1, ఏప్రిల్ 2026, బుధవారం

నేటితో ముగియనున్న సర్పంచుల పదవీకాలం


ప్రారంభం కానున్న ప్రత్యేక అధికారుల పాలన

జిల్లాలో 13 పంచాయతీలకు జరగని ఎన్నికలు

పంచాయితీలలో మూలుగుతున్న రూ.15.63 కోట్ల నిధులు

జిల్లాలో 6 మంది సర్పంచుల చెక్ పవర్ రద్దు


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచుల ఐదేళ్ల పదవీకాలం గురువారంతో ముగియనుంది. జిల్లాలోని పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడానికి కసరత్తు పూర్తయింది. గురు లేక శుక్రవారంలో ప్రత్యేక అధికారులు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు.  2019లో ఎన్నికైన సర్పంచులు తమ పదవీకాలాన్ని పూర్తి చేయగా, ఇకపై గ్రామ పాలన తాత్కాలికంగా అధికార యంత్రాంగం చేతుల్లోకి వెళ్లనుంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, రాజకీయ సమీకరణాలు కొత్త దశలోకి ప్రవేశించనున్నాయి. ఎంపీడీవోలు, తహసిల్దార్లు, డిప్యూటీ ఎంపీడీవోలు, మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలను స్వీకరించనున్నారు. గ్రామ పంచయతీలలో 16.53 కోట్ల రూపాయల నిధులు ఇంకా వ్యయం కాలేదు. ఈ నిధులతో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు.
 
చిత్తూరు జిల్లాలో మొత్తం 621 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 608 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ పంచాయతీలలో ఎన్నికైన సర్పంచులు గత ఐదేళ్లలో గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల అమలు వంటి బాధ్యతలను నిర్వహించారు. రహదారులు, తాగునీటి పథకాలు, పారిశుధ్యం, వీధిదీపాలు, చెత్త నిర్వహణ వంటి రంగాల్లో కొంతమేర అభివృద్ధి కనిపించినప్పటికీ, నిధుల కొరత, అధికార పరిమితులు, శాఖల మధ్య సమన్వయం లోపం వంటి సమస్యలు కూడా ఎదురైనట్లు పలువురు సర్పంచులు పేర్కొంటున్నారు. అయితే జిల్లాలోని 13 గ్రామ పంచాయతీలకు వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. కోర్టు కేసులు, స్థానిక వివాదాలు, పరిపాలనా కారణాల వల్ల ఈ పంచాయతీలు ఎన్నికల ప్రక్రియకు దూరమయ్యాయి. ఎన్నికలు జరగని పంచాయతీలలో రొంపిచర్ల మండలంలోని బొమ్మయ్యగారిపల్లి, చల్లవారిపల్లి, నగరి మండలంలోని డి. అగరం, నంబాకం, పెనుమూరు మండలంలోని కలికిరి, మొరవకండ్రిగ, పెనుమూరు నగరి మండలంలోని కృష్ణరామాపురం, కుప్పం మండలంలోని మల్లనూరు, మోట్లచేను, టీ.సదుమూరు, రామకుప్పం మండలంలోని నైనాల తండా, పులిచెర్ల మండలంలోని ఎల్లంకివారిపల్లి పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలలో ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అభివృద్ధి పనులు కూడా ఇక్కడ గణనీయంగా వెనుకబడి ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్పంచుల పదవీకాలం ముగియడంతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల నియామకానికి చర్యలు పూర్తయ్యాయి. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ ఎంపీడీవోలు, మండల అడ్మినిస్ట్రేటివ్ అధికారులు తదితరులను ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు జిల్లా పంచాయతీ అధికారి ప్రతిపాదనలు సిద్ధం చేసి, జిల్లా కలెక్టర్ ఆమోదం పొందారు. గురువారం లేక శుక్రవారం నుంచి ఈ అధికారులు పంచాయతీ పరిపాలన బాధ్యతలను స్వీకరించనున్నారు. దీంతో ఎన్నికలు జరిగే వరకు గ్రామ పాలన పూర్తిగా అధికారుల ఆధీనంలోనే కొనసాగనుంది. ఇదిలా ఉండగా, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రారంభమైన అనేక పనులు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అధికారుల మార్పులు, బాధ్యతల బదిలీ వంటి అంశాల కారణంగా పనుల అమలులో ఆలస్యం జరగవచ్చని భావిస్తున్నారు. కొత్త ఎన్నికలు జరిగే వరకు కొత్త పనులు ప్రారంభం కాకపోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. పంచాయతీలలో నిధుల వినియోగం కూడా ప్రస్తుతం కీలక సమస్యగా మారింది. వివిధ పథకాల కింద విడుదలైన రూ.15.63 కోట్ల నిధులు ఇప్పటికీ ఖర్చు కాకుండా నిల్వలోనే ఉన్నాయి. సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం నిధుల వినియోగంపై ఆంక్షలు విధించడంతో ఈ నిధులు ములుగుతున్నాయి. ఇకపై ప్రత్యేక అధికారులు గ్రామ అవసరాలను గుర్తించి ఈ నిధులను వినియోగించే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సరైన ప్రణాళికతో ఈ నిధులను వినియోగిస్తే గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడే అవకాశముంది.

జిల్లాలో ఆర్థిక అక్రమాల అంశం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిధుల దుర్వినియోగం, పోలీసు కేసులు వంటి కారణాలతో 6 మంది సర్పంచుల చెక్ పవర్‌ను జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. కొందరు కోర్టును ఆశ్రయించి తిరిగి చెక్ పవర్ పొందినప్పటికీ, మరికొన్ని పంచాయతీలలో భారీ స్థాయిలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పులిచెర్ల మండలం రాయవారిపల్లిలో 8 లక్షల రూపాయలు, దిగువ పోకలవారిపల్లి పంచాయతీలో 4 లక్షల రూపాయల నిధుల అక్రమ వినియోగం వెలుగుచూడడంతో రికవరీ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మరోవైపు, కొన్ని పంచాయతీలు తమ పనితీరుతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం. గత సంవత్సరం ఐరాల మండలం బొమ్మాయిపల్లి పంచాయతీ జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపికై అవార్డు అందుకుంది. ఈ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం రూ.1 కోటి నిధులు మంజూరు చేసింది. అలాగే ఈ సంవత్సరం కుప్పం క్లస్టర్‌కు నానాజీ దేశముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ అవార్డు లభించి రూ.1.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇక సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. కొత్త ఎన్నికలపై చర్చలు ఊపందుకుంటున్నాయి. యువత, మహిళలు ముందుకు రావడానికి ఆసక్తి చూపుతుండగా, పాత నాయకులు మళ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. సామాజిక వర్గాల సమీకరణాలు, పార్టీ అనుబంధాలు రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశముంది. గ్రామ ప్రజలు మాత్రం కొత్త నాయకత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మౌలిక వసతుల మెరుగుదల, పారదర్శక పాలన, అభివృద్ధి పనుల వేగవంతం వంటి అంశాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు. నేటితో సర్పంచుల పదవీకాలం ముగియనుండగా, ప్రత్యేక అధికారుల పాలన ఎలా కొనసాగుతుందో, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో అన్నదే ఇప్పుడు గ్రామాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఈ మార్పులు రాబోయే రోజుల్లో గ్రామ రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *