జిల్లాలో తీవ్రమవుతున్న పెట్రోల్ డీజిల్ కొరత
గ్రామీణ ప్రాంతాలలో మతబడుతున్న పెట్రోల్ బంకులు
ఇబ్బంది పడుతున్న వాహనదారులు, రైతులు
తగిన నిల్వలో ఉన్నాయని అధికారుల వివరణ
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
చిత్తూరు జిల్లాతో పాటు ఉమ్మడి రాయలసీమ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల వద్ద “నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని బంకులు పూర్తిగా మూతపడగా, అందుబాటులో ఉన్న కొద్దిపాటి బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు కనిపిస్తున్నాయి. చిత్తూరు, పలమనేరు, నగరి, కుప్పం వంటి ప్రధాన ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సరఫరా అంతరాయం కారణంగా ప్రజలు ఆందోళన చెందుతూ ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించడం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది.
వాహనదారుల ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉద్యోగాలకు వెళ్లే వారు మధ్యలోనే వాహనాలు ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులు కూడా నిలిచిపోతున్నాయి. కొంతమంది విడి విక్రయదారులు ఈ పరిస్థితిని సాకుగా తీసుకుని లీటర్ పెట్రోల్ ధరను అధికంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో మరో విచిత్ర దృశ్యం కనిపిస్తోంది. కుప్పం, నగరి ప్రాంతాల ప్రజలు ఇక్కడ పెట్రోల్ దొరకకపోవడంతో తమిళనాడు, కర్ణాటక సరిహద్దు బంకులకు వెళ్లి ఇంధనం నింపించుకుంటున్నారు. దీంతో అక్కడి బంకుల వద్ద కూడా రద్దీ పెరిగింది. ఇంధన కొరత రైతులను మరింత కష్టాల్లోకి నెట్టింది. ప్రస్తుతం వ్యవసాయ పనుల కీలక దశలో డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు నిలిచిపోవడంతో పంట పనులు ఆగిపోయాయి. ఉద్యానవన పంటలు, ముఖ్యంగా మామిడి తోటల వద్ద నీటిని పంపించే డీజిల్ ఇంజన్లు పనిచేయకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితిపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రామచంద్రన్ తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రతి పెట్రోల్ బంక్ వద్ద స్టాక్ వివరాలను తక్షణం నమోదు చేయాలని తహసీల్దారులకు ఆదేశించారు. ఎక్కడైనా స్టాక్ లేకపోతే వెంటనే డిమాండ్ డ్రాఫ్టులు కట్టి సరఫరా తెప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం సుమారు 1173 కిలోలీటర్ల పెట్రోల్, 1153 కిలోలీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. జిల్లాకు రోజుకు సగటున 180 కిలోలీటర్ల పెట్రోల్, 260 కిలోలీటర్ల డీజిల్ అవసరం ఉంటుందని చెప్పారు. అందుబాటులో ఉన్న స్టాక్‌తో కనీసం ఐదు రోజుల వరకు ఇబ్బందులు ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే నేలపై పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల లెక్కలు, వాస్తవ పరిస్థితుల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సమస్యపై స్పందన వ్యక్తమైంది. ఇంధన కొరతపై ముఖ్యమంత్రి అత్యవసర సమీక్ష నిర్వహించి సరఫరాను పెంచాలని ఆయిల్ కంపెనీలకు ఆదేశించినట్లు సమాచారం. అధికారులు ఇది తాత్కాలిక సమస్య మాత్రమేనని, త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు. అయితే ప్రజల్లో ఉన్న ఆందోళన మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బంకులు మూతపడటంతో ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. రైతులు, రవాణా రంగం, చిన్న వ్యాపారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. మొత్తంగా చూస్తే చిత్తూరు జిల్లాలో ఇంధన కొరత ప్రజల దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తోంది. పరిస్థితి త్వరగా సర్దుబాటు కాకపోతే ఇది మరింత పెద్ద సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. అధికారులు చెబుతున్నట్లుగా సరఫరా త్వరగా పునరుద్ధరించబడుతుందా? లేక ప్రజల ఇబ్బందులు కొనసాగుతాయా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
-

