మొక్కుబడిగా జరుగుతున్న జడ్పీ సమావేశాలు
ప్రజాప్రతినిధుల, రెండు జిల్లాల అధికారుల డుమ్మా
చర్చలకే పరిమితం అవుతున్న సమావేశాలు
జిల్లా పరిషత్ విభజనతో సమస్యలు తీరేనా ?
నేడే ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు ప్రస్తుతం మొక్కుబడిగా జరుగుతున్నాయన్న విమర్శలు రోజురోజుకు బలపడుతున్నాయి. జిల్లా విభజన జరిగినప్పటికీ జిల్లా పరిషత్ మాత్రం విభజనకు నోచుకోకపోవడం వల్ల ఏర్పడిన పరిపాలనా లోపాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిత్తూరులో నిర్వహించే ఈ సమావేశాలకు అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు గణనీయంగా గైర్హాజరవడం వల్ల సమావేశాల ప్రాధాన్యం తగ్గిపోతోంది. ఈ సమావేశాలకు మూడు జిల్లాలకు చెందిన అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ సంస్థల చైర్మన్లు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన అధికారులు మాత్రమే సమావేశాలకు హాజరవుతుండగా, మిగిలిన రెండు జిల్లాల నుంచి సరైన ప్రాతినిధ్యం కనిపించడం లేదు. ఫలితంగా సమావేశాలు ఒకే జిల్లాకు పరిమితమవుతున్నాయి. ప్రజాప్రతినిధుల గైర్హాజరు పరిస్థితిని మరింత దిగజారుస్తోంది.
ఎన్నికల అనంతరం కొంతకాలం ఆసక్తిగా పాల్గొన్న నాయకులు, తమ సమస్యలకు పరిష్కారం కనిపించకపోవడంతో క్రమంగా దూరమవుతున్నారు. ప్రస్తుతం సమావేశాలకు ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. పార్లమెంటు సభ్యులు, కీలక నాయకులు కూడా సమావేశాలను పట్టించుకోకపోవడం గమనార్హం. ఒకప్పుడు సమావేశాల్లో చురుకుగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, తమ సూచనలు అమలు కాకపోవడంతో నిరుత్సాహానికి గురై దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు చెందిన నాయకులు తమ ప్రాంత సమస్యలకు సమాధానాలు రాకపోవడంతో సమావేశాలపై ఆసక్తి కోల్పోయినట్లు తెలుస్తోంది. సమావేశాల్లో చర్చలు జరుగుతున్నప్పటికీ, వాటికి అనుగుణంగా చర్యలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై తదుపరి సమావేశాల్లో స్పందన లేకపోవడంతో చర్చల పట్ల ఆసక్తి తగ్గిపోతోంది. అధికారులు నోట్ తీసుకుంటాం, సంబంధిత జిల్లాకు తెలియజేస్తాం అనే మాటలతో సరిపెట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఆ సమస్యల పరిష్కారంపై ఎలాంటి ఫాలోఅప్ చర్యలు కనిపించడం లేదు. దీంతో సభ్యుల్లో అసంతృప్తి పెరుగుతోంది. అధికారుల గైర్హాజరు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా ఇతర జిల్లాలకు చెందిన రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి వనరులు, వ్యవసాయం వంటి కీలక శాఖల అధికారులు సమావేశాలకు హాజరుకాకపోవడం వల్ల ఆ జిల్లాలకు సంబంధించిన సమస్యలు అజెండాలో ఉన్నప్పటికీ చర్చలు అర్థంతరంగా ముగుస్తున్నాయి. సంబంధిత అధికారులు లేకపోవడంతో సరైన సమాధానాలు లభించడం లేదు. దీనివల్ల సమావేశాల ఉద్దేశ్యం నెరవేరడం లేదు. సభ్యులు తమ ప్రాంత సమస్యలను ప్రస్తావించినప్పుడు చిత్తూరు జిల్లాకు చెందిన అధికారులు వాటిని నోట్ చేసుకుని చర్యలు తీసుకుంటాం అని చెబుతున్నప్పటికీ, తదుపరి సమావేశాల్లో ఆ అంశాలపై ఎలాంటి పురోగతి నివేదిక ఇవ్వడం లేదు. దీనివల్ల సభ్యులు కూడా చర్చల్లో పాల్గొనే ఉత్సాహాన్ని కోల్పోతున్నారు. కొంతమంది జడ్పిటిసి సభ్యులు కేవలం హాజరు కోసం మాత్రమే సమావేశాలకు వస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లా విభజన తరువాత ఏర్పడిన పరిపాలనా అసమతుల్యత కూడా సమస్యలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఒకప్పుడు 66 మండలాలతో ఉన్న ఉమ్మడి జిల్లా, ఇప్పుడు మూడు జిల్లాలుగా విడిపోయింది. చిత్తూరు జిల్లాలో 66 మండలాల్లో ఉండగా విభజన సమయంలో 18 మండలాలు అన్నమయ్య జిల్లాలో కలిశాయి. 17 మండలాలు తిరుపతి జిల్లాలో కలిశాయి. 31 మండలాలు చిత్తూరు జిల్లాలో మిగిలాయి. ఇందులో పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలవడంతో నాలుగు మండలాలను అన్నమయ్య జిల్లాలో కలిపారు. రెండు మండలాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో చిత్తూరు జిల్లా నుండి కలిసిన మండలాల సంఖ్య 22 పెరిగింది. చిత్తూరు జిల్లాలో మండలాల సంఖ్య 27 కు తగ్గింది. చిత్తూరు జిల్లా నుండి జిల్లా పరిషత్ వ్యవస్థ మాత్రం పాత నిర్మాణంలోనే కొనసాగుతోంది. ఫలితంగా పరిపాలనలో సమన్వయం లోపిస్తోంది. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గం రెండు జిల్లాలుగా విడిపోవడం వల్ల స్థానిక సమస్యలు మరింత క్లిష్టతరంగా మారాయి. ఒకే నియోజకవర్గానికి చెందిన సమస్యలు రెండు జిల్లాల మధ్య చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రజాప్రతినిధుల గైర్హాజరుకు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా పరిషత్‌లో ఒకే పార్టీ ఆధిపత్యం ఉండటంతో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు సమావేశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని అంటున్నారు. తమ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉండదనే భావనతో వారు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కూడా సమావేశాలను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు సభ్యులు, కీలక శాసనసభ్యులు సమావేశాలకు గైర్హాజరవడం వల్ల జిల్లా సమస్యలు రాష్ట్ర, కేంద్ర స్థాయికి వెళ్లే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా నిలిచిపోతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే జిల్లా అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో ప్రాధాన్య సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. వేసవి ప్రారంభంతో తాగునీటి కొరత పెరుగుతోంది. పశుగ్రాసం, పశువులకు నీటి సమస్యలు కూడా రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గాలేరు నగరి, హంద్రీ నీవా వంటి ప్రధాన ప్రాజెక్టులు నిధుల కొరతతో నత్తనడకన సాగుతున్నాయి. వాటర్ గ్రిడ్ ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పథకాలు ఆలస్యమవుతుండగా, నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యాలు కూడా పూర్తిగా సాధ్యం కావడం లేదు. ఇంకా మామిడి, చెరుకు రైతులు బకాయిల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మామిడి గుజ్జు పరిశ్రమలు, చక్కెర కర్మాగారాలు బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. అడవి ప్రాంతాల్లో ఏనుగులు, చిరుతల సమస్యలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇంతటి సమస్యల మధ్య జిల్లా పరిషత్ సమావేశాలు మాత్రం ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ సమావేశాలపై ప్రజల్లోనూ నమ్మకం తగ్గిపోతోంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ వేదిక ద్వారా పరిష్కారం లభిస్తుందన్న ఆశ క్రమంగా కనుమరుగవుతోంది. సమావేశాలు కేవలం అజెండా చదివి ముగించే కార్యక్రమాలుగా మారిపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా పరిషత్ విభజన అవసరమన్న డిమాండ్ బలపడుతోంది. ప్రతి జిల్లాకు వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తే, ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. సమస్యలపై స్పష్టమైన చర్చలు, తక్షణ చర్యలు తీసుకునే అవకాశం పెరుగుతుంది. లేకపోతే, కనీసం మూడు జిల్లాల్లో మార్పిడి పద్ధతిలో సమావేశాలు నిర్వహించాలన్న సూచనలు కూడా వినిపిస్తున్నాయి. అలా చేస్తే స్థానిక సమస్యలు స్థానిక స్థాయిలోనే పరిష్కారానికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమావేశాలకు హాజరు తప్పనిసరి చేసే విధంగా కఠిన మార్గదర్శకాలు తీసుకురావాలని, గైర్హాజరు అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా సూచనలు వస్తున్నాయి.

