జలధార జలహారతి భాగంగా చిత్తూరులో 1064 పనులు
జలధార జలహారతి భాగంగా చిత్తూరులో 1064 పనులు గుర్తింపు
ఉపాధి హామీ కింద రూ. 29.34 కోట్లతో 129 పనులు మంజూరు
329 చెరువులలో నీరు లేదు, 591 గ్రామాలలో తాగునీటి సమస్య
154 గ్రామాలలో 20 మీటర్లకు పడిపోయిన భూగర్భ జలాలు
జిల్లాలో భూగర్భ జలాలను పెంచడానికి జలధార జల హారతి
ఆంధ్రప్రభ బ్యూరోతో ఇరిగేషన్ ఎస్సీ వెంకటేశ్వర రాజు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జలధార జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో భూగర్భ జలాలను పెంచడానికి 106 పనులను గుర్తించినట్లు ఇరిగేషన్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ కే వెంకటేశ్వర రాజు వెల్లడించారు. మంగళవారం ఆయన చిత్తూరులో ఆంధ్రప్రభ బ్యూరోతో మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు కింద ఇప్పటివరకు 129 పనులకు 29.34 కోట్ల రూపాయలకు ఆమోదం లభించిందన్నారు. ఇందులో 64 పనులు పూర్తయయని, 16 పనులు జరుగుతున్నాయని వివరించారు. జిల్లాలో 329 చెరువులు పూర్తిగా ఎండిపోయాయని, 591 గ్రామాలలో తాగునీటి సమస్య ఉందన్నారు. 154 గ్రామాలలో నీటిమట్టం 20 మీటర్ల కంటే ఎక్కువగా పడిపోయిందన్నారు. జలధార జల హారతి పథకం కింద ట్యాంకుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు ప్రధాన లక్ష్యాలుగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 6 నుండి జూలై 14 వరకు 100 రోజులపాటు నాలుగు దశల్లో అమలు చేస్తున్నామని చెప్పారు.
చిత్తూరు జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమాన్ని ఏప్రిల్ 6న కలెక్టర్ సమక్షంలో ప్రారంభించామని, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, వాటర్ యూజర్స్ అసోసియేషన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. మొదటి దశలో పనుల గుర్తింపు, రెండో దశలో అనుమతులు, మూడో దశలో అమలు, చివరిదశలో నివేదికల సమర్పణ జరుగుతుందని వివరించారు. జిల్లాలోని చిన్న నీటిపారుదల చెరువుల మరమ్మత్తులు, ఫీడర్ కాలువల శుభ్రపరచడం, చెరువు బండల బలపరిచే పనులు, చెరువుల అనుసంధానం, వరదనీటిని చెరువుల్లోకి మళ్లించడం, నీటి మరియు మట్టిసంరక్షణ చర్యలు, అఫారెస్టేషన్ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి గ్రామానికి వాటర్ సెక్యూరిటీ ప్లాన్, వాటర్ బడ్జెట్ తయారు చేయడం కూడా ఈ కార్యక్రమంలో భాగమని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 3,106 చిన్న నీటిపారుదల చెరువులు ఉండగా, అవి 88,872 ఎకరాలకు నీటిపారుదల అందిస్తున్నాయని చెప్పారు. కృష్ణాపురం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 6,125 ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. జిల్లాలో 219 వాటర్ యూజర్స్ అసోసియేషన్లు, ఒక ప్రాజెక్ట్ కమిటీ పనిచేస్తున్నాయని వివరించారు.
వర్షపాతం విషయానికి వస్తే, 27 మండలాల్లో 13 మండలాలు అధిక వర్షపాతం పొందగా, 14 మండలాలు సాధారణ వర్షపాతం పొందాయని తెలిపారు. జూన్ 2025 నుండి ఇప్పటి వరకు జిల్లాలో 1031.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది సాధారణ వర్షపాతం కంటే 24.50 శాతం ఎక్కువగా ఉందన్నారు. భూగర్భ జలాల పరిస్థితిపై మాట్లాడుతూ, 2026 ఏప్రిల్ 1 నాటికి సగటు నీటిమట్టం 10.96 మీటర్లు ఉండగా, 2025 జూన్‌లో అది 12.45 మీటర్లుగా ఉందని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈసారి భూగర్భ జలాలు మెరుగుపడ్డాయని చెప్పారు. అయితే జిల్లాలో 591 గ్రామాలలో ఇంకా నీటి సమస్యతో ఉన్నాయని, అందులో 154 గ్రామాల్లో నీటి మట్టం 20 మీటర్లకు దిగువన ఉందని తెలిపారు. చెరువుల నింపుదల పరిస్థితి ప్రకారం మొత్తం సామర్థ్యం 12.988 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.994 టీఎంసీలు నీరు నిల్వ ఉందని చెప్పారు. మొత్తం చెరువులలో 76.95 శాతం నింపుదల నమోదైందని తెలిపారు. 1362 చెరువులు పూర్తిగా నిండగా, 567 చెరువులు 75 శాతం పైగా నిండాయని చెప్పారు. 443 చెరువులు 50 శాతం పైగా, 409 చెరువులు 25 శాతం పైగా, 329 చెరువులు 25 శాతం లోపు నింపుదలతో ఉన్నాయని వివరించారు.
హంద్రీనీవా సుజల స్రవంతి కింద కుప్పం బ్రాంచ్ కాలువ ద్వారా చెరువులను నింపే పనులు జరుగుతున్నాయని, మొత్తం 180 చెరువులను లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 131 చెరువులు పూర్తిగా నిండాయని, 29 చెరువులు కొంతమేర నిండాయని తెలిపారు. రిజర్వాయర్ల పరిస్థితిపై మాట్లాడుతూ కలవగుంట బారేజ్ కింద ఎన్‌టీఆర్ జలసాయం ప్రాజెక్ట్ లో 89.23 శాతం నీళ్ళు ఉన్నాయని, కృష్ణాపురం ప్రాజెక్ట్ లో 51.17 శాతం మాత్రం నీళ్లు ఉన్నాయని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 129 పనులకు రూ.2934 లక్షల పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో 68 పనులు పూర్తయ్యాయి, 16 పనులు ప్రగతిలో ఉండగా, 45 పనులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ప్రస్తుతం అమలు పరిస్థితిపై మాట్లాడుతూ, జిల్లాలో నది బేసిన్ మ్యాప్స్, నీటి వనరుల మ్యాప్స్ సిద్ధం చేసి సమర్పించామని తెలిపారు. 3106 చెరువుల్లో 648 స్వతంత్ర చెరువులు కాగా, మిగిలినవి గొలుసు విధానంలో ఉన్నాయని చెప్పారు. ప్రతి మండలానికి ఒక ఇంజనీర్‌ను మండల వాటర్ రిసోర్సెస్ ఆఫీసర్‌గా నియమించామని పేర్కొన్నారు.
జలధార జలహారతి యాప్ ద్వారా పనుల పర్యవేక్షణ జరుగుతోందని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వివరాలను అప్డేట్ చేస్తున్నారని తెలిపారు. గ్రామ స్థాయిలో 917 చెరువులు, 23 నీటి సంరక్షణ నిర్మాణాలు పరిశీలించామని చెప్పారు. 1064 పనులు గుర్తించగా, 558 పనులు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయని, 573 పనులు కలెక్టర్ ఆమోదానికి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 13 పనులకు అనుమతి లభించిందన్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యే సరికి జిల్లాలో భూగర్భ జలాలు మరింత పెరుగుతాయని, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని ఎస్.ఈ. వెంకటేశ్వరరాజు స్పష్టం చేశారు.

