5, ఏప్రిల్ 2026, ఆదివారం

స్థానిక సంస్థల ఎన్నికలకు ఆరు నెలలు ఆగాల్సిందేనా ?

జనగణన, ఓటర్ల జాబితా సవరణ తర్వాతే ఎన్నికల దిశగా అడుగులు


 ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలు, పట్టణాలు… 

 పార్టీ నిర్మాణం అసంపూర్తి… ఎన్నికలకు సిద్ధం కాని టీడీపీ


 ఒకేసారి అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వ యోచన


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మరో ఆరు నెలలపాటు ఎన్నికలు వాయిదా పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఇక సెప్టెంబర్ 24, 25 తేదీలతో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీలు), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (జడ్పీటీసీలు) పదవీకాలం ముగియనుండటంతో, మొత్తం స్థానిక సంస్థల వ్యవస్థ ఒకేసారి ఎన్నికల దిశగా వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నికల కంటే ముందుగా నిర్వహించాల్సిన కీలక కార్యక్రమాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యే జనగణన ప్రక్రియ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల మొదటి తేదీ నుంచి ప్రారంభమయ్యే జనగణన కోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం జరుగుతోంది. ఈ ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో ప్రతి గ్రామం, ప్రతి ఇంటి వివరాలను సేకరించి గణాంకాలు సిద్ధం చేస్తారు. అనంతరం ప్రతి ఎన్యూమరేటర్‌కు ఇళ్లను కేటాయించి సమగ్ర సమాచారం సేకరించే విధంగా ప్రణాళిక రూపొందించారు.

ఈసారి ప్రత్యేకంగా కుల గణన చేపట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇది పూర్తవ్వడానికి సమయం పట్టే అవకాశం ఉంది. జనగణన అనంతరం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపట్టనున్నారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, వలస వెళ్లిన వారి వివరాల సవరణ వంటి అంశాలతో పకడ్బందీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీలలో మార్చి 17 నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. గ్రామపంచాయతీలకు కూడా ఏప్రిల్ 3 నుంచి ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రజాప్రతినిధులు లేకుండా అధికారుల చేతుల్లోనే పరిపాలన కొనసాగడం వల్ల స్థానిక సమస్యల పరిష్కారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రతినిధులు లేకపోవడం గ్రామీణ ప్రాంతాల్లో కొంత అసంతృప్తిని కలిగిస్తోంది. ఇక రాజకీయపరంగా చూస్తే కూడా ప్రధాన పార్టీలు ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేవని స్పష్టమవుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను పూర్తిగా ఏర్పాటు చేయలేకపోయింది. కొన్ని మండలాల్లో కమిటీలు నియామకం విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయి కమిటీల నియామకం కూడా ఇంకా పూర్తి కాలేదు.

ఇదే సమయంలో ప్రభుత్వపరంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఇంకా పూర్తికాలేదు. కార్పొరేషన్లలో ఖాళీలను భర్తీ చేయడం, వాటికి డైరెక్టర్లను నియమించడం వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఈ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతలు, కార్యకర్తలలో కొంత అసంతృప్తి నెలకొంది. ఈ అసంతృప్తిని నివారించి, పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. మరో ముఖ్య అంశం ఏమిటంటే, గతంలో పంచాయతీ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు విడివిడిగా నిర్వహించడం వల్ల భారీగా వ్యయం అవుతోంది. ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల నిర్వహణ ఖర్చులు రెండుసార్లు పడుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది పరిపాలనా పరంగా కూడా సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు రెండూ వచ్చే ఆరు నెలల కాలాన్ని సన్నద్ధత దశగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయడం, మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ఎన్నికల సమయానికి పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలనే వ్యూహం అమలవుతోంది. ఇక ప్రతిపక్ష వైఖరి కూడా ఈ సమీకరణంలో కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా అమరావతి అంశం సహా ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో చర్చకు తెరలేపేలా కార్యక్రమాలను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టి, రాజకీయంగా పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మొత్తం మీద చూస్తే, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం జరిగే పరిస్థితి లేదు. జనగణన, ఓటర్ల జాబితా సవరణ, పార్టీ నిర్మాణం, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలు పూర్తయిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ముందుకు కదిలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలు రాష్ట్ర రాజకీయాలకు కీలకంగా మారనున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఈసారి అన్ని స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *