10, ఏప్రిల్ 2026, శుక్రవారం

మామిడి రైతుకు కవర్ల కష్టాలు

అంతర్జాతీయ యుద్ధాల సెగ
చైనా నుంచి అందని మెటీరియల్
మామిడి రైతుకు కవర్ల కష్టాలు
దిగుబడి తగ్గుదలతో డబుల్ షాక్

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

ఎక్కడో జరుగుతున్న అంతర్జాతీయ యుద్ధాలు జిల్లాలోని మామిడి తోటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గతేడాది ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు పతనమై రైతులు నష్టపోయారు. ఈ ఏడాది మాత్రం మామిడి కాయలను రక్షించే కవర్ల కొరత రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, పెరిగిన పెట్టుబడి ఖర్చులు, మార్కెట్ అనిశ్చితి మధ్య రైతు ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు కవర్ల సమస్య మరో పెద్ద సవాలుగా మారింది. గత సంవత్సరం కవర్లు గట్టిన మామిడి కాయలకు మంచి గిరాకీ వచ్చింది. దీంతో ఈ సంవత్సరం కూడా మామిడి కవర్ల కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూశారు. అందుకు తగిన విధంగానే ఉద్యానవన శాఖ అధికారులు కూడా 12 కోట్ల కవర్లు కావాలని ఇండెంట్ పెట్టారు. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా చైనా నుంచి రావాల్సిన మెటీరియల్ రాకపోవడంతో సకాలంలో రైతులకు నాణ్యమైన మామిడి కవర్లను ఉద్యానవన శాఖ  అందచేయలేకపోతోంది.

జిల్లాలో విస్తృత స్థాయిలో మామిడి సాగు జరుగుతోంది. వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండగా, వేలాది మంది రైతులు నేరుగా మామిడి పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉపాధి పరంగా కూడా ఈ పంట కీలక పాత్ర పోషిస్తోంది. పంట కోత, గ్రేడింగ్, రవాణా వంటి పనుల ద్వారా లక్షలాది మంది కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. గత సంవత్సరం జిల్లాలో సుమారు ఆరు లక్షల టన్నుల మామిడి దిగుబడి నమోదైంది. అయితే మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రైతులకు సరైన ధర లభించలేదు. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోవడం వల్ల మామిడి పల్ప్ పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫ్యాక్టరీలు కొనుగోళ్లు తగ్గించడంతో రైతులు తమ పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడ్డారు. మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో కిలో మామిడి ధర నాలుగు రూపాయల వరకు పడిపోయింది. దీంతో అనేక మంది రైతులు పెట్టుబడులు కూడా తిరిగి పొందలేకపోయారు. ఈ ఏడాది పరిస్థితి కొంత భిన్నంగా ఉన్నప్పటికీ సవాళ్లు మాత్రం తగ్గలేదు. ఉద్యానవన శాఖ అంచనాల ప్రకారం ఈసారి మామిడి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశముంది. గత ఏడాది ఆరు లక్షల టన్నులు వచ్చిన దిగుబడి, ఈసారి సుమారు నాలుగు లక్షల టన్నులకు పరిమితం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పులు, పూల దశలో వచ్చిన ఇబ్బందులు, నీటి కొరత వంటి కారణాలు దిగుబడిపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, మామిడి కాయల నాణ్యతను కాపాడేందుకు రైతులు ఉపయోగించే కవర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. గతంలో ప్రధానంగా టేబుల్ వెరైటీ మామిడి కాయలకు మాత్రమే కవర్లు వాడుతుండగా, ఈ సంవత్సరం తోతాపూర్ రకానికి కూడా కవర్లు అందజేయడం ప్రారంభించారు. దీంతో కవర్లకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. గతేడాది రెండు కోట్ల కవర్లు సరిపోతే, ఈసారి డిమాండ్ పన్నెండు కోట్లకు చేరింది. అయితే సరఫరా మాత్రం ఆ మేరకు లేకపోవడం గమనార్హం. ఇప్పటివరకు సుమారు తొమ్మిది కోట్ల కవర్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన మూడు కోట్ల కవర్ల కోసం ఉద్యానవన శాఖ ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ, ముడిసరుకు కొరత అడ్డంకిగా మారింది. ఈ కవర్ల తయారీలో ఉపయోగించే ముడి పదార్థం ప్రధానంగా విదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి అవుతుండటంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరింత ఆందోళనకర విషయం ఏమిటంటే, అందుబాటులో ఉన్న కవర్లలో నాణ్యత లోపాలు కూడా కనిపిస్తున్నాయి. నాసిరకం కవర్లు వాడితే కాయలపై మచ్చలు పడే ప్రమాదం ఉంది. దీంతో రైతులు మార్కెట్‌లో మంచి ధర పొందలేకపోతారు. గ్రేడ్-ఏ స్థాయి కాయలు గ్రేడ్-సీగా పడిపోవడం వల్ల నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో కవర్లు అందజేస్తుండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం, సకాలంలో కవర్లు అందకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. మామిడి కాయ ఒక నిర్దిష్ట దశలో ఉన్నప్పుడే కవర్లు కట్టాలి. ఆలస్యం అయితే ఆ కవర్ల ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో సకాలంలో సరఫరా అత్యంత కీలకం. రైతులు ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలు, పురుగుమందుల ఖర్చులు, కూలీల వ్యయం వంటి అంశాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కవర్ల కొరత మరింత భారంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో కవర్ల పంపిణీలో పారదర్శకత లేకపోవడం, సిఫార్సులు ప్రాధాన్యం పొందుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉద్యానవన శాఖ అధికారులు మాత్రం సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. మిగిలిన కవర్ల సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు నాణ్యమైన కవర్లు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ వనరుల నుంచి ముడిసరుకు సమీకరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు.

అయితే రైతులు మాత్రం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతేడాది ఎదురైన నష్టాల నుంచి ఇంకా కోలుకోకముందే ఈసారి మరో సమస్య తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతుల సమస్యలు, ధరల పతనం, ఇప్పుడు కవర్ల కొరత ఇలా వరుస సమస్యలతో మామిడి రైతు నష్టాల్లోనే కొనసాగుతున్నాడని అంటున్నారు. మొత్తం మీద అంతర్జాతీయ పరిణామాలు స్థానిక రైతుపై ఎంతటి ప్రభావం చూపుతాయో ఈ పరిస్థితి స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని కవర్ల కొరతను వెంటనే తీర్చకపోతే, ఈ ఏడాది కూడా మామిడి రైతులకు నిరాశే మిగిలే ప్రమాదం ఉంది. రైతు కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే, సరైన సమయంలో సరైన సహాయం అందించడం అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *