శరవేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు
మండుతున్న ఎండలు… శరవేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు
12 మండలాల్లో సాధారణ స్థాయిలో భూగర్భ జలాలు
11 మండలాల్లో ఆందోళనకరం, ప్రమాదంలో రెండు మండలాలు
చిత్తూరు జిల్లాలో నీటి సంక్షోభం ముంచుకొస్తుందా?
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)
వేసవి ఆరంభం కావడంతో పాటు వర్షాలు తగ్గిపోవడం, వ్యవసాయ అవసరాల కోసం భూగర్భ జలాల వినియోగం పెరగడం కారణంగా చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలు శరవేగంగా దిగజారుతున్నాయి. ఉచిత విద్యుత్ అందుబాటులో ఉండటంతో రైతులు విద్యుత్ ఉన్నంతసేపు మోటార్లు నడపడం, ప్రస్తుతం మామిడి సీజన్ కావడంతో తోటలకు విరివిగా నీరు పట్టడం ఈ పరిణామాలన్నీ కలిసి భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. జిల్లాలోని శ్రీరగరాజపురం, తవణంపల్లి, విజయపురం మండలాల్లో భూగర్భ జలాలు
మూడు మీటర్ల కంటే పైన ఉన్నాయి. కుప్పం, గుడిపల్లి మండలాల్లో భూగర్భ జలాలు 20 మీటర్ల కంటే ఎక్కువకు పడిపోయాయి. ఈ రెండు మండలాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 12 మండలాల్లో ప్రస్తుతం భూగర్భ జలాలు సంతృప్తికరంగా 8 మీటర్ల లోతుల్లోనే ఉన్నాయి. మరో 11 మండలాలలో 20 మీటర్లకు పడిపోయాయి. ఈ గణాంకాలు భవిష్యత్తులో రానున్న సాగు తాగునీటి సంక్షోభానికి అద్దం పడుతున్నాయని భూగర్భజన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
గత సంవత్సరం మార్చిలో జిల్లాలో భూగర్భ జలాల సగటు మట్టం 13.22 మీటర్లుగా నమోదైంది. ఆ తర్వాత ఏప్రిల్ నాటికి 12.56, మేలో 12.45 మీటర్లకు తగ్గింది. వర్షాలు కొంతమేర కురిసిన జూన్‌లో 10.52కి మెరుగుపడగా, జూలైలో 11 మీటర్ల వద్ద నిలిచింది. ఆగస్టులో 9.8, సెప్టెంబర్‌లో 8.06, అక్టోబర్‌లో 7.48, నవంబర్‌లో 6.6 మీటర్ల వరకు మెరుగైన స్థాయికి చేరింది. డిసెంబర్‌లో 6.87గా ఉన్న నీటి మట్టం, జనవరిలో 8.42, ఫిబ్రవరిలో 9.84గా క్షీణించి, ప్రస్తుతం 10.96 మీటర్ల లోతుకు పడిపోయింది. ఈ గణాంకాలు వేసవి ప్రారంభంతోనే నీటి మట్టం ఎంత వేగంగా పడిపోతుందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని మండలాల వారీగా చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. మూడు మీటర్ల లోతులోనే నీరు లభిస్తున్న మండలాలు కేవలం మూడు మాత్రమే శ్రీరంగరాజపురం, తవణంపల్లి, విజయపురం. ఈ ప్రాంతాల్లో నీటి లభ్యత కొంతమేర అనుకూలంగా ఉన్నప్పటికీ, మిగిలిన మండలాల్లో పరిస్థితి అంతగా లేదు. మూడునుంచి ఎనిమిది మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్న మండలాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్తూరు గ్రామీణం, గుడిపాల, గంగాధర నెల్లూరు, కార్వేటినగరం, వెదురుకుప్పం, పూతలపట్టు, యాదమరి, నగరి, నిండ్ర, పలమనేరు, పెద్దపంజాణి, పులిచెర్ల మండలాలు ఈ వర్గంలో ఉన్నాయి. ఈ మండలాల్లో నీటి మట్టం మోస్తరు స్థాయిలో ఉన్నప్పటికీ, వేసవి తీవ్రత పెరిగే కొద్దీ మరింత దిగజారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎనిమిది నుంచి ఇరవై మీటర్ల లోతులో నీరు ఉన్న మండలాలు కూడా గణనీయంగా ఉన్నాయి. చిత్తూరు అర్బన్, పాలసముద్రం, పెనుమూరు, బంగారుపాలెం, ఐరాల, రామకుప్పం, శాంతిపురం, బైరెడ్డిపల్లి, గంగవరం, వి.కోట, రొంపిచెర్ల మండలాల్లో భూగర్భ జలాలు ఈ స్థాయిలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బోర్లు మరింత లోతుకు త్రవ్వాల్సి వస్తుండటంతో ఖర్చులు పెరుగుతున్నాయి. ఇరవై మీటర్లకు పైగా లోతులో భూగర్భ జలాలు ఉన్న మండలాలు కుప్పం, గుడుపల్లె మాత్రమే. ఈ రెండు మండలాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. నీటి కోసం రైతులు మరింత లోతుకు వెళ్లాల్సి రావడంతో సాగు ఖర్చులు పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో తాగునీటి, సాగునీటి పరిస్థితి కూడా క్రమంగా క్షీణిస్తోంది. చెరువులు ఇప్పటికే ఖాళీ అవుతున్నాయి. గతంలో వర్షాలు లేక ఖరీఫ్ పంటలు పూర్తిగా సాగుకాలేదు. తరువాత కురిసిన వర్షాలతో కొంతవరకు చెరువులు నిండినా, ప్రస్తుతం అవి మళ్లీ ఎండిపోతున్నాయి. చెరువుల మరమ్మతులు సరిగా లేకపోవడం, గండ్లు పడటం వంటి కారణాలతో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. దీంతో భూగర్భ జలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి మరింత పెరిగింది. భూగర్భ జలాలను పర్యవేక్షించేందుకు జిల్లాలో 59 పిజోమీటర్లు ఏర్పాటు చేసి ప్రతిరోజూ నీటి మట్టం నమోదు చేస్తున్నారు. ఈ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 15 మండలాల్లో పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ, మరో 13 మండలాల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. రెండు మండలాల్లో పరిస్థితి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. గతంలో అమల్లో ఉన్న వాల్టా చట్టం ప్రకారం బోర్లు త్రవ్వడానికి అనుమతి తప్పనిసరి. వ్యవసాయ బోర్లకు కనీస దూరం 150 మీటర్లు, తాగునీటి బోర్లకు 500 మీటర్ల దూరం పాటించాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం ఈ చట్టం అమలు సరిగా లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ బోర్లు త్రవ్వడం పెరిగింది. నియంత్రణ లేకుండా నీటిని విస్తృతంగా వినియోగించడం భూగర్భ జలాల వేగవంతమైన పడిపోవడానికి ప్రధాన కారణంగా మారింది.
భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. వేణుగోపాల్ రెడ్డి హెచ్చరిస్తూ నీరు ప్రకృతి సంపద. భూగర్భ జలాలు కూడా ప్రభుత్వ సంపదలో భాగమే. అవసరానికి మించి మోటార్లు నడపడం వల్ల నీటి మట్టం వేగంగా పడిపోతుంది. ఎంత అవసరం ఉంటే అంతవరకే నీటిని వినియోగించాలన్నారు. ఉచిత విద్యుత్ కారణంగా మోటార్లు నిర్లక్ష్యంగా నడపడం తగ్గించాలని సూచించారు. అలాగే ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. సాధారణ స్థాయిలో ఉంటే పెద్దగా ప్రభావం ఉండకపోయినా, తీవ్రంగా ఏర్పడితే వర్షపాతం తగ్గి కరవు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలా జరిగితే తాగునీటి, సాగునీటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని తెలిపారు. మొత్తంగా చూస్తే చిత్తూరు జిల్లాలో నీటి సంక్షోభం మెల్లగా ముంచుకొస్తోంది. ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. నీటిని పొదుపుగా వినియోగించడం, చెరువులను సంరక్షించడం, భూగర్భ జలాలను కాపాడుకోవడం ఇవి ప్రతి ఒక్కరి బాధ్యతగా మారాయి. నీరు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందనే నిజాన్ని గుర్తించి ప్రతి చుక్క నీటిని ఆదా చేయాల్సిన సమయం ఇదే.

