వార్డుల విభజనపై రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త ఉత్తర్వులు
జూన్ 26 నాటికి వార్డుల విభజన పూర్తి కావాలని ఆదేశాలు
నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక
జిల్లాలో పెరగనున్న 38 మున్సిపల్ వార్డులు
మున్సిపాలిటీలలో ప్రారంభమైన ఎన్నికల సందడి
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
జిల్లాలో మున్సిపల్ వార్డుల పునర్విభజన ప్రక్రియ రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో మొత్తం 38 వార్డులు పెరగనున్నాయి. దీంతో పట్టణ స్థానిక సంస్థల రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చిత్తూరు కార్పొరేషన్, కుప్పం నగర పంచాయతీ, నగరి, పలమనేరు మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ప్రస్తుతం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న 50 డివిజన్లు 60కు పెరగనున్నాయి. కుప్పం నగర పంచాయతీలో 25 వార్డులు 32కు, నగరి మున్సిపాలిటీలో 29 వార్డులు 40కు, పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులు 36కు పెరగనున్నాయి. పట్టణాల విస్తరణ, జనాభా పెరుగుదల, సమాన ప్రతినిధిత్వం కల్పించాలన్న లక్ష్యంతో ఈ మార్పులు చేపడుతున్నారు. ఈ పెరుగుదలతో కొత్తగా ఏర్పడే వార్డులు స్థానిక నాయకులకు కొత్త అవకాశాల ద్వారాలు తెరిచాయి.
ఇప్పటికే రాజకీయ పార్టీలలో ఆశావహుల కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నాయకులు తమకు అనుకూలంగా వార్డు సరిహద్దులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. పాత వార్డుల పునర్విభజనలో తమ ప్రభావం ఉన్న ప్రాంతాలు కొత్త వార్డుల్లో కొనసాగాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ప్రక్రియలో స్థానిక స్థాయిలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా వెనుకడుగు వేయకుండా తమ బలమైన ప్రాంతాలను కాపాడుకునే దిశగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వార్డుల పునర్విభజన తీరుపై నిశితంగా నజర్ పెట్టి, అవసరమైతే అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ దశలో తమ వాదనలు బలంగా వినిపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు, ఆశావహ నాయకులు ఇప్పటికే తమ తమ ప్రాంతాల్లో పరోక్ష ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. తాగునీరు, డ్రైనేజ్, రహదారులు, వీధి దీపాలు వంటి ప్రాథమిక సమస్యలను గుర్తించి మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. కొన్ని చోట్ల ఈ సమస్యలను శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరుతున్నారు. సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తూ ప్రజల్లో తమ ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వార్డుల సంఖ్య పెరగడం వల్ల కొత్త ముఖాలకు కూడా భారీగా అవకాశాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా యువత ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉత్సాహంతో ముందుకు వస్తోంది. ఇప్పటివరకు అవకాశాలు దొరకని నాయకులు, సామాజిక కార్యకర్తలు, యువకులు ఈసారి రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో స్థానిక రాజకీయాలు మరింత పోటీగా మారనున్నాయి.
ప్రభుత్వం విడుదల చేసిన సవరించిన షెడ్యూల్ ప్రకారం మే 17లోగా వార్డు విభజనకు సంబంధించిన డ్రాఫ్ట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. మే 18 నుంచి 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. అనంతరం పరిశీలన పూర్తిచేసి జూన్ 26 నాటికి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, ఖచ్చితమైన డేటా ఆధారంగా సాగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే, చిత్తూరు జిల్లాలో వార్డుల పెరుగుదలతో రాజకీయ సమీకరణాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కొత్త వార్డులు – కొత్త నాయకత్వానికి దారి తీసే అవకాశాలు, పాత నాయకులకు సవాళ్లు సృష్టిస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

