డ్వాక్రా సంఘాల్లో పెరుగుతున్న మొండి బకాయిలు
రుణాలు చెల్లించని సభ్యులతో బ్యాంకులకు భారీ నష్టం
పర్యవేక్షణ లోపం, రాజకీయ ఒత్తిళ్లతో దెబ్బతింటున్న ఆర్థిక క్రమశిక్షణ
జిల్లాలో సుమారుగా రూ. 200 కోట్ల బకాయిలు?
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
ఒకప్పుడు ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా సంఘాలు) ప్రస్తుతం మొండి బకాయిల సమస్యతో సతమతమవుతున్నాయి. మహిళల ఆర్థిక సాధికారత కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలో క్రమంగా నియంత్రణ సడలిపోవడం, పర్యవేక్షణ లోపించడం, కొంతమంది బాధ్యుల నిర్లక్ష్యం కారణంగా కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోతున్నాయని బ్యాంకు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని అనేక బ్యాంకు శాఖల్లో ఒక్కో శాఖకు సుమారు రూ.1 కోటి వరకు డ్వాక్రా రుణాల మొండి బకాయిలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 20050కి పైగా బ్యాంకు శాఖలో ఉన్నాయి. మున్సిపాలిటీల్లో గ్రామీణ ప్రాంతాల్లో కలుపుకుంటే మొత్తం మీద 200 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులకు స్వయం సహాయక బృందాల నుండి బకాయిలుగా ఉన్నట్లు సమాచారం.
ఇక గ్రామ సమాఖ్య నడి తీసుకున్న రుణాలు అవుతాయి మండలంలో రెండు, మూడు గ్రామాలలో అసలు కట్టడం లేదు. ఈ విషయం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తెలిసిన ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. కనీసం సంఘమిత్రల మీద, గ్రామ సమస్యల మీద ఒత్తిడి కూడా తేవడం లేదు. మన జీవితం మనకు వస్తుంది కదా అన్న భావనలు సీసీలు విధులను నిర్వహిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం 34,923 స్వయం సహాయక బృందాలు పనిచేస్తుండగా, వాటి నిర్వహణ కోసం 1,247 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 3.42 లక్షల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. గ్రామ స్థాయిలో సంఘమిత్రలు, గ్రామ సమాఖ్యల నాయకులు, మండల స్థాయిలో సమన్వయకర్తలు, ఇతర అధికారులు ఈ వ్యవస్థను పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయని సమాచారం. డ్వాక్రా మహిళలకు సంఘం పొదుపు నిధుల నుంచి, గ్రామ సమాఖ్య నిధుల నుంచి, శ్రీనిధి ద్వారా, అలాగే బ్యాంకు అనుసంధాన రుణాల రూపంలో నాలుగు మార్గాల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంది. గత ఏడాది జిల్లాలో డ్వాక్రా మహిళలకు రూ. 1,730 కోట్లు రుణాలుగా అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ రుణాలతో ఎంతోమంది మహిళలు చిన్న వ్యాపారాలు, పాడి పరిశ్రమ, కుట్టు కేంద్రాలు, చిరు పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటున్నారు. అయితే ఇదే అవకాశాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు.
రుణాలు తీసుకున్న తర్వాత కొంతమంది మహిళలు గ్రామాలను విడిచి పట్టణాలకు వెళ్లి స్థిరపడిపోతున్నారు. మరికొందరు అద్దె ఇళ్లు మార్చేస్తూ ఫోన్ నంబర్లు కూడా మార్చేస్తున్నారు. దీంతో వారిని గుర్తించడం, బకాయిలు వసూలు చేయడం బ్యాంకులకు కష్టసాధ్యంగా మారుతోంది. లక్షల రూపాయల రుణాలు తీసుకున్నా తిరిగి చెల్లించకుండా తప్పించుకుంటున్న సంఘటనలు పెరుగుతున్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. డ్వాక్రా సంఘంలో తీసుకున్న అప్పుడు తిరిగి చెల్లించలేదని ఇటీవల చిత్తూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట గొడవ కూడా జరిగింది. ఈ విషయంలో చిత్తూరుకు చెందిన ప్రజాప్రతినిధులు కలగజేసుకోవడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు అయ్యింది. ఎవరైనా గట్టిగా బకాయిలు చెల్లించమని అడిగితే వారి మీద దాడులు చేయడం కేసులు పెట్టడం వంటివి జరుగుతున్నాయి. చాలాచోట్ల రాజకీయ వత్తిళ్ల కారణంగా బకాయిలు పేరుకుపోతున్నాయి. బకాయిలను వసూలు చేయడంలో డ్వాక్రా యంత్రాంగం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని ఒక బ్యాంకు మేనేజర్ ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు వసూలు చేసేందుకు వెళ్లినప్పుడు కొంతమంది మహిళలు ఏం చేసుకుంటారో చేసుకోండి... మేము చెల్లించం అంటూ సవాల్ చేస్తున్న పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. రాజకీయ అండదండలు ఉన్న కొందరు సభ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు కూడా వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు కూడా సభ్యుల పేరు మీద రుణాలు తీసుకొని చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
.
ఇంకోవైపు గ్రామ సమాఖ్యల నిధుల వినియోగంపైనా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది గ్రామ సమాఖ్య నాయకులు, సంఘమిత్రలు తమకు అనుకూలమైన వ్యక్తులు, బంధుమిత్రులకు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ రుణాలు తిరిగి రాకపోయినా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని సభ్యులే చెబుతున్నారు. కొంతమంది సమన్వయకర్తలు కూడా వాళ్లు ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు తీసుకుంటాం అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారని సమాచారం. ఐరాల మండలంలోని రెండు గ్రామ సమాఖ్యలు ఇందుకు ప్రబల నిదర్శనం. మరోవైపు కొంతమంది సిబ్బంది డ్వాక్రా సభ్యులకు పూర్తి సమాచారం ఇవ్వకుండా వారి పేర్లపై రుణాలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సభ్యులు అంటున్నారు.
ఈ పరిస్థితుల ప్రభావం నిజాయితీగా రుణాలు చెల్లించే మహిళలపై పడుతోంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించే సభ్యులు కూడా చెల్లించని వారిపై చర్యలు లేకపోతే మేమెందుకు చెల్లించాలి? అనే భావనకు లోనవుతున్నారని గ్రామీణ ప్రాంతాల్లో చర్చ జరుగుతోంది. దీంతో డ్వాక్రా సంఘాల ఆర్థిక క్రమశిక్షణ క్రమంగా దెబ్బతింటోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకుల్లోనే కాకుండా గ్రామ సమాఖ్యల వద్ద కూడా బకాయిలు పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. వసూలు చేయాల్సిన నిధులు నిలిచిపోవడంతో కొత్తగా రుణాలు ఇవ్వడంపైనా ప్రభావం పడుతోంది. దీంతో నిజంగా అవసరమైన మహిళలకు రుణాలు అందడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ఈ అంశంపై జిల్లా స్థాయిలో సమగ్ర సమీక్ష నిర్వహించి, మొండి బకాయిలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని బ్యాంకర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు కోరుతున్నారు. రుణాలు ఎగ్గొట్టిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, గ్రామ సమాఖ్యల ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచిస్తున్నారు. లేకపోతే మహిళల ఆర్థిక స్వావలంబనకు ఆదర్శంగా నిలిచిన డ్వాక్రా వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

