25, ఏప్రిల్ 2026, శనివారం

వర్గ పోరు వేడెక్కిన జీడీ నెల్లూరు…

థామస్ వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం
వివరణ కోరిన రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు లోకేష్

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)


జీడీ నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గురువారం ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ తన నియోజకవర్గ పర్యటనలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గ పోరును మళ్లీ చర్చనీయాంశంగా మార్చాయి. ఎస్సీ ఎమ్మెల్యేలు స్వంత ఖర్చుతో గెలిచినా, కొందరి ముందు అణగి మణిగి ఉండాల్సి వస్తోందని ఆయన వ్యక్తం చేసిన ఆవేదన రాజకీయంగా కలకలం రేపింది. ఇటీవల సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, ఆయన కుమారుడు సుమన్ పార్టీపై చేసిన విమర్శలు ఇంకా చల్లారకముందే, థామస్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. మీడియా కథనాల్లో చంద్రబాబు నాయకత్వంపై మరో ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం రావడంతో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ద్వారా థామస్ నుంచి వివరణ కోరించారు. దీనిపై స్పందించిన థామస్, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిసింది.

ఇదే సమయంలో నియోజకవర్గంలో తొలి నుంచీ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా ఉన్న రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, థామస్ మధ్య తిరుపతిలోని ఓ హోటల్‌లో రాజీ చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ చర్చల్లో గాలి చినబాబు మధ్యవర్తిత్వం వహించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఒకవైపు రాజీ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, మరోవైపు వర్గ పోరు అంతర్గతంగా కొనసాగుతోందన్న అనుమానాలు ఎమ్మెల్యే వర్గంలో వ్యక్తమవుతున్నాయి. రాజీ పేరిట ఒకవైపు మాట్లాడుతూనే, మరోవైపు వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో సామాజిక సమీకరణాల అంశం కూడా ఈ వివాదానికి మరింత ఇంధనం పోస్తోంది. దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయిన థామస్‌పై జరుగుతున్న వ్యవహారంపై దళిత నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవుల పంపిణీలో అసమానతలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఆరు మండలాల్లో మూడు మండల అధ్యక్ష పదవులు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చి, కేవలం ఇద్దరు ఎస్సీలు, ఒక బీసీకి మాత్రమే అవకాశం కల్పించారని చెబుతున్నారు.

గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన బి.ఆర్. నాయుడుకు టిటిడి చైర్మన్ పదవి ఇవ్వడం, చిట్టిబాబు నాయుడును రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, అరుణను కార్యదర్శిగా నియమించడం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. అయితే అధిక ఓటు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఒక్క పదవి కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక వర్గానికి అన్ని కీలక పదవులు కేటాయించినప్పటికీ, దళిత ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు కొనసాగుతుండటం ఆందోళనకరమని దళిత నేతలు పేర్కొంటున్నారు. ఇక నియోజకవర్గంలో మరో వర్గం ఇప్పటికీ థామస్‌పై విమర్శలు కొనసాగిస్తోందని సమాచారం. దీంతో టీడీపీ లోపల వర్గ పోరు తాత్కాలికంగా చల్లారినట్లు కనిపించినా, అంతర్గతంగా మళ్లీ ముదురుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ విభేదాలు పార్టీపై ఎంత ప్రభావం చూపుతాయన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *