13, ఏప్రిల్ 2026, సోమవారం

మున్సిపాలిటీలలో రోజు విడిచి రోజు నీటి సరఫరా


అవసరమైన నీటిలో సగం కూడా సరఫరా చేయని మున్సిపాలిటీలు

భూగర్భ జలాల మీదనే ఆధారపడుతున్న తాగునీటి సరఫరా

శాశ్వత నీటి వనరుల కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు జిల్లాలోని పట్టణాల్లో తాగునీటి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. కార్పొరేషన్ హోదాలో ఉన్న చిత్తూరు నగరం నుంచి నగరి, పలమనేరు మున్సిపాలిటీలు, కుప్పం నగర పంచాయతీ వరకు ఎక్కడ చూసినా ఒకే సమస్య, ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందడం లేదు. మున్సిపాలిటీలు అధికారికంగా సరఫరా చేస్తున్నామని చెబుతున్నా, వాస్తవానికి రెండు రోజులకు ఒకసారి మాత్రమే నీరు వదులుతున్న పరిస్థితి నెలకొంది. వేసవి వేడి పెరిగిన కొద్దీ ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. ఉదయం సూర్యోదయం కాకముందే మహిళలు బిందెలతో నీటి కోసం క్యూలో నిలబడటం, చిన్న పిల్లలు కూడా నీళ్లు తెచ్చే పనిలో పడటం పట్టణాల్లో సాధారణ దృశ్యంగా మారింది.

చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో నీటి వనరులు ఉన్నప్పటికీ, నిరంతర సరఫరా చేయగల సామర్థ్యం లేదు. నగరానికి రోజుకు 27.50 ఎంఎల్డీ నీరు అవసరం కాగా, రెండో రోజులకు ఒకసారి 47.20 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు. 457 పవర్ బోర్లు, ఎన్టీఆర్ జలాశయం, ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నప్పటికీ ప్రతిరోజు సరఫరా సాధ్యంకావడం లేదు. ఒకవైపు బోర్లు పాడవుతుంటే, మరమ్మత్తులు పూర్తయ్యే వరకు ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. అధికారుల ప్రకారం ప్రతి వ్యక్తికి 135 ఎల్పీసీడీ నీరు అందిస్తున్నామని చెబుతున్నా, ప్రజలు మాత్రం అది కేవలం లెక్కల్లో మాత్రమే ఉందని అంటున్నారు. అడివిపల్లి రిజర్వాయర్ ద్వారా తాగునీటి సరఫరా కోసం అమృత్ యుఐడీఎఫ్ పథకం కింద టెండర్లు పూర్తయ్యి పనులు ప్రారంభమయ్యే దశలో ఉన్నప్పటికీ, తక్షణ ఉపశమనం మాత్రం కనిపించడం లేదు.

కుప్పం నగర పంచాయతీలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు. రోజుకు 4.20 ఎంఎల్డీ నీరు అవసరం కాగా, ప్రస్తుతం 4.10 ఎంఎల్డీ నీటిని రెండు రోజులకు ఒకసారి మాత్రమే సరఫరా చేస్తున్నారు. 200కు పైగా బోర్లు ఆధారంగా నీటిని పంపిణీ చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి కేవలం 69 ఎల్పీసీడీ మాత్రమే అందుతోంది. కృష్ణా జలాలు అందుబాటులోకి రావడంతో పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ, ప్రతిరోజు సరఫరా చేసే స్థితి ఇంకా రాలేదు. అమృత్ పథకం పూర్తి అయితే 135 ఎల్పీసీడీ లక్ష్యంతో ప్రతిరోజు నీటి సరఫరా అందించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

నగరి మున్సిపాలిటీలో రోజుకు 9.25 ఎంఎల్డీ నీరు అవసరం కాగా, ప్రస్తుతం 8.54 ఎంఎల్డీ మాత్రమే సరఫరా అవుతోంది. గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా కొంత నీరు అందుతున్నప్పటికీ, 157 పవర్ బోర్లు, హ్యాండ్ బోర్లు, ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. 29 వార్డుల్లో రోజుకొకసారి నీటి సరఫరా జరుగుతున్నా, 0.71 ఎంఎల్డీ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లోటును భర్తీ చేయడానికి రోజూ 18 ట్యాంకర్ ట్రిప్పులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి వ్యక్తికి 122 ఎల్పీసీడీ నీరు అందుతోంది. అమృత్ పథకం కింద 17.93 కోట్ల రూపాయలతో డిజైన్ దశలో ఉన్న పనులు పూర్తి అయితే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.

పలమనేరు మున్సిపాలిటీ పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. రోజుకు 3.10 ఎంఎల్డీ నీరు అవసరం కాగా, కాల్వపల్లి జలాశయం నుంచి నీటిని పంపుతున్నప్పటికీ సరిపోవడం లేదు. 86 పవర్ బోర్లు, ఒక్క ట్యాంకర్ ఆధారంగా రెండు రోజులకు ఒకసారి మాత్రమే సరఫరా చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి కేవలం 70 ఎల్పీసీడీ నీరు మాత్రమే అందుతోంది. కొన్నిచోట్ల ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే నీటి సమస్య పట్టణాల్లోనూ తీవ్రంగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

చిత్తూరు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ప్రధాన సమస్య భూగర్భ జలాలపై అధిక ఆధారపడటమే. పవర్ బోర్లు, హ్యాండ్ బోర్లు ప్రధాన వనరులుగా మారాయి. బోర్లు పాడైతే వెంటనే మరమ్మత్తులు జరగకపోవడం వల్ల ఆ ప్రాంత ప్రజలు పూర్తిగా నీటి లేకుండా పోతున్నారు. భూగర్భ జల మట్టాలు పడిపోవడంతో కొత్త బోర్లు త్రవ్వడం కూడా కష్టంగా మారింది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా, అది కేవలం మొక్కుబడిగా మాత్రమే ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. ట్యాంకర్ వచ్చినా అందరికీ నీరు చేరడం లేదు. సరఫరాలో అసమానతలు, ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. నీరు కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి రావడం, ఉద్యోగాలకు వెళ్లే వారికి ఆలస్యాలు కావడం, పిల్లల చదువుపై ప్రభావం పడటం అన్నీ కలిపి ప్రజల జీవన విధానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. పేదవర్గాలు ప్రైవేట్ ట్యాంకర్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది.

వేసవి కాలంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. పనిచేయని హ్యాండ్ బోర్లను మరమ్మత్తు చేయడం, పవర్ బోర్లకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయడం, పైపులైన్ లీకేజీలను అరికట్టడం, అవసరమైతే ట్యాంకర్ ట్రిప్పులను పెంచడం వంటి చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా, ఇవి తాత్కాలిక పరిష్కారాలుగానే మిగిలిపోతున్నాయి. ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. శాశ్వత తాగునీటి వనరులు లేకపోవడం ఈ సమస్యకు మూలకారణంగా మారింది. జలాశయాలు, నదుల నుంచి స్థిరంగా నీటిని అందించే ప్రాజెక్టులు లేకుండా భూగర్భ జలాలపై ఆధారపడటం వల్ల సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. అమృత్ వంటి పథకాలు ఆశ చూపుతున్నప్పటికీ, అవి పూర్తిస్థాయిలో అమలులోకి రావడానికి సమయం పడుతుంది. అప్పటి వరకు ప్రజలు ఈ కష్టాలను భరించాల్సిన పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్య ఇప్పుడు పరిపాలనా అంశం మాత్రమే కాదు, ప్రజల జీవన హక్కుతో ముడిపడిన అంశంగా మారింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సిన పరిస్థితి మారాలంటే తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే పట్టణాల్లో నీటి కోసం క్యూలలో నిలబడే దృశ్యాలు మరింత సాధారణమైపోయే ప్రమాదం ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *