6, ఆగస్టు 2023, ఆదివారం

చంద్రబాబు గారడీ ! ఖంగుతిన్న సుధీర్ రెడ్డి !



 శ్రీ కాళహస్తిలో  శనివారం జరిగిన టిడిపి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గ తెలుగు దేశం అభ్యర్థి ఎవరో సభా ముఖంగా ప్రకటించ లేదు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సెంట్ మెంట్ తో సహా పలు రకాలుగా తన మీద  ఒత్తిడి తెచ్చినా, సుధీర్ రెడ్డి వర్గీయులను సంతృప్తి పర్చేందుకు  గోపాలకృష్ణారెడ్డి కుటుంబ రాజకీయ వారసత్వంతో  ప్రసంగం ప్రారంభించారు. అయితే చంద్రబాబు నాయుడు పర్యటనల సందర్భంగా పులివెందుల, కదిరి నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించి సస్పెన్స్ కు తెర దించారు. శ్రీ కాళహస్తి లో కూడా ఆలా చేయించాలనే సుధీర్ రెడ్డి ప్రయత్నాలు విఫలమయ్యాయి.


తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తిలో టిడిపి రాజకీయాలు బహు రసవత్తరంగా వున్నాయి. మొన్నటి వరకు తనే అభ్యర్థి అని జెట్ స్పీడ్ లో వుండిన సుధీర్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు యస్సీవీ నాయుడు అనే స్పీడ్ బ్రేకర్ ను తెర మీదకు తేవడంతో వాస్తవంలో సుధీర్ రెడ్డి తన అభ్యర్థిత్వంపై డైలమాలో పడ్డారు. మాజీ ఎమ్మెల్యే  యస్సీవీ నాయుడు తనకు స్పీడ్ బ్రేకర్ అవుతారని తొలి నుండి సుధీర్ రెడ్డి భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలో  అంత క్రితం సుధీర్ రెడ్డే టిడిపిలో చేర్పించిన మరొక మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య వైసిపి అభ్యర్థి మధుసూధన రెడ్డిని ఎదిరించే సత్తా సుధీర్ రెడ్డికి లేదని భావించడంతో కథ అడ్డం తిరిగింది. మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య తన చొరవతో యస్సీవీ నాయుడును టిడిపిలోనికి తీసుకువచ్చారు. యస్సీవీ నాయుడు సత్తా బాగా తెలిసిన చంద్రబాబు నాయుడు సుధీర్ రెడ్డి అభ్యంతరం పెట్టినా, లెక్క చేయకుండా టిడిపిలోనికి తీసుకున్నారు. అప్పటి నుండి శ్రీ కాళహస్తి టిడిపి అభ్యర్థి ఎవరనే అంశంపై సిగ పట్లు సాగుతున్నాయి.


ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో చంద్రబాబు నాయుడు పర్యటన నిర్ణయం కాగానే శ్రీ కాళహస్తిలో జరిగిన సన్నాహ సమావేశంలో చిన్న రచ్చ జరిగింది. ఈ సమావేశంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తను అభ్యర్థి అనే ధోరణిలో ప్రసంగించుతుండగా మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయడానికి సమావేశం నిర్వహిస్తుండగా మధ్యలో అభ్యర్థిత్వం గురించి మాట్లాడటం సమంజసం కాదని సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో ఒకరిద్దరు మాట్లాడుతుండగా మాజీ ఎమ్మెల్యే యస్సీవీ నాయుడు జోక్యం చేసుకొని అందరం కలసి కట్టుగా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను చర్చించుదామని సర్ది చెప్పారు.


అప్పటి నుంచి సుధీర్ రెడ్డి తనను అభ్యర్థిగా శ్రీ కాళహస్తి సభలో చంద్రబాబు నాయుడు చేత ప్రకటించ చేస్తానని సవాలు చేసి సకల యత్నాలు చేశారు. జిల్లా టిడిపికి చెందిన కొందరు నేతలు పర్యవేక్షకుడుగా వుంటే ఒక ఎమ్మెల్సీ ఇతరులు పలువురు చేత చంద్రబాబు నాయుడుకు చెప్పించడం జరిగింది. గమనార్హమైన అంశమేమంటే పానకంలో పుడకలాగా ఈ లోపు సర్వేకు వచ్చిన ఒక టీమ్ సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చిందనే ప్రచారం విస్తృతంగా వుంది. తమాషా ఏమంటే 2019 ఎన్నికల తర్వాత పార్టీని అంటి పెట్టుకొని వున్న పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు సుధీర్ రెడ్డి వ్యవహార సరళిపై వ్యతిరేకంగా వున్నారని దబాయింపు రాజకీయం ఎక్కువ అని భావిస్తున్నట్లు సమాచారం కూడా చంద్రబాబు నాయుడుకు చేరినట్లు ప్రచారంలో వుంది. ఇదిలా వుండగా ఒక మహిళ నేత యెడల సుధీర్ రెడ్డి వ్యవహరించిన తీరుతో సహా అన్ని అంశాలు సర్వే బృందం తమ రిపోర్టరులో పొందు పర్చినట్లు కూడా తెలుస్తోంది. ఈ  ఈ సమాచారం లోకేష్ కు చేరింది. మహిళా నేత యెడల వ్యవహరించిన తీరు లోకేష్ కూడా సీరియస్ గా తీసుకున్నారంటున్నారు. 

కొసమెరుపు ఏమంటే మాజీ ఎమ్మెల్యే యస్సీవీ నాయుడు పార్టీలో చేరే వరకు సుధీర్ రెడ్డి ఎంత కఠినంగా వ్యవహరించినా, గత్యంతరం లేక కుక్కిన పేనుల్లా వుండిన ద్వితీయ శ్రేణి పలువురు నాయకులకు ఊరట లభించింది. కొందరు అధిష్టానం వర్గానికి సమాచారం చేర వేయడమే కాకుండా సర్వే బృందాలకు మనసు విప్పిచెప్పేశారని ప్రచారంలో వుంది. ఈ పరిస్థితుల్లో  శ్రీకాళహస్తి లో జరిగిన సభలో సుధీర్ రెడ్డిని తెలుగు దేశం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించక పోవడంతో సుధీర్ రెడ్డి ఖంగు తిన్నారు. ఏ పక్షంలోనూ తప్పకుండా అభ్యర్థిగా సుధీర్ రెడ్డిని సభా ముఖంగా ప్రకటిస్తారని ఆశించిన ఆయన వర్గీయులు నిరాశ నిస్పృహల్లో పడ్డారని  ప్రచారం జరుగుతోంది. తన మీద వచ్చిన తీవ్ర ఒత్తిడి వలన చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో బొజ్జల కుటుంబం గురించి వివరించారు. ఇదిలా వుండగా ఏ మీడియా అయినా అభ్యర్థిత్వం గురించి ప్రస్తావిస్తే ఎం సమాధానం వస్తుందో అనే  ఉత్సుకత రెండు వర్గాల్లో వుండింది. ఎవరూ ఆ అంశం ప్రస్తావించ లేదు. పార్టీ కార్యక్రమాల్లో ముఠాలు వెల్లడి కాకుండా మాజీ ఎమ్మెల్యే యస్సీవీ నాయుడు జాగ్రత్త పడటం రాజకీయ వర్గాలు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 


సుధీర్ రెడ్డి ఎంత దూకుడు ప్రదర్శించినా యస్సీవీనాయుడు ఓపిగ్గా వుండటంపై నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. ఈ దూకుడే సుధీర్ రెడ్డికి మైనస్ అవుతోందనే ప్రచారం కూడా ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుడు ఒకరు మాట్లాడుతూ యస్సీవీ నాయుడు పార్టీలో చేరిన తర్వాత శ్రీ కాళహస్తి నియోజకవర్గ రాజకీయ సినారియో మారి పోయిందన్నారు. ఒక వేళ సుధీర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినా అంతకు ముందే యస్సీవీ నాయుడు, మునిరామయ్యలను ఒప్పించాలని,  ఏక పక్షంగా ప్రకటించే అవకాశాలు లేవని చెప్పారు. కాగా ఇదే విధమైన కామెంట్ లోకేష్ కూడా చేశారని టిడిపి ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *