, పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 45 వేలకుపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రకటించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ కుప్పాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే నంబర్‌వన్ పారిశ్రామిక నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
గుడుపల్లె మండలం పొగురుపల్లెలో రూ.200 కోట్లతో ఏబీఐఎస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి, ఈ పరిశ్రమ ద్వారా 1,400 మందికి ఉపాధి లభించడంతో పాటు స్థానిక పౌల్ట్రీ రైతులకు స్థిరమైన మార్కెట్ ఏర్పడుతుందని చెప్పారు. అదే కార్యక్రమంలో 44.58 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఏపీఐఐసీ ఎంఎస్‌ఎంఈ పార్కును ప్రారంభించారు. ఇందులో 167 పారిశ్రామిక ప్లాట్లు అందుబాటులోకి రానుండగా, యువత కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు ఇది వేదిక కానుందని పేర్కొన్నారు. అనంతరం రూ.150 కోట్లతో పయనీర్ క్లీన్ యాంప్స్ విమాన తయారీ యూనిట్, రూ.899 కోట్లతో హ్వాసుంగ్ గ్రూప్ పాదరక్షల పరిశ్రమ, రూ.2,081 కోట్లతో అథా గ్రూప్ బ్యాటరీ అనోడ్ మెటీరియల్ పరిశ్రమ, రూ.180 కోట్లతో న్యూట్రి ఫీడ్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, రూ.200 కోట్లతో ఎంఏఎఫ్ గార్మెంట్స్ పరిశ్రమ, రూ.137.10 కోట్లతో పవర్ ఎలక్ట్రానిక్స్ యూనిట్, రూ.952.33 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రాలు, రూ.559.15 కోట్లతో రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టు, హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్టర్, ఇస్కాన్ వేద సాంస్కృతిక కేంద్రం సహా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇంకోడాప్ టెక్నాలజీస్, షాలిమార్ గ్రూప్, శ్రీ సాయి పూజా ఎక్స్‌ప్లోజివ్స్, లక్ష్మీ హ్యాచరీస్, హెల్త్ ఫ్యాబ్, ఆటోనెక్స్ట్ ఆటోమేషన్, హెచ్‌ఐక్యూ పోర్ట్స్, మానసరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ, కివా హోటల్స్ తదితర సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ పెట్టుబడులు కుప్పం పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపునివ్వనున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పారిశ్రామికవేత్తల రౌండ్‌టేబుల్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో గతంలో 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ఉండేదని, ఇప్పుడు 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' రాష్ట్ర ప్రత్యేకతగా మారిందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే ప్రతి పారిశ్రామికవేత్తకు ప్రభుత్వం పూర్తి భాగస్వామిగా ఉంటుందని, "మీ పరిశ్రమ ఇకపై మా పరిశ్రమ కూడా" అని భరోసా ఇచ్చారు. బహిరంగ సభలో కుప్పం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు, కుప్పం అంటే తనకు కేవలం నియోజకవర్గం కాదని, అది ఒక భావోద్వేగమని అన్నారు. 48 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా, నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన కుప్పం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తాను ఎక్కడ ఉన్నా తన మనసు ఎప్పుడూ కుప్పంపైనే ఉంటుందని, ఈ ప్రాంతాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టే వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు సూత్రాలతో ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి యువకుడికి ఉద్యోగం, ప్రతి రైతుకు ఆదాయం, ప్రతి గ్రామానికి అభివృద్ధి అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కుప్పం యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగాలు కల్పించేందుకు అత్యుత్తమ కంపెనీలను తీసుకొస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, ఉద్యోగాలు చేయడమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అందుకోసమే కుప్పం నుంచే "వన్ ఫ్యామిలీ–వన్ ఆంట్రప్రెన్యూర్" కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. డ్వాక్రా మహిళలు దేశంలోనే అత్యధికంగా సూక్ష్మ పరిశ్రమలు స్థాపించి ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు కొనియాడారు. మహిళలను స్వయం ఉపాధి దిశగా మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు, యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించి పరిశ్రమలు స్థాపించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. కుప్పాన్ని పూర్తిగా హరిత, కాలుష్యరహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సౌర విద్యుత్, గ్రీన్ ఎనర్జీ, వ్యర్థాల నిర్వహణ, బయోఫ్యూయల్ ఉత్పత్తి, విద్యుత్ శ్మశానం, స్వచ్ఛ గ్రామాల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని, చెత్తను సంపదగా మార్చే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అడిడాస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, బ్యాటరీ, విమాన తయారీ, పవర్ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్, వస్త్ర పరిశ్రమలు కుప్పానికి రావడం రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో బెంగళూరుకు ఉద్యోగాల కోసం వెళ్లే పరిస్థితి కాకుండా, బెంగళూరు నుంచే పరిశ్రమలు, ఉద్యోగాల కోసం కుప్పానికి వచ్చే రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రోడ్లు, రైల్వే, విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్లు, గ్రానైట్ పార్కు, విద్యా సంస్థలు, ఐటీ హబ్, పారిశ్రామిక టౌన్‌షిప్‌లతో కుప్పం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని తెలిపారు. హంద్రీ–నీవా ద్వారా సాగునీరు, డ్రిప్ సాగు విస్తరణ, పాల ఉత్పత్తి పెంపు, ఇంటింటికీ తాగునీటి సరఫరా, సిమెంట్ రోడ్లు, ఎల్‌ఈడీ దీపాలు, ఆరోగ్య పరీక్షలు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చదివే అవకాశాలు కల్పిస్తామని, ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులను రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా బలోపేతం చేసి, మహిళలను పారిశ్రామికవేత్తలుగా, యువతను ఉపాధి సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తన రాజకీయ జీవితంలో అనేక పెట్టుబడుల సదస్సులు చూసినా, కుప్పంలో జరిగిన ఈ కార్యక్రమం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం, నేడు పెట్టుబడులకు కేంద్రంగా మారిందని, ఈ మార్పుకు సహకరించిన అధికారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కుప్పం ప్రజల్లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతోందని పేర్కొంటూ, అందరూ కలిసి కుప్పాన్ని దేశంలోనే నంబర్‌వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

