11, ఏప్రిల్ 2026, శనివారం

చిత్తూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయం

చిత్తూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయం
అడ్మిషన్లు ప్రారంభం, సీట్లకై భారీగా సిఫార్సులు
తాత్కాలికంగా ఇరువారంలో ప్రారంభం

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

జిల్లాకేంద్రంగా ఉన్న చిత్తూరు పట్టణంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుండగా, వారం రోజుల్లో పూర్తి కానుంది. అడ్మిషన్లు పూర్తయిన వెంటనే తరగతులను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాత్కాలికంగా ఇరువారం ప్రాంతంలోని సిల్క్ రీలింగ్ కేంద్రంలో విద్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రతిష్టాత్మమైన కేంద్రీయ విద్యాలయంలో తమ పిల్లలకు సీట్లను సంపాదించడానికి తల్లిదండ్రులు పోటీలు పడుతున్నారు. రాజకీయ నాయకులను, జిల్లా అధికారులను ఆశ్రయిస్తున్నారు. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సులు చేపిస్తున్నారు. ఎటువంటి సిఫార్సులకు అవకాశం లేదని కేంద్రీయ విద్యాలయ అధికారులు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విద్యాలయంలో నర్సరీ నుండి 5వ తరగతి వరకు మాత్రమే తరగతులు ప్రారంభమవుతున్నాయి. నర్సరీ విభాగంలో ఫ్రీ కేజీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రాథమిక స్థాయిలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు క్లాసులు ప్రారంభించనున్నారు. అడ్మిషన్లు 1వ తరగతి నుంచి ప్రారంభించడంతో తల్లిదండ్రులు భారీగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు.

చిత్తూరు జిల్లా కేంద్రంలో ఇప్పటివరకు కేంద్రీయ విద్యాలయం లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ నాయుడు, బీజేపీ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. వారి కృషి ఫలితంగా చిత్తూరుతో పాటు కుప్పంలో కూడా కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లకు ప్రత్యేక ప్రాధాన్యత కేటాయింపులు ఉన్నాయి. ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యత ఇస్తారు. అనంతరం బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ సంస్థల ఉద్యోగుల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు అవకాశాలు కల్పిస్తారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ, సహకార సంఘాల వంటి సంస్థల ఉద్యోగుల పిల్లలకు అవకాశం ఉంటుంది. చివరగా సాధారణ ప్రజల పిల్లలకు సీట్లు కేటాయిస్తారు. ప్రతి తరగతి గదిలో 40 మంది విద్యార్థులకు మాత్రమే సీట్లు ఉండడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో తరగతికి 200కు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. దీంతో తల్లిదండ్రులు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులను ఆశ్రయిస్తూ సిఫార్సు లేఖలు తీసుకువస్తున్నారు. అయితే సిఫార్సులకు ఎలాంటి ప్రాధాన్యత లేదని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ లూథర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనల ప్రకారమే అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. 1వ తరగతి అడ్మిషన్లకు సంబంధించిన మొదటి జాబితాను విడుదల చేశామని, ఎంపికైన విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. విద్యాలయం ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు పనిచేస్తుందని తెలిపారు. కేంద్రీయ విద్యాలయంలో హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాలే ఉండనున్నాయని, తెలుగు బోధన ఉండదని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం లేదని, రవాణా సౌకర్యం కూడా అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులే తీసుకురావడం, తీసుకెళ్లడం చేయాల్సి ఉంటుంది.

ఫీజుల విషయానికి వస్తే 5వ తరగతి వరకు ప్రతి మూడు నెలలకు రూ.1500 చొప్పున, అంటే నెలకు రూ.500 చెల్లించాలి. 5వ తరగతి పైగా ప్రతి మూడు నెలలకు రూ.1800 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 5వ తరగతి వరకు మాత్రమే తరగతులు ప్రారంభమవుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో 6వ తరగతి, తదుపరి సంవత్సరాల్లో క్రమంగా 10వ తరగతి వరకు విస్తరించనున్నారు. కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనం సంతపేటలోని మంగసముద్రం వద్ద నిర్మాణంలో ఉంది. భవనం పూర్తికాకపోవడంతో తాత్కాలికంగా ఇరువారం సిల్క్ రీలింగ్ కేంద్రంలో విద్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. బోధన కోసం శాశ్వత సిబ్బంది ఇంకా నియమించకపోవడంతో కాంట్రాక్ట్ పద్ధతిలో ఎనిమిది మంది ఉపాధ్యాయులను నియమిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయంలో సీట్ల కోసం తల్లిదండ్రులు భారీగా పోటీ పడుతున్న నేపథ్యంలో, అడ్మిషన్ ప్రక్రియ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇకపై స్థానికంగా నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *