1, జులై 2026, బుధవారం

పథకం ముగిసింది - బకాయిలు మిగిలింది

పథకం ముగిసింది - బకాయిలు మిగిలింది
ముగిసిన జాతీయ ఉపాధి హామీ పథకం
ఈ పథకం మిగిల్చిన బకాయిలు రూ. 3187 లక్షలు
వేతన బకాయిలు రూ. 29.81 లక్షలు
మెటీరియల్ బకాయిలు రూ. 3157 లక్షలు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)

దాదాపు రెండు దశాబ్దాలుగా గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జూన్ 30తో ముగిసిపోయింది. అయితే పథకం ముగిసినా జిల్లాలో వేలాది మంది కూలీలు, గృహ నిర్మాణ లబ్ధిదారులు, పనులు పూర్తి చేసిన సరఫరాదారులకు అందాల్సిన రూ. 3187 లక్షల బకాయిలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ముఖ్యంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద గృహ నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసిన లబ్ధిదారులకు ఇప్పటికీ చెల్లింపులు జరగకపోవడంతో ఆ డబ్బులు వస్తాయా.. రావా..? అనే సందేహం వారిలో వ్యక్తమవుతోంది. కొత్త పథకం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాత పథకం బకాయిల పరిస్థితి ఏమవుతుందనే ఆందోళన గ్రామీణ ప్రాంతాల్లో నెలకొంది.

2006 ఫిబ్రవరి 2న ప్రారంభమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ నెలాఖరుతో చరిత్రలో కలిసిపోయింది. జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక అధ్యాయానికి ముగింపు పలికినట్లైంది. అయితే పాత పథకం కింద చేసిన పనులకు సంబంధించిన బకాయిలు ఇంకా పూర్తిగా విడుదల కాకపోవడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. చిత్తూరు జిల్లాలో గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఈ పథకం కింద మొత్తం రూ. 1,915.04 కోట్ల విలువైన పనులు చేపట్టారు. అందులో రూ. 1,245.63 కోట్లను కూలీల వేతనాలుగా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా, రూ. 671.63 కోట్లను మెటీరియల్ కాంపోనెంట్‌పై ఖర్చు చేశారు. చెరువుల పూడికతీత, ఫార్మ్‌పాండ్లు, చెక్‌డ్యామ్‌లు, పంటకాలువలు, గ్రామీణ రహదారులు, మొక్కల పెంపకం, భూసార అభివృద్ధి, గృహ నిర్మాణాలకు సంబంధించిన అనేక పనులు ఈ నిధులతో చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల సృష్టికి ఈ పథకం ప్రధాన ఆధారంగా నిలిచింది. ప్రస్తుతం జిల్లాలోని 624 గ్రామపంచాయతీల పరిధిలో 2.23 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, వాటిలో 3.83 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం 1.72 లక్షల జాబ్‌కార్డులకు చెందిన 2.73 లక్షల మంది క్రియాశీలకంగా ఉపాధి పనుల్లో ఉన్నారు. వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ కూలీలకు ఈ పథకం ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం ద్వారా వారి ఆర్థిక స్వావలంబన పెరిగింది. అయితే పథకం ముగిసే సమయానికి జిల్లాకు సంబంధించిన రూ. 3187 లక్షల బకాయిలు పెండింగ్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో వేతన బకాయిలు రూ. 29.81 లక్షలు కాగా, మెటీరియల్ కాంపోనెంట్ బకాయిలు రూ. 3157 లక్షలు ఉన్నాయి. ఉపాధి పనులు పూర్తి చేసిన కూలీలకు అందాల్సిన వేతనాలు ఇంకా జమ కాలేదు. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ కింద గృహ నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసిన లబ్ధిదారులు తమ సొంత డబ్బులు ఖర్చు చేసి పనులు పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన చెల్లింపులు అందలేదు. దీంతో అప్పులు చేసి పనులు పూర్తి చేసిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతన బకాయిల్లో కుప్పం మండలానికి రూ. 4.92 లక్షలు, నగిరి మండలానికి రూ. 3.98 లక్షలు, శ్రీరంగరాజపురం మండలానికి కూడా గణనీయమైన మొత్తం విడుదల కావాల్సి ఉంది. అదే విధంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద యాదమరి మండలానికి రూ. 484 లక్షలు, కుప్పం మండలానికి రూ. 350 లక్షలు, పెనుమూరు మండలానికి రూ. 337 లక్షలు, శాంతిపురం మండలానికి రూ. 269 లక్షలు, గుడిపల్లి మండలానికి రూ. 200 లక్షలకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మొత్తాలు విడుదల కాకపోవడంతో పనులు చేసిన లబ్ధిదారులు, సరఫరాదారులు, నిర్మాణదారులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. 2005లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉపాధి హామీ చట్టం ఆధారంగా దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ పథకంలో తొలి విడతలోనే చిత్తూరు జిల్లా చోటు దక్కించుకుంది. 2009లో మహాత్మాగాంధీ పేరు జోడించిన తర్వాత ఈ పథకం గ్రామీణాభివృద్ధికి ప్రతీకగా మారింది. గ్రామాల్లో ఉపాధి కల్పించడం మాత్రమే కాకుండా చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలోనూ విశేష ఫలితాలను అందించింది. ఇప్పుడు కొత్త పథకం అమల్లోకి వచ్చినప్పటికీ పాత పథకం బకాయిలు ఎప్పుడు విడుదల అవుతాయనే అంశంపై స్పష్టత లేకపోవడం లబ్ధిదారుల్లో ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద గృహాలు నిర్మించిన వారు, అభివృద్ధి పనులు పూర్తి చేసిన వారు తమకు రావాల్సిన డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం పాత బకాయిలను పూర్తిగా విడుదల చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. లేదంటే ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా ఇచ్చిన పథకంగానే కాకుండా, చివరికి వేలాది కుటుంబాలకు బకాయిల భారం మిగిల్చిన పథకంగా గుర్తుండిపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *