20, ఏప్రిల్ 2026, సోమవారం

దాహంతో గ్రామాలవైపు జింకలు

దాహంతో గ్రామాలవైపు జింకలు

కుక్కల కాటుకు బలి… ఉచ్చుల్లో ప్రాణాలు… 

చిత్తూరు జిల్లాలో జింకల మౌన మరణగాధ


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)


చిత్తూరు జిల్లాలో అడవుల్లో జీవించాల్సిన జింకలు ఇప్పుడు జనావాసాల్లో ప్రాణాల కోసం పోరాడుతున్నాయి. నీటి కోసం అడవులను వదిలి గ్రామాలవైపు అడుగులు వేస్తున్న ఈ మూగజీవాలు, చివరకు కుక్కల దాడులు, వేటగాళ్ల ఉచ్చులు, రోడ్డు ప్రమాదాలు, బావుల్లో పడి మరణాలతో దారుణాంతానికి చేరుతున్నాయి. గత ఒక సంవత్సరం కాలంలో 15 నుండి 20 వరకు జింకలు మృత్యువాత పడ్డాయి. అటవీీ శాఖ అధికారుల మరిి కొన్ని కోలుకున్నాయి.  ఈ ఘటనలు చూస్తే, ఇది కేవలం వన్యప్రాణి సమస్య కాదు, మానవతను కదిలించే సంక్షోభంగా మారుతోంది.

ఏప్రిల్ 2026లో చిత్తూరు రూరల్ మండలం రెడ్డిగుంటలో నీటి కోసం గ్రామంలోకి వచ్చిన జింకపై వీధి కుక్కలు గుంపుగా దాడి చేసి అక్కడికక్కడే చంపేశాయి. అదే నెలలో చిత్తూరు పట్టణ పరిధిలో పి.వి.కె.ఎన్ కళాశాల సమీపంలోని జడ్పీ క్వార్టర్స్ వద్ద పాడుబడ్డ బావిలో పడిపోయిన మరో జింక ప్రాణాలు కోల్పోయింది. ఈ రెండు ఘటనలు జిల్లాలో జింకల దుస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయి. 2025 జూన్ నెలలో పలమనేరు అటవీ అంచు గ్రామాల్లో వేటగాళ్లు అమర్చిన ఉచ్చుల్లో పలు చుక్కల జింకలు చిక్కుకుని మృతి చెందినట్లు అటవీ వర్గాలు గుర్తించాయి. నవంబర్ 2025లో బంగారుపాళ్యం మండలంలో మరో జింక ఉచ్చులో చిక్కుకుని తీవ్రంగా గాయపడగా, అటవీశాఖ చికిత్స అందించింది. డిసెంబర్ 2025లో సోమల మండలంలోని అటవీ అంచుల్లో రెండు జింకలు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. 2026 జనవరిలో చౌడేపల్లి పరిసరాల్లో రోడ్డు దాటుతున్న జింకను వాహనం ఢీకొనడంతో గాయపడిన ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి నెలలో యాదమరి అటవీ ప్రాంతంలో నీటి కొరతతో అలసిపోయిన జింక మృతి చెందగా, మార్చి నెలలో రెడ్డిగుంట పరిసరాల్లో మరో జింక మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్ ప్రారంభంలో చిత్తూరు పట్టణ శివార్లలో కుక్కల దాడికి గురైన జింక తీవ్ర గాయాలతో కొద్ది సేపటికే మృతి చెందిన ఘటన ప్రజలను కలచివేసింది.

ఈ ఘటనలన్నింటినీ పరిశీలిస్తే, గత ఏడాది కాలంలో చిత్తూరు జిల్లాలో కనీసం 15 నుండి 20 జింకలు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు. మరో 10కు పైగా జింకలు గాయపడి అటవీశాఖ చికిత్స పొందిన ఘటనలు నమోదయ్యాయి. అధికారిక గణాంకాలు తక్కువగా ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో నమోదుకాని సంఘటనలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. జింకలు అడవులను వదిలి గ్రామాల్లోకి రావడానికి ప్రధాన కారణం నీటి కొరత. వేసవి కాలంలో అడవుల్లోని సహజ నీటి వనరులు ఎండిపోవడంతో ఇవి దాహంతో బయటకు వస్తున్నాయి. గ్రామాల్లోకి వచ్చిన తర్వాత ఆహారం కోసం తిరుగుతుండగా వీధి కుక్కలు గుంపులుగా దాడి చేసి చంపేస్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లో భయంతో పరుగెత్తి బావుల్లో పడిపోవడం, రోడ్లు దాటే సమయంలో వాహనాలు ఢీకొనడం వంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇంకా దారుణమేమిటంటే, కొందరు వేటగాళ్లు మాంసం కోసం నాటు తుపాకులు, ఇనుప ఉచ్చులు, విద్యుత్ తీగలను ఉపయోగించి జింకలను వేటాడుతున్నారు. అడవుల అంచుల్లో రహస్యంగా జరుగుతున్న ఈ వేటను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విజయవంతం కాలేకపోతున్నారు. ఇది జింకల జనాభాకు పెద్ద ముప్పుగా మారింది.

ఈ పరిస్థితిపై అటవీశాఖ స్పందిస్తూ అడవుల్లో నీటి కొరతను తగ్గించేందుకు సాసర్ పిట్స్ ఏర్పాటు చేస్తున్నామని చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో నీటి ట్యాంకర్లు పంపించి కుంటలను నింపే ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఇవి తాత్కాలిక చర్యలేనని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అడవుల సంరక్షణ, నీటి వనరుల పునరుద్ధరణ, వేట నియంత్రణ, గ్రామాల వద్ద రక్షణ చర్యలు చేపట్టకపోతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై చిత్తూరు అటవీ పరిధి అధికారి థామస్ మాట్లాడుతూ చిత్తూరు పి.వి.కె.ఎన్ డిగ్రీ కళాశాల నుంచి గుడిపాల వరకు సుమారు 2000 ఎకరాల విస్తీర్ణంలో అడవి విస్తరించి ఉందన్నారు. ఈ అడవిలో సుమారు 500 పైగా జింకలు ఉన్నాయని, తాగునీటి కోసం అవి తరచూ చిత్తూరు నగర శివార్లకు వస్తున్నాయని తెలిపారు. దీంతో అవి ప్రమాదాలకు గురవుతున్నాయని, ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. జింకలు మృత్యువు పాలుకాకుండా అటవీశాఖ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. చిత్తూరు జిల్లాలో జింకల పరిస్థితి ఇప్పుడు కేవలం ఒక గణాంకం కాదు, మనిషి నిర్లక్ష్యం, ప్రకృతి మార్పులు, వ్యవస్థల లోపాల కలయికగా మారిన మానవతా విషాదం. దాహంతో అడవిని వదిలి వచ్చిన జింక, కుక్కల కాటుకు బలి కావడం… బావిలో పడిపోయి ప్రాణాలు కోల్పోవడం… ఉచ్చుల్లో చిక్కుకుని చావు చూడడం… ఇవన్నీ ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. అటవీ ప్రాంతంలో నీటి కుంటల నిర్మాణం వంటివి చేపడితే జింకలు జనారణ్యంలోకి రావని వన్యప్రాణి ప్రియురాలు అభిప్రాయపడుతున్నారు. జిల్లా నీటి నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అడవులలో నీట కుంటలను ఏర్పాటు చేసి వన్యప్రాణులను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *