బంగారం తనఖా వ్యవహారంలో అవకతవకలు
డీసీసీబీ గాంధీ రోడ్ శాఖలో
మేనేజర్ మహేష్ సస్పెన్షన్.. అప్రైజర్ శరవణ తొలగింపు
తక్కువ నాణ్యత బంగారంపై రూ.50 లక్షలకు పైగా రుణాలు..
తనిఖీలో వెలుగులోకి అక్రమాలు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
చిత్తూరు నగరంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) గాంధీ రోడ్ శాఖలో బంగారం తనఖా రుణాల మంజూరులో జరిగిన తీవ్ర అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని తనఖా పెట్టుకుని అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసిన ఘటనపై బ్యాంకు ఉన్నతాధికారులు నిర్వహించిన తనిఖీలో ఆరోపణలు నిజమని తేలడంతో శాఖ మేనేజర్ మహేష్‌ను సస్పెండ్ చేయగా, బ్యాంకు అప్రైజర్ శరవణను ఉద్యోగం నుంచి తొలగించారు.
బ్యాంకుకు అందిన ఫిర్యాదుల ఆధారంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు గాంధీ రోడ్ శాఖలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని అసలు విలువ కంటే ఎక్కువగా అంచనా వేసి రుణాలు మంజూరు చేసినట్లు గుర్తించారు. మొత్తం 17 మంది వ్యక్తులు నాసిరకం బంగారాన్ని తనఖా పెట్టి రూ.50 లక్షలకు పైగా రుణాలు పొందినట్లు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంపై జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంకర్‌బాబు మాట్లాడుతూ, ఫిర్యాదు అందిన వెంటనే గాంధీ రోడ్ శాఖలో ఉన్న బంగారం తనఖా ఖాతాలన్నింటినీ సమగ్రంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. తనిఖీలో 17 మంది తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని తనఖా పెట్టి రూ.50 లక్షలకు పైగా రుణాలు పొందిన విషయం నిర్ధారణ అయిందన్నారు. ఈ అక్రమ రుణాల విషయంలో సంబంధిత వ్యక్తుల నుంచి మొత్తం బకాయిలను రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. అయితే శాఖ స్థాయిలో నిర్లక్ష్యం, విధి నిర్వహణలో లోపాలు స్పష్టంగా బయటపడటంతో బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని చెప్పారు. శాఖ మేనేజర్ మహేష్‌ను సస్పెండ్ చేయగా, బంగారం నాణ్యతను అంచనా వేసే బాధ్యతలో ఉన్న అప్రైజర్ శరవణను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో జిల్లా సహకార బ్యాంకు శాఖల్లో బంగారం తనఖా రుణాల ప్రక్రియపై మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల్లో బంగారం తనఖా రుణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

