26, జూన్ 2026, శుక్రవారం

కనుమరుగు కానున్న జాతీయ ఉపాధి హామీ పథకం

కనుమరుగు కానున్న జాతీయ ఉపాధి హామీ పథకం

జిల్లాలో ఐదేళ్లలో రూ.1,915.04 కోట్ల ఉపాధి పనులు

రూ.1,245.63 కోట్లు కూలీల వేతనాలకే..

గ్రామీణాభివృద్ధికి వెన్నెముకగా ఉపాధి హామీ పథకం

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

గత 20 సంవత్సరాల కిందట ప్రారంభమైన  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ నెలాఖరుతో కనుమరుగు కానుంది. ఉపాధి హామీ చట్టం స్థానంలో విబిజి రాంజీ (వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్) అనే నూతన పథకం జూన్ నెల నుండి అమలులోకి రానుంది.  2006 ఫిబ్రవరి 2న ప్రారంభమైన జాతీయ ఉపాధి హామీ పథకం 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చిత్తూరు జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్.) గ్రామీణ పేద కుటుంబాలకు జీవనాధారంగా, గ్రామీణాభివృద్ధికి ప్రధాన సాధనంగా కొనసాగింది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2021-22 నుంచి 2025-26 వరకు) జిల్లాలో ఈ పథకం కింద మొత్తం రూ.1,915.04 కోట్ల విలువైన పనులు చేపట్టగా, అందులో రూ.1,245.63 కోట్లను కూలీల వేతనాలుగా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మరో సుమారు రూ.671.63 కోట్లను మెటీరియల్ కాంపోనెంట్‌పై వెచ్చించారు. ఈ భారీ వ్యయంతో లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ఉపాధి లభించడంతో పాటు గ్రామాల్లో చెరువులు, కాలువలు, రహదారులు, భూసార అభివృద్ధి, నీటి సంరక్షణ వంటి శాశ్వత ఆస్తులు ఏర్పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ భద్రతను కల్పించడంతో పాటు వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది.

ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని 624 గ్రామపంచాయతీల పరిధిలో 2.23 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో 3.83 లక్షల మంది ఉపాధి హామీ పథకంలో నమోదయ్యారు. అందులో 1.72 లక్షల జాబ్ కార్డులకు చెందిన 2.73 లక్షల మంది ప్రస్తుతం క్రియాశీలకంగా ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ కూలీలకు ఈ పథకం ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తోంది. ముఖ్యంగా భూమిలేని వ్యవసాయ కార్మికులు, మహిళలు, నిరుపేద కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2005లో అమలు చేసింది. ఈ చట్టం ఆధారంగా దేశవ్యాప్తంగా తొలి విడతలో 2006 ఫిబ్రవరి 2న 200 జిల్లాల్లో పథకం ప్రారంభమైంది. తొలి విడతలో ఎంపికైన జిల్లాల్లో చిత్తూరు జిల్లా కూడా ఒకటి కావడంతో అదే రోజు జిల్లాలో అమలు ప్రారంభమైంది. తరువాత దశల వారీగా దేశంలోని అన్ని గ్రామీణ జిల్లాలకు విస్తరించింది. అనంతరం 2009 అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈ పథకానికి మహాత్మాగాంధీ పేరు జోడిస్తూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా కేంద్ర ప్రభుత్వం పేరు మార్చింది. గ్రామస్వరాజ్యం, గ్రామీణాభివృద్ధి, స్వయం సమృద్ధి అనే మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం సాధించిన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని పట్టణ పేదలకు కూడా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020లో వైఎస్సార్ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నిరుపేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడం దీని ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణ కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధిని చట్టబద్ధంగా హామీ ఇవ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా గ్రామీణ పేదరికాన్ని తగ్గించడం, వ్యవసాయేతర కాలంలో ఉపాధి కల్పించడం, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలను తగ్గించడం, మహిళలకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామాల్లో శాశ్వత ఆస్తులను సృష్టించడం, సహజ వనరులను పరిరక్షించడం, భూగర్భ జలాలను పెంపొందించడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం వంటి అనేక లక్ష్యాలతో ఈ పథకం అమలు జరిగింది. ఈ పథకం కింద మహిళలకు కనీసం మూడో వంతు ఉపాధి కల్పించాలనే నిబంధన ఉండటంతో గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు కూడా ఇది దోహదపడింది. ఈ పథకం ద్వారా చెరువుల పూడికతీత, వాననీటి సంరక్షణ పనులు, చెక్‌డ్యామ్‌లు, ఫార్మ్‌పాండ్లు, పంటకాలువల నిర్మాణం, భూసార అభివృద్ధి, మొక్కల పెంపకం, గ్రామీణ రహదారులు, పంచాయతీ భవనాలు, వరద నివారణ పనులు, భూమి అభివృద్ధి వంటి అనేక పనులు చేపట్టారు. వీటి ద్వారా గ్రామాల్లో శాశ్వత ఆస్తులు ఏర్పడటమే కాకుండా వ్యవసాయ రంగానికి అవసరమైన నీటి లభ్యత పెరుగుతోంది. చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగింది. చిత్తూరు జిల్లా వంటి వ్యవసాయాధారిత ప్రాంతంలో ఈ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కరువు పరిస్థితులు, వర్షాభావం, వ్యవసాయ పనులు తగ్గిన సమయంలో వేలాది కుటుంబాలకు ఈ పథకం ఆదుకునే చేయిగా మారింది. గ్రామాల్లో నగదు ప్రవాహం పెరగడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిచ్చింది. మహిళలు అధిక సంఖ్యలో ఉపాధి పనుల్లో పాల్గొనడం వల్ల కుటుంబ ఆదాయం పెరగడమే కాకుండా వారి ఆర్థిక స్వావలంబన కూడా బలోపేతమైంది.

*ఐదేళ్లలో వ్యయం చేసిన నిధులు*

చిత్తూరు జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.676.33 కోట్ల విలువైన పనులు చేపట్టగా, అందులో రూ.390.92 కోట్లు వేతనాలుగా, రూ.267.31 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్‌పై వ్యయం చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.356.49 కోట్ల పనులు చేపట్టి, రూ.192.09 కోట్లు కూలీల వేతనాలుగా, రూ.144.70 కోట్లు మెటీరియల్‌పై ఖర్చు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.314.56 కోట్ల పనులు నిర్వహించి, రూ.297.09 కోట్లు వేతనాలుగా, రూ.92.40 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్‌పై వెచ్చించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.320.08 కోట్ల వ్యయం చేయగా, అందులో రూ.222.78 కోట్లు వేతనాలుగా, రూ.80.40 కోట్లు మెటీరియల్‌పై ఖర్చు చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.247.58 కోట్ల పనులు చేపట్టి, రూ.142.75 కోట్లు కూలీల వేతనాలుగా, రూ.86.82 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్‌పై వ్యయం చేశారు. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.126.15 కోట్ల విలువైన పనులు చేపట్టగా, అందులో రూ.60.02 కోట్లు వేతనాలుగా, రూ.63.82 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్‌పై ఖర్చు చేశారు. ఉపాధి హామీ పథకం అమలుతో గ్రామాల్లో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయి. వ్యవసాయ పనులు లేని కాలంలో ఉపాధి లభించడం వల్ల గ్రామీణ కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి తగ్గింది. గ్రామాల్లో నీటి వనరుల అభివృద్ధి జరగడంతో వ్యవసాయానికి ఉపయోగపడే మౌలిక వసతులు పెరిగాయి. మహిళల భాగస్వామ్యం పెరగడం ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడింది. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణలో ఈ పథకం విశేష ఫలితాలను అందించింది. అయితే వేతనాల చెల్లింపుల్లో జాప్యం, నిధుల విడుదల ఆలస్యం, పనుల ఆమోదంలో సాంకేతిక సమస్యలు వంటి ఇబ్బందులు అప్పుడప్పుడు ఎదురవుతున్నాయి. కొత్త పథకంలో వీటిని అధిగమించి మరింత సమర్థవంతంగా అమలు చేస్తే గ్రామీణాభివృద్ధికి ఈ పథకం మరింత బలమైన సాధనంగా నిలుస్తుందని అధికారులు, గ్రామీణాభివృద్ధి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పిస్తూ, గ్రామాల్లో శాశ్వత ఆస్తులను సృష్టిస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ నెలాఖలతో కనుమరుగు కానుండడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *