9, ఏప్రిల్ 2026, గురువారం

జిల్లాకు తలమాణికంగా ఎన్ పి సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల

జిల్లాకు విద్య సుగందాలను వెదజల్లుతున్న కళాశాల
ఎందరో ప్రముఖులకు విద్యాబుద్ధులు నేర్పిన విద్యాలయం
44 వసంతాలు పూర్తి చేసుకుని నేడే స్నాతకోత్సవం
ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మాజీ ఉప రాష్ట్రపతి

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు జిల్లా మహిళా విద్యారంగంలో అగ్రగామిగా నిలిచిన శ్రీమతి ఎన్.పి. సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మరోసారి తన ప్రతిష్ఠను చాటుకుంటోంది. జిల్లాకు తలమాణికంగా, విద్యా సుగంధాలను వెదజల్లుతున్న ఈ విద్యాలయం ఎందరో ప్రముఖులకు విద్యాబుద్ధులు నేర్పి, క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దింది. ఈ కళాశాల 44 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుని గురువారం స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానుండటం కార్యక్రమానికి విశేష ప్రాధాన్యతను తెచ్చింది.

గత నాలుగు దశాబ్దాలుగా విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఈ కళాశాల, మహిళా సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని వేలాది మంది విద్యార్థినుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుబంధంగా కొనసాగుతున్న ఈ సంస్థ, చిత్తూరు జిల్లా మాత్రమే కాక పరిసర ప్రాంతాల మహిళలకు ఉన్నత విద్యను అందించే ప్రముఖ కేంద్రంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా గ్రామీణ, పేద వర్గాలకు చెందిన విద్యార్థినులు కూడా ఇక్కడ సులభంగా ఉన్నత విద్యను అభ్యసిస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. విద్యా ప్రమాణాల పరంగా ఈ కళాశాల ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్ ) ద్వారా 2006లో బి ప్లస్, 2015లో బి గ్రేడ్ గుర్తింపులు పొందిన ఈ సంస్థ, ఇటీవల సంవత్సరాల్లో మరింత అభివృద్ధి సాధిస్తూ 2023లో ఏ గ్రేడ్‌ను అందుకుంది. ఇది కళాశాలలో అమలు చేస్తున్న నాణ్యమైన బోధన విధానాలు, ఆధునిక సదుపాయాల ప్రతిఫలంగా నిలిచింది. కళాశాలలో బి.ఏ, బి.కామ్, బి.ఎస్.సి వంటి సాధారణ కోర్సులతో పాటు కంప్యూటర్స్, మైక్రోబయాలజీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మైక్రోబయాలజీ, జువాలజీ కోర్సులు, అలాగే జువాలజీలో పీహెచ్‌డీ, ఎంఫిల్ అవకాశాలు కూడా కల్పించడం విశేషం. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ట్రాన్స్‌లేషన్, సెరికల్చర్ వంటి నైపుణ్యాధారిత డిప్లొమా కోర్సులు విద్యార్థినుల ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి. విజ్ఞానం, నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మహిళా గ్రాడ్యుయేట్లను తయారుచేయడమే ఈ కళాశాల ప్రధాన లక్ష్యం. విద్యార్థి కేంద్రీకృత బోధన విధానం ఈ కళాశాల ప్రత్యేకతగా నిలుస్తోంది. గ్రంథాలయ అధ్యయనం, ఈ-లెర్నింగ్ సదుపాయాలు, మానా టీవీ కార్యక్రమాలు, స్మార్ట్ టీవీలు, హ్యాండ్‌అవుట్‌లు, గ్రూప్ డిస్కషన్‌లు, సెమినార్లు, బజ్ సెషన్‌లు, రోల్ ప్లేలు, ప్రాజెక్ట్‌లు వంటి పద్ధతుల ద్వారా విద్యార్థులలో విశ్లేషణాత్మక దృక్పథాన్ని పెంపొందిస్తున్నారు. పాత ప్రశ్నపత్రాలపై చర్చలు, నిపుణుల ఉపన్యాసాలు, విద్యా పోటీలు నిర్వహించడం ద్వారా వారికి పోటీ ప్రపంచానికి సిద్ధం చేస్తున్నారు. పరిశోధన రంగంలో కూడా ఈ కళాశాల గణనీయమైన పురోగతి సాధించింది. యూజీసీ, డీఎస్టీ సంస్థల నుండి అనేక పరిశోధన ప్రాజెక్టులు సాధించడం మాత్రమే కాకుండా, రూ. 33 లక్షలకు పైగా పరిశోధన నిధులను సమీకరించడం విశేషం. విశ్వవిద్యాలయ స్థాయికి సరితూగే ప్రయోగశాలలు, సదుపాయాలు అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులలో పరిశోధనా ఆసక్తి పెరుగుతోంది.

మౌలిక వసతుల పరంగా 23 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ క్యాంపస్‌లో 5 ఎకరాల ఆట స్థలం, సక్రమమైన తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు విద్యార్థుల అభ్యాసానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ప్రస్తుతం యూజీ, పీజీ, పరిశోధన కోర్సుల్లో కలిపి సుమారు 551 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది కళాశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతర్గత నాణ్యత హామీ విభాగం ద్వారా విద్యా ప్రమాణాలను నిరంతరం మెరుగుపరుస్తూ విద్యార్థుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, జాతీయత వంటి విలువలను విద్యార్థులలో బలంగా నాటుతున్నారు. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి  విభాగాల ద్వారా సేవాభావం, క్రమశిక్షణ, జట్టు స్పూర్తి వంటి లక్షణాలను పెంపొందిస్తున్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు అకడమిక్‌తో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో విస్తృత అవకాశాలు కల్పిస్తున్నారు. ఇటీవల సంవత్సరాల్లో ఉత్తీర్ణత శాతం 81 శాతం నుంచి 95 శాతం వరకు పెరగడం కళాశాల బోధన నాణ్యతకు నిదర్శనం. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో విజయం సాధించడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరచడం ద్వారా కళాశాల ఖ్యాతి మరింత పెరిగింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్లేస్‌మెంట్ సెల్ చురుకుగా పనిచేస్తోంది. అనేక మంది విద్యార్థినులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందగా, మరికొందరు ఉన్నత విద్య కోసం ముందుకు సాగుతున్నారు. అలాగే స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ విద్యార్థుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నారు. స్నాతకోత్సవం సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు పట్టాలను ప్రధానం చేయనున్నారు. ఈ వేడుకలలో సంప్రదాయ నాటకాలు, సామాజిక అంశాలపై ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. విద్యార్థినులు, అధ్యాపకులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరు ఈ వేడుకలకు మరింత గౌరవాన్ని తీసుకురానుంది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే మనోహర్  మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం సంస్థ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలు సాధించేందుకు చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి సహకరించిన అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు, దాతలకు ధన్యవాదాలు తెలిపారు. మహిళా విద్యకు వెలుగుదారి చూపుతూ, సంప్రదాయ విలువలను కాపాడుతూ ఆధునిక విద్యా విధానాలను ఆవిష్కరిస్తూ ముందుకు సాగుతున్న సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల… 44 ఏళ్ల వైభవంతో మరోసారి తన ప్రత్యేకతను ప్రపంచానికి చాటుకుంటోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *