7, ఏప్రిల్ 2026, మంగళవారం

పరిపాలనలో క్రమశిక్షణ… అభివృద్ధిలో దూకుడు

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రధమ ప్రాధాన్యత 

నిరంతరం సమీక్ష సమావేశాలు, ఫీల్డ్ విజిట్లు 

జిల్లా అభివృద్ధిలో అధికారుల, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం 

పటిష్టంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ

సుమిత్ కుమార్ నాయకత్వంలో సారి కొత్త దిశలో జిల్లా

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

పరిపాలనఅంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు, ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం. వారి సమస్యలను ఆలకించడం. వారికి న్యాయం చేయడం. వారి కళ్ళలో ఆనందం చూడడం. జిల్లా యంత్రాంగాన్ని మొత్తం ప్రజల సేవకు సంసిద్ధం చేయడం. అధికారులలో ఉన్న అలసత్వాన్ని రూపుమాపడం. అధికారులను ప్రజాసేవలో నిమగ్నం చేయడం. జిల్లా అధికారులకు తాను మార్గదర్శకంగా నిలవడం. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పేదలకు అందించడం. నిధుల, అధికార దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం. అలసత్వం వహించిన, అవినీతికి పాల్పడిన అధికారులను గాడిలో పెట్టడం. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేయడం. ఎవరికి ఏ కష్టము రాకుండా చూసుకోవడం. ప్రభుత్వ అజెండానే తన అజెండాగా పనిచేయడం. ప్రభుత్వ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించడం. అధికారులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ వారిని ముందుకు నడపడం. వారికి భరోసా ఇస్తూ ప్రజాసేవలో మమేకం చేయడం. ప్రజలను జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం. జిల్లా ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడం. వీటన్నింటినీ ఆచరణలో చూపిస్తున్న అధికారి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. 


2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సుమిత్ కుమార్, జూన్ 24, 2024న చిత్తూరు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన జిల్లా అభివృద్ధికి కొత్త ఊపు తీసుకొచ్చారు. వ్యవస్థలో క్రమశిక్షణ, పనిలో వేగం, ప్రజల పట్ల బాధ్యత ఈ మూడు మూల సూత్రాలతో ఆయన పాలన కొనసాగుతోంది. మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడైన సుమిత్ కుమార్, చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. ఐటీ ఉద్యోగం చేస్తూనే పట్టుదలతో రెండో ప్రయత్నంలోనే 2014లో ఐఏఎస్‌కు ఎంపిక కావడం ఆయన పట్టుదల, సంకల్పానికి నిదర్శనం. తన కెరీర్ ప్రారంభ దశలో నరసాపురం సబ్ డివిజన్ అధికారిగా పనిచేసినప్పుడు అవినీతికి, రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా కఠినంగా వ్యవహరించడం ద్వారా మంచి గుర్తింపు పొందారు. చిత్తూరుకు రాకముందు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆయన, కాకినాడ (తూర్పు గోదావరి), పశ్చిమ గోదావరి జిల్లాల్లో జాయింట్ కలెక్టర్‌గా కూడా సేవలు అందించారు. పరిపాలనా అనుభవం, క్షేత్రస్థాయి అవగాహన కలిసినప్పుడు ఎలా ఫలితాలు వస్తాయో ఆయన పనితీరే ఉదాహరణగా నిలుస్తోంది. చిత్తూరు జిల్లాలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటి ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారానికే ఇచ్చారు. తాగునీరు, భూ సమస్యల వంటి ప్రజల నిత్యజీవితానికి సంబంధించిన అంశాలపై అధిక ప్రాధాన్యత ఇస్తాం. ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మాటలు కేవలం ప్రకటనలుగానే కాకుండా, క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి. జిల్లా యంత్రాంగంలో క్రమశిక్షణ తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఫైళ్లు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవడం, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం, పనుల్లో ఆలస్యం సహించకపోవడం ఆయన ప్రత్యేకత. పనిచేసే అధికారులను అభినందిస్తూ, నిర్లక్ష్యం చూపిన వారిపై కఠినంగా వ్యవహరించడం ద్వారా యంత్రాంగాన్ని చురుకుగా మార్చారు.

ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారంలో ..

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను శక్తివంతమైన వేదికగా తీర్చిదిద్దారు. ఉదయం 9:30 గంటల నుంచి రెండు గంటల వరకు సాగే ఈ వేదికలు జిల్లా స్థాయి అధికారులు అందరూ పాల్గొనే విధంగా పటిష్ట చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలో కూడా ప్రజా వినతుల స్వీకరణ వేదికలను ఏర్పాటు చేసి, ప్రజలకు చేరువయ్యారు. ఓపిగ్గా సమస్యలు విని, వెంటనే పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది. సంజీవిని ప్రాజెక్ట్ అమలు చిత్తూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ ప్రాజెక్టు అమలు విషయంలో జిల్లా కలెక్టర్ చూపిన ప్రత్యేక శ్రద్ధ ముఖ్యమంత్రి ముగ్ధుడు అయ్యారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో సుమిత్ కుమార్ ను ప్రశంసలతో ముంచెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. మరుగుదొడ్ల నిర్మాణం, శుద్ధి చేసిన తాగునీరు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వంటి అంశాల్లో సాధించిన పురోగతి ప్రశంసలు అందుకుంది. వ్యవసాయ రంగంలో ముఖ్యంగా మామిడి రైతులకు అండగా నిలిచిన సుమిత్ కుమార్, దళారీల వ్యవస్థపై ఉక్కుపాదం మోపారు. పల్పింగ్ పరిశ్రమల యజమానులతో చర్చలు జరిపి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. మామిడి రైతు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చిత్తూరు మామిడికి గుర్తింపు పెరగేలా చర్యలు చేపట్టడం రైతులకు ఊరటనిచ్చింది. పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఆయన ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. పారిశ్రామికవేత్తలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని, పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నారు. పరిశ్రమలకు అవసరమైన భూముల కేటాయింపులో వేగం పెంచి, పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడం జిల్లాలో ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తోంది. ప్రభుత్వ అవసరాల కోసం భూసేకరణలో కూడా ఆయన సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారు. రహదారులు, నీటి ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం అవసరమైన భూములను సకాలంలో సేకరించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. రైతులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించడం ఆయన విశ్వసనీయతను పెంచింది.

సంక్షేమ పథకాల అమలులో అగ్ర స్థానంలో...

సంక్షేమ పథకాల అమలులో కూడా చిత్తూరు జిల్లా ముందంజలో నిలిచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్ల పట్టాలు, పింఛన్లు, ఇతర పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. నిధుల సమీకరణలోనూ చురుకుదనం చూపిస్తూ అభివృద్ధి పనులకు ఊతమిస్తున్నారు. విద్యా రంగంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, నాడు-నేడు పనుల వేగవంతం, విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడం జరుగుతోంది. వైద్య రంగంలో ఆసుపత్రుల సేవలను మెరుగుపరుస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. నీటి సమస్యల పరిష్కారంలో ఆయన తీసుకుంటున్న చర్యలు జిల్లాకు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు. కరువు ప్రాంతాల్లో నీటి సమస్యలను తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

కుప్పం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి

కుప్పం ప్రాంత అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ మౌలిక వసతులు, రహదారులు, నీటి సదుపాయాలపై చర్యలు తీసుకుంటున్నారు. వారంలో ఒకరోజు కుప్పంలో ఉంటున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి వేగం పెరిగింది. ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటిస్తూ ప్రజాప్రతినిధులను గౌరవించడం ఆయన పాలనలో మరో ముఖ్య లక్షణం. అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేయడం ద్వారా సమన్వయంతో పనులు జరిగేలా చేస్తున్నారు. జిల్లా అంతటా సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించడం ద్వారా పనుల్లో వేగం తీసుకొచ్చారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే స్పందించి పరిష్కారం చూపడం ఆయన పనితీరుకు నిదర్శనం. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే కలెక్టర్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. సోమవారమే కాకుండా ప్రతిరోజు అర్జీదారుల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఎవరైనా నేరుగా వెళ్లి సమస్య చెప్పుకునేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా తీసుకుని పరిష్కారం చేయడం ఆయన ప్రత్యేకత.

ఎల్లప్పుడు బిజీ బిజీ...

సమగ్రంగా చూస్తే, సుమిత్ కుమార్ నాయకత్వంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. వ్యవసాయం, పరిశ్రమలు, సంక్షేమం, విద్య, వైద్యం, మౌలిక వసతులు ప్రతి రంగంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్ ఎప్పుడు బిజీగా ఉంటున్నారు. ప్రతిరోజు వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. లేకుంటే జిల్లాలో పర్యటన చేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, పాఠశాలలను, వైద్యశాలలను తనిఖీ చేస్తున్నారు. విద్యార్థులతో కూర్చొని మధ్యాహ్నం తింటున్నారు. ప్రభుత్వ ఆదేశాలను శిరసావహిస్తూ ప్రముఖుల వర్ధంతిలు, జయంతులను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలతో కలిసి నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు. జిల్లా పర్యటన సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. నిరాడంబరంగా ఉంటూ అధికారులను, ప్రజాపతినిధులను జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ చిత్తూరు జిల్లాను అన్ని విధాలుగా అగ్రస్థానంలో నిలపడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. దృఢ సంకల్పం… పారదర్శక పాలన… ప్రజల నమ్మకం  ఇవే సుమిత్ కుమార్ విజయ రహస్యాలు. చిత్తూరు జిల్లా ప్రగతి చక్రం… సుమిత్ కుమార్ నాయకత్వంలో అప్రతిహతంగా కొనసాగుతోంది! అన్ని రంగాల్లో చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *