ప్రత్యేక టెట్‌తో సీనియర్ ఉపాధ్యాయులకు ఊరట.
.
2011కు ముందు నియామకమైన వారికి మరో అవకాశం
ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఆందోళన చెందుతున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా స్పెషల్ టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శ్యామలరావు మెమో నెం.3303567 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దశాబ్దాలుగా బోధనా సేవలందిస్తున్న సీనియర్ ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దీంతో రాష్ట్రంలో 2011కు ముందు ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో నియమితులై ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న వేలాది మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు టెట్ అర్హత కలిగి ఉండాలని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. టెట్ నుంచి మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన న్యాయస్థానం, ఇప్పటికే సేవలో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత సాధించేందుకు 2028 ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చింది. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులై పదవీ విరమణకు ఐదేళ్లకు పైగా సర్వీసు ఉన్న ఉపాధ్యాయులందరికీ ఈ నిబంధన వర్తించనుంది.
ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక టెట్‌కు 2011కు ముందు పాఠశాల విద్యాశాఖలో నియమితులై ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న ఉపాధ్యాయులందరూ అర్హులు. సాధారణ ఏపీ టెట్‌కు అదనంగా వీరి కోసమే ఈ పరీక్షను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. 2026 డిసెంబరు లేదా 2027 ప్రారంభంలో ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అవసరమైతే ఒకటి కంటే ఎక్కువసార్లు కూడా ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం చాలామందిలో తలెత్తుతున్న ప్రశ్న టెట్ లేకుండానే అప్పట్లో ఉపాధ్యాయులను ఎలా నియమించారనేదే. వాస్తవానికి 2009లో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తరువాత 2010 ఆగస్టు 23న జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) టెట్‌ను కనీస అర్హతగా ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెట్ పరీక్ష 2011 జూలైలోనే నిర్వహించారు. అందువల్ల 1998, 2000, 2002, 2003, 2008, 2010 వరకు జరిగిన డీఎస్సీ నియామకాల సమయంలో టెట్ అనే అర్హత పరీక్షే అమల్లో లేదు. అప్పటి నిబంధనల ప్రకారమే డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులను ప్రభుత్వం ఉపాధ్యాయులుగా నియమించింది. అంటే టెట్ లేకపోవడం అప్పటి ఉపాధ్యాయుల తప్పు కాదు. ప్రభుత్వం అమలు చేసిన నిబంధనల ప్రకారమే వారు ఉద్యోగాల్లో చేరారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత సీనియర్ ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముప్పై సంవత్సరాలుగా బోధనా సేవలందిస్తున్న తమకు ఇప్పుడు టెట్ తప్పనిసరి చేయడం సరికాదంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాయి. ఈ అంశాన్ని ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్, పేరాబత్తుల రాజశేఖర్‌లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అంగీకరించడంతో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం మొత్తం 11,437 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో 2010 తర్వాత నియమితులైన వారికి టెట్ అర్హత ఉంది. అయితే 1998 నుంచి 2003 మధ్య నిర్వహించిన డీఎస్సీల ద్వారా పెద్ద సంఖ్యలో నియామకాలు జరగడంతో జిల్లాలో ప్రస్తుతం సుమారు 5,639 మంది టెట్ అర్హత లేని ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నట్లు అంచనా. ప్రత్యేక టెట్ నిర్వహణతో వీరందరికీ మరో అవకాశం లభించనుంది. గతేడాది నిర్వహించిన టెట్ పరీక్షకు జిల్లాలోని ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల్లో సుమారు 30 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో కూడా వందల సంఖ్యలో మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇప్పటికీ ఐదు వేల మందికి పైగా టెట్ అర్హత సాధించాల్సి ఉంది. ఇటీవల నిర్వహించిన టెట్‌కు సుమారు 40 శాతం మంది దరఖాస్తు చేసినట్లు సమాచారం. ప్రత్యేక టెట్ నిర్వహణను స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాలు పరీక్షను ఆన్‌లైన్‌కు బదులుగా పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించాలని, ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులకు అనుగుణంగా ప్రశ్నలు ఇవ్వాలని, శాఖాపరమైన పరీక్షల మాదిరిగా కనీస ఉత్తీర్ణత మార్కులను 40గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేక టెట్ నిర్వహణకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. పరీక్ష తేదీలు, దరఖాస్తు విధానం, సిలబస్, పరీక్షా నమూనా తదితర వివరాలతో కూడిన పూర్తి నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ త్వరలో విడుదల చేయనుంది. ప్రత్యేక టెట్ నిర్వహణ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనను తగ్గించడంతో పాటు, సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగా టెట్ అర్హత సాధించేందుకు మరో కీలక అవకాశంగా మారనుంది.

