1, ఏప్రిల్ 2026, బుధవారం

పన్నుల వసూళ్లలో చిత్తూరు జిల్లా అగ్రగామి

96.26 శాతం వసూళ్లతో రికార్డు… 

రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన పంచాయతీలు

గతేడాది 88 శాతం నుంచి ఈసారి 96 శాతంకు  ఎగబాకిన వసూళ్లు

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసలు… 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధి కోసం పన్నుల వసూళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచి మరోసారి తన సత్తాను చాటుకుంది. పన్నుల వసూళ్లలో గత ఏడాది మొదటి స్థానాన్ని దక్కించుకున్న జిల్లా, ఈ ఏడాది కూడా అదే స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషంగా నిలిచింది. గత సంవత్సరం 88 శాతం పన్నులను వసూలు చేసి అగ్రస్థానంలో నిలువగా ఈ సంవత్సరం 96 శాతం పన్నులను వసూలు చేసి అగ్రస్థానాన్ని నిలుపుకుంది. 27 కోట్లకు 26 కోట్ల రూపాయలను జిల్లా పంచాయతీ అధికారులు పన్నుల రూపంలో వసూలు చేశారు. పన్నుల వసూలు చిత్తూరు జిల్లా అగ్రస్థానాన్ని కొనసాగించడంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావును, సిబ్బందిని అభినందించారు.

పంచాయతీల ఆదాయం ప్రధానంగా పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం అనే రెండు మార్గాల ద్వారా సమకూరుతుంది. ఇంటి పన్ను, లైబ్రరీ సెస్, ప్రకటనల పన్ను, ఖాళీ స్థలాల పన్ను వంటి పన్నులు ప్రధాన ఆదాయ వనరులుగా ఉండగా, లైసెన్స్ ఫీజులు, నీటి ఛార్జీలు, మార్కెట్ ఫీజులు, వేలం పాటలు, జరిమానాలు, ధృవీకరణ పత్రాల రుసుములు వంటి పన్నేతర ఆదాయం కూడా పంచాయతీలకు బలాన్నిస్తుంది. అదనంగా కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధులు, స్టాంపు డ్యూటీ వాటా, ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ నిధులు వంటి మార్గాల ద్వారా కూడా గ్రామ పంచాయతీలకు ఆదాయం అందుతోంది. ఈ మొత్తం వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం “స్వర్ణ పంచాయతీ పోర్టల్” ద్వారా ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇలాంటి పటిష్ట వ్యవస్థలో చిత్తూరు జిల్లా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 621 పంచాయతీలలో  మొత్తం రూ.27.29 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, రూ.26.27 కోట్లను వసూలు చేసి 96.26 శాతం వసూళ్లు సాధించింది. ఇది రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితంగా నిలిచింది. కేవలం మొత్తంలోనే కాకుండా, వసూళ్ల శాతం పరంగా కూడా జిల్లా ముందంజలో నిలిచింది. ఇక పన్నుల పరిధిలోకి వచ్చే ఇళ్ల, దుకాణాల, సంతల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. జిల్లాలో మొత్తం 3,21,360 ఇళ్లు, దుకాణాలు, వ్యాపార కేంద్రాల నుంచి పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, 3,17,227 యూనిట్ల నుంచి పన్నులు వసూలు చేయడం ద్వారా 98.6 శాతం కవరేజ్ సాధించడం విశేషం. గ్రామస్థాయిలో సిబ్బంది, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ స్థాయి విజయాన్ని సాధించగలిగారని అధికారులు పేర్కొంటున్నారు. గత సంవత్సరంలో చిత్తూరు జిల్లా 88 శాతం పన్నుల వసూళ్లను సాధించి రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో 96 శాతం దాటడం జిల్లా పరిపాలనలో సమర్థతను చూపిస్తోంది. గత ఏడాది అగ్రస్థానం సాధించినందుకు ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. అమరావతిలో నిర్వహించిన సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావుకు నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేశారు.

ఈ ఏడాది కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పంచాయతీ శాఖ అధికారులను అభినందించారు. గ్రామ స్థాయిలో సిబ్బంది కృషి, పన్నులపై ప్రజల్లో అవగాహన పెరగడం, ఆన్‌లైన్ వసూళ్ల విధానం అమలు వంటి అంశాలు ఈ విజయానికి దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు. పంచాయతీల ఆర్థిక బలోపేతం గ్రామాభివృద్ధికి కీలకం. పన్నుల వసూళ్లు సక్రమంగా జరిగితేనే రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, చెత్త నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా సాధించిన ఫలితాలు ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలంటే పన్నుల వసూళ్లు పెరగడం తప్పనిసరి. ఈ విషయంలో చిత్తూరు జిల్లా చూపిన పనితీరు రాష్ట్రంలో ఒక మోడల్‌గా నిలిచింది. ఇదే వేగం కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో కూడా జిల్లా అగ్రస్థానాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *