టెన్త్ పరీక్షల మూల్యాంకనంలో సరికొత్త విధానం
ట్యాబ్‌లతో టెన్త్ మూల్యాంకనం తప్పుచేస్తే ఫైన్
డిజిటల్ మార్కింగ్ దిశగా అడుగు, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
మూల్యాంకనంలో కొత్త నియమాలు, టీచర్లపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ
లీప్ యాప్‌తో మార్కుల నమోదు పొరపాట్లకు చెక్!
నేటి నుంచి పదవ తరగతి మూల్యాంకనం ప్రారంభం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈసారి సమాధాన పత్రాల మూల్యాంకనంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేలా పాఠశాల విద్యాశాఖ కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా మూల్యాంకనంలో నిర్లక్ష్యం చేస్తే జరిమానా విధించే విధంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం ఈసారి ప్రధాన హైలైట్‌గా మారింది. గతంలో మార్కుల కౌంటింగ్‌లో చోటుచేసుకున్న పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని ఈసారి పూర్తిగా డిజిటల్ విధానానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అందులో భాగంగా ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రత్యేక సహాయకులు లీప్ యాప్ లాగిన్ అయి ప్రతి సమాధాన పత్రాన్ని బార్‌కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి మార్కులు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు విడివిడిగా మార్కులు నమోదు చేయడం, ఛాయిస్ ప్రశ్నలకు సంబంధించిన అన్ని ఎంపికలను పరిగణనలోకి తీసుకోవడం, అవసరమైన చోట ఎన్ ఎ నమోదు చేయడం వంటి అంశాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా 0.5 మార్కుల వంటి సూక్ష్మ లెక్కింపుల విషయంలో కూడా పొరపాట్లు జరగకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి సమాధాన పత్రానికి రో వారీగా టోటల్ చెక్ చేయడం, బెస్ట్ ఆఫ్ టూ విధానం సరైనదిగా అమలవుతోందో లేదో పరిశీలించడం తప్పనిసరి చేశారు. అంతేకాకుండా అసిస్టెంట్ ఎగ్జామినర్ నమోదు చేసిన మార్కులను చీఫ్ ఎగ్జామినర్ మరోసారి పరిశీలించి ధృవీకరించే విధానాన్ని కట్టుదిట్టం చేశారు. మూల్యాంకన ప్రక్రియలో ప్రతి దశలో వెరిఫికేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్కులు నమోదు చేసిన తర్వాత ప్రివ్యూ చేసి మళ్లీ పరిశీలించి, చివరకు కన్ఫర్మ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పెండింగ్ స్క్రిప్టులు ఏవైనా మిగిలి ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించి ఖచ్చితత్వాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి మూల్యాంకనంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సమయంలో తప్పులు బయటపడితే సంబంధిత సిబ్బందిపై జరిమానాలు విధించనున్నారు. అవసరమైతే కమిషనర్, డైరెక్టర్ స్థాయికి నివేదికలు పంపించి, బాధ్యుల నుంచి వివరణ కోరే ప్రక్రియను అమలు చేయనున్నారు. ఏప్రిల్ 1తో పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో ఏప్రిల్ 4 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా మూల్యాంకనం నిర్వహించనున్నారు. వేలాది మంది ఉపాధ్యాయులు ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు. ఇప్పటికే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కొత్త విధానంపై అవగాహన కల్పించారు. చిత్తూరు జిల్లాలో కూడా మూల్యాంకన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పిసిఆర్ ఉన్నత పాఠశాలలో సైన్స్, సోషల్, గణితం పత్రాల మూల్యాంకనం జరగనుండగా, కెసిఆర్ జూనియర్ కళాశాలలో తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతం పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో వందలాది మంది సిబ్బంది పాల్గొననున్నారు. మొత్తం మీద ఈసారి ట్యాబ్‌ల వినియోగం, డిజిటల్ నమోదు, బహుళ స్థాయిల వెరిఫికేషన్, తప్పులకు జరిమానా వంటి కఠిన చర్యలతో పదో తరగతి మూల్యాంకనాన్ని పూర్తిగా పారదర్శకంగా, తప్పులేమీ లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ మార్పులు విద్యార్థుల భవిష్యత్తును మరింత భద్రపరచే దిశగా కీలకంగా మారనున్నాయి.

