23, ఏప్రిల్ 2026, గురువారం

జిల్లాలోని 157 గ్రామాలలో తీవ్ర తాగునీటి సమస్య

జిల్లాలో ఎండిపోయిన 329 చెరువులు 

రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలు

చిత్తూరు జిల్లాలో తాగునీటి కష్టాలు తీవ్రం 

 జిల్లాలో తగునీటి సమస్యపై జిల్లా కలెక్టర్ సమీక్ష 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్య ఆందోళనకర స్థాయికి చేరుకుంది. భూగర్భ జలాలు అడుగంటడం, వర్షాభావం, పాడైన నీటి వసతులు కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. అధికార యంత్రాంగం సమీక్షలు నిర్వహిస్తూ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో భూగర్భ జల శాఖ తాజా అంచనాల ప్రకారం సుమారు 157 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో నీటి ఎద్దడి మరింత పెరిగింది. రెండు మండలాల్లో నీటి మట్టం 20 మీటర్ల కంటే లోతుకు పడిపోయినట్లు అధికారులు గుర్తించారు.

జిల్లాలోని పూతలపట్టు మండలం తిమ్మినాయుడు పల్లి, చింతపల్లి గ్రామాల్లో బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో ప్రజలు 2 నుండి 3 కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. హ్యాండ్‌పంపులు పనికిరాకపోవడంతో మహిళలు గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. గంగవరం మండలం నల్లగుట్ట, గంగాపల్లి గ్రామాల్లో వారానికి ఒకసారి మాత్రమే ట్యాంకర్ ద్వారా నీరు అందుతుండటంతో ప్రజలు నిల్వ చేసుకుని వినియోగిస్తున్నారు. పిచ్చాటూరు మండలం రామగిరి గ్రామంలో కూడా బోర్లపై ఆధారపడుతున్నప్పటికీ నీటి మట్టం పడిపోవడంతో సరఫరా తగ్గిపోయింది. ఇక నిండ్ర మండలం భూగర్భ జలాల అధిక వినియోగం కారణంగా ‘ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్’ మండలంగా మారింది. పలమనేరు రూరల్ మండలం మొసలి మడుగు గ్రామంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇక్కడ గ్రామంలో రెండు తాగునీటి ట్యాంకులు ఉన్నప్పటికీ, అవి ప్రజలకు ఉపయోగపడని స్థితిలో ఉన్నాయి. రోడ్డు పక్కన ఉన్న ఒక ట్యాంకు అటవీ శాఖ ద్వారా సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించబడింది. ఈ ట్యాంకుకు బోరు నుంచి నీరు చేరుతున్నప్పటికీ, గ్రామానికి సరఫరా చేసే రిటర్న్ కనెక్షన్ లేకపోవడంతో నీరు ప్రజలకు అందడం లేదు. ట్యాంకును శుభ్రం చేయడానికి నిచ్చెన లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో కాకులు, కోతులు చనిపోయి నీరు కలుషితమవుతున్న ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. మరో ట్యాంకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా నిర్మించబడినది. ఇది గత పది సంవత్సరాలుగా పగుళ్లు ఏర్పడి లీకేజీ అవుతోంది. ట్యాంకు పక్కన ఉన్న ఇళ్లపై కూలే ప్రమాదం నెలకొనడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నీటి సరఫరా సరిగా లేకపోవడంతో పై వీధిలో నివసించే యానాదులు మరియు ఇతర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం పది రోజులకు ఒకసారి రెండు మూడు బిందెల నీరు మాత్రమే అందుతుండటం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. గ్రామంలో పైపులైన్లు డ్రైనేజీ కింద ఉండటం వల్ల పైపులు పగిలి, డ్రైనేజీ నీరు కలవడంతో తాగునీరు పూర్తిగా కలుషితమైంది. ప్రజలు తాగడానికి పనికిరాని నీటిని వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పబ్లిక్ కొళాయిలు పాడైపోవడంతో నీటి వృథా కూడా జరుగుతోంది. గత సంవత్సరం వేసిన బోరు కూడా ఇప్పటివరకు వినియోగంలోకి రాకపోవడం ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది.

ఇక ఐరాల, తవణంపల్లి, కుప్పం, గుడిపల్లి, రామకుప్పం, వీకోట, బైరెడ్డిపల్లి మండలాల్లో భౌగోళిక పరిస్థితుల కారణంగా నీటి ఎద్దడి ప్రతి వేసవిలో తీవ్రమవుతోంది. ఈ మండలాలు సముద్రమట్టానికి 700 మీటర్ల ఎత్తులో ఉండటంతో భూగర్భ జలాలు త్వరగా తగ్గిపోతున్నాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాలు 300 నుండి 400 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల కొంతవరకు పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ, మొత్తం మీద నీటి సమస్య తీవ్రంగానే ఉంది. జిల్లాలో మొత్తం 3,106 చెరువులు ఉండగా, అందులో 1,358 చెరువుల్లో మాత్రమే పూర్తిస్థాయిలో నీరు ఉంది. 567 చెరువుల్లో సగం మాత్రమే నీరు ఉండగా, 49 చెరువుల్లో 25 శాతం మాత్రమే నీరు ఉంది. మరో 329 చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. దీని ప్రభావం పశువులపై, వ్యవసాయంపై తీవ్రంగా పడుతోంది. రైతులు పశువులకు నీరు అందించలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో తాగునీటి సమస్యకు ప్రధాన కారణాలు భూగర్భ జలాల మితిమీరిన వినియోగం, తక్కువ వర్షపాతం, గట్టి రాతి భూభాగం, పాడైన పైపులైన్లు, విద్యుత్ అంతరాయాలు మరియు నీటి నాణ్యతలో లోపాలు. సుమారు 39 ప్రాంతాల్లో నీటి లవణీయత పెరగడంతో అందుబాటులో ఉన్న నీరు కూడా తాగడానికి పనికిరాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3,65,655 గృహాలలో ఇప్పటివరకు 3,07,183 గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించగా, మిగిలిన 58,472 గృహాలకు కనెక్షన్లు ఇవ్వడానికి చర్యలు కొనసాగుతున్నాయి. రూ. 2,936.16 లక్షలతో 147 పనులు ప్రతిపాదించబడ్డాయి. 2028 నాటికి హర్ ఘర్ జల్ లక్ష్యాన్ని సాధించడమే ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు పేర్కొన్నారు.
ప్రణాళికలు ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో అమలు లోపించడంతో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మొసలి మడుగు వంటి గ్రామాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త నీటి ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ మరమ్మతులు, పబ్లిక్ కొళాయిల పునరుద్ధరణ, బోర్ల వినియోగం వంటి చర్యలు వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి వేసవిలో పునరావృతమవుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరమని ప్రజలు కోరుతున్నారు. తాత్కాలిక ట్యాంకర్ల సరఫరా కాకుండా దీర్ఘకాలిక నీటి వనరుల అభివృద్ధి, జల సంరక్షణ చర్యలు వేగవంతం చేయకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంది. జిల్లా యంత్రాంగం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగి ప్రతి గ్రామానికి సురక్షిత తాగునీరు అందించాల్సిన అవసరం అత్యవసరంగా మారింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *