9, ఏప్రిల్ 2026, గురువారం

9వ తారీఖు వచ్చినా వైద్య ఆరోగ్య సిబ్బందికి జీతాలు

చిత్తూరు సబ్ ట్రెజరీ అధికారులు అలసత్వం 
ఆరు మండలాల్లోని 9 పి హెచ్ సి లకు శాపం
నేడు జిల్లా కలెక్టర్ కలవనున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు సబ్ ట్రెజరీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి 9వ తేదీ వచ్చినా జీతాలు అందకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇది ఉద్యోగుల శాపమా, పాపమా అంటూ ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎండనక, వాననక, రాత్రింబవళ్లు కష్టపడి ప్రజలకు సేవలందిస్తున్న తమకు ఇప్పటికీ జీతాలు రాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రాథమిక కేంద్రాలకు జీతాలు అందిన చిత్తూరు సబ్ ట్రెజరీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మాత్రం అందలేదు. ఈ విషయమై ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేయడానికి సమాయత్తమవుతున్నారు.

చిత్తూరు సబ్ ట్రెజరీ పరిధిలోని పలమసముద్రం, గంగాధర్ నెల్లూరు, పూతలపట్టు, ఐరాల, గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాలకు చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సాధారణంగా ప్రతి నెల 2వ తేదీన జీతాలు జమ కావాల్సి ఉంది. ఈ మండలాల్లో మొత్తం తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తుండగా, ఒక్కో కేంద్రంలో 15 నుంచి 20 మంది వరకు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం సుమారు 1500 మంది సిబ్బంది జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సకాలంలోనే జీతాల బిల్లులను చిత్తూరు సబ్ ట్రెజరీలో జమ చేసినప్పటికీ, మార్చి 31వ తేదీన ఆ బిల్లులను ఆమోదించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా ఇతర సబ్ ట్రెజరీలలో అదే రోజున బిల్లులు ఆమోదం పొందడంతో అక్కడి సిబ్బందికి జీతాలు అందాయి. అయితే చిత్తూరు సబ్ ట్రెజరీ పరిధిలోని ఆరోగ్య సిబ్బందికి మాత్రం ఇప్పటివరకు జీతాలు అందకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ఈ పరిస్థితితో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి బాడుగలు, కిరాణా ఖర్చులు, బ్యాంకులలో తీసుకున్న రుణాల ఈఎంఐలు చెల్లించలేక అధిక వడ్డీలు భరించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని, తక్షణమే జీతాలు విడుదల చేయాలని కోరుతున్నారు.

ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డిను సంప్రదించగా, చిత్తూరు సబ్ ట్రెజరీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మాత్రమే జీతాలు అందలేదని, మిగిలిన ప్రాంతాల్లో సిబ్బందికి జీతాలు జమయ్యాయని తెలిపారు. ఈ సమస్య తన దృష్టికి వచ్చిందని, జిల్లా ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇదే విషయంపై చిత్తూరు సబ్ ట్రెజరీ అధికారి శివ కిరణ్ వివరణ ఇస్తూ, మార్చి 31తో బడ్జెట్ ముగిసిందని, కొత్త బడ్జెట్ మంజూరు కావాల్సి ఉందన్నారు. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశముందని, అవి అందిన వెంటనే సిబ్బందికి జీతాలు విడుదల చేస్తామని తెలిపారు. అయితే, ఇతర సబ్ ట్రెజరీలలో అదే పరిస్థితుల్లో కూడా బిల్లులు ఆమోదం పొందగా, చిత్తూరు సబ్ ట్రెజరీలో మాత్రమే ఆలస్యం కావడం పట్ల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను వివరించి, తదుపరి కార్యాచరణకు దిగుతామని ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ లక్ష్మీనారాయణ  స్పష్టం చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *