కొత్త విద్యా దిశగా భారీ అడుగు
1–8 తరగతులకు కొత్త పాఠ్యపుస్తకాలు
విద్య బోధనలో సమూల మార్పులు
దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో కీలక మలుపు తిరిగేలా జాతీయ విద్యా విధానం–2020 అమలులో భాగంగా జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి 1 నుంచి 8వ తరగతి వరకు కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేసింది. ఆధునిక, విద్యార్థి కేంద్రిత అభ్యాస విధానాలను ప్రోత్సహించేలా రూపొందించిన ఈ పుస్తకాలు పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక రూపకల్పనకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ముద్రిత రూపంతో పాటు డిజిటల్ రూపంలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ పాఠ్యపుస్తకాలు విద్యా రంగంలో సమూల మార్పులకు నాంది పలుకుతున్నాయి..కొత్త పాఠ్యపుస్తకాల ప్రధాన లక్ష్యం బట్టి చదవడం నుంచి సామర్థ్యాధారిత అభ్యాసం వైపు విద్యార్థులను మలచడం, పాఠాలను కేవలం కంఠస్థం చేయడం కాకుండా అవగాహనతో నేర్చుకునే విధంగా రూపొందించడం ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం. విద్యార్థుల ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యాన్ని పెంచేలా పాఠ్యాంశాలు, అభ్యాస విధానాలను సవరించారు.
రాష్ట్ర స్థాయిలో కూడా ఈ మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం (2026–27) నుంచి 1 నుంచి 8వ తరగతుల వరకు సిలబస్‌లో కీలక మార్పులు అమలు చేయనున్నారు. ముఖ్యంగా 6, 7, 8 తరగతుల్లో పూర్తిస్థాయి సిలబస్ మార్పులు జరుగుతుండగా, 1 నుంచి 5 తరగతుల్లో సుమారు 40 శాతం వరకు మార్పులు ఉండనున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. తెలుగు, హిందీ వంటి భాషా విషయాల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, సాంఘిక శాస్త్రంలో మాత్రం స్థానిక, ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ మార్పులు చేయనున్నారు. భౌగోళిక, చారిత్రక అంశాలను స్థానిక పరిసరాలకు అనుసంధానించి బోధించే విధంగా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నారు. పరీక్షల విధానంలో కూడా కీలక మార్పులు చేపట్టనున్నారు. నేరుగా జవాబులు రాసే విధానానికి బదులుగా, పాఠ్యాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే సమాధానం ఇవ్వగలిగే విధంగా ప్రశ్నాపత్రాలను రూపొందించనున్నారు. అంటే, విశ్లేషణాత్మక ఆలోచనను ప్రోత్సహించే విధంగా పరీక్షా విధానం మారబోతోంది.
అభివృద్ధి దశలో 9, 10 పాఠ్యపుస్తకాలు
9వ తరగతి పాఠ్యపుస్తకాలు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉండగా, 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు ఎన్‌సీఈఆర్టీ తెలిపింది. ఇప్పటికే ముసాయిదా సిలబస్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచి విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలను ఆహ్వానించారు. ఇక 10, 11 తరగతులకు సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలను 2027–28 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టే ప్రణాళికను ప్రకటించారు. విద్యా మార్పుల అమలులో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. జూన్ నెలలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి కొత్త పాఠ్య విధానాన్ని సమర్థవంతంగా బోధించేందుకు ఉపాధ్యాయులను సిద్ధం చేయనున్నారు. విద్యార్థుల్లో అభ్యాస అంతరాలు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సమగ్ర మార్పులు భారత విద్యా వ్యవస్థను మరింత సులభతరం చేసి, అభ్యాసకుడి కేంద్రంగా మార్చే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. కొత్త పాఠ్యపుస్తకాలు, సిలబస్, పరీక్షా విధాన మార్పులతో విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెంపొందించి భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

