అంతా బ్రాంతి ఏనా? ఈ రాజకీయం ఇంతేనా?
ఆశావహుల అంచనాలు తలక్రిందులు
మహిళా నాయకుల్లో తీవ్ర నిరాశ,
సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఊరట
పార్లమెంటులో బిల్లులు వీగిపోవడంతో...
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గత కొంతకాలంగా కనిపించిన ఉత్సాహం ఒక్కసారిగా చల్లారిపోయింది. నెలల తరబడి ఆశలతో ముందుకెళ్లిన రాజకీయ ఆశావహులు, ముఖ్యంగా మహిళా నాయకులు ఇప్పుడు తీవ్ర నిరాశలోకి జారుకున్నారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు ఆమోదం పొందకపోవడం జిల్లాలో రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది.
జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందా? మహిళలకు రిజర్వేషన్ వస్తుందా? ఈ రెండు అంశాల చుట్టూనే గత ఆరు నెలలుగా జిల్లాలో ఒకే చర్చ నడిచింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా మరో మూడు నియోజకవర్గాలు వస్తాయని బలమైన అంచనాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పుత్తూరు, పాకాల, బంగారుపాల్యం పేర్లు కొత్త నియోజకవర్గాలుగా ఖరారు అవుతాయని రాజకీయ వర్గాలు భావించాయి. ఈ అంచనాలే ఆశావహుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నియోజకవర్గాలు పెరిగితే కొత్త అవకాశాలు వస్తాయని భావించిన అనేక మంది నాయకులు తమ తమ ప్రాంతాల్లో చురుకుగా వ్యవహరించడం ప్రారంభించారు. ముఖ్యంగా మహిళా నాయకులు రాజకీయంగా ముందుకు వచ్చి తమ స్థానాన్ని బలపరచుకునే ప్రయత్నాలు చేశారు. బంధుమిత్రులను కలుసుకోవడం, గ్రామాల వారీగా పర్యటనలు చేయడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఇలా ఒక్కో అడుగు ముందుకు వేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తే కొన్ని నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ చేస్తారని భావించారు. దీంతో చాలా మంది మహిళా నాయకులు ఈసారి అవకాశం మనదే అన్న నమ్మకంతో రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. కొందరు తమ పోటీకి అనుకూలంగా సమీకరణాలు కూడా సిద్ధం చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయంగా పట్టు సాధించేందుకు కృషి చేశారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే చిత్తూరు పార్లమెంటు పరిధి కూడా మారుతుందని అంచనాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ పరిమితులు తగ్గి, కొత్త పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని చర్చ జరిగింది. రిజర్వేషన్ వ్యవస్థలో కూడా మార్పులు వస్తాయని—కొన్ని నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వేషన్ నుంచి బయటకు వచ్చి, మరికొన్ని మహిళలకు కేటాయించే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపించాయి. ఈ సమీకరణాలన్నీ కలిపి జిల్లాలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోతుందని అందరూ భావించారు. పాత రాజకీయ సమీకరణాలు చెదిరిపోతాయని, కొత్త నాయకత్వానికి అవకాశం దక్కుతుందని ఆశించారు. ముఖ్యంగా పుత్తూరు నియోజకవర్గం పునరుద్ధరణ, పాకాల, బంగారుపాల్యం కొత్తగా రూపుదిద్దుకోవడం జిల్లాలో పెద్ద మార్పుకు నాంది అవుతుందని అంచనాలు వినిపించాయి.
కానీ పార్లమెంట్‌లో బిల్లులు ఆమోదం పొందకపోవడంతో ఈ అంచనాలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఆశావహులు వేసుకున్న లెక్కలు అన్నీ తలక్రిందులయ్యాయి. మరో ఐదు సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అన్న ప్రశ్న చాలా మందిలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మహిళా నాయకుల్లో కనిపిస్తున్న నిరాశ గమనించదగ్గది. ఇప్పటివరకు చేసిన కష్టానికి ఫలితం దక్కుతుందనుకున్నాం… కానీ మళ్లీ అదే స్థితికి వచ్చేశాం అని ఒక మహిళా నాయకురాలు భావోద్వేగంతో చెప్పారు. మరో నాయకురాలు, మాకు అవకాశం వస్తుందని కుటుంబం కూడా నమ్మింది… ఇప్పుడు వారికే సమాధానం చెప్పలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అయితే పూర్తిగా నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. గతంలో ఉత్సాహంగా ప్రజల్లో తిరిగిన వారు ఇప్పుడు కొంత వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఓర్పే ప్రధానమని, భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. కొత్త నియోజకవర్గాలు లేకపోవడం, రిజర్వేషన్ మార్పులు జరగకపోవడంతో తమ స్థానాలకు పెద్దగా ప్రమాదం లేదని భావిస్తున్నారు. ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో బలాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంకోసారి కూడా పోటీ చేయడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న భావన వారిలో కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాలను తాత్కాలికంగా చూస్తున్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, మహిళా రిజర్వేషన్ వంటి అంశాలు ఒక్కసారిగా ఆగిపోవు… ఇవి సమయం తీసుకుంటాయని వారు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఏర్పడిన నిరాశను మాత్రం వారు అంగీకరిస్తున్నారు. మొత్తానికి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఊహించిన పెద్ద మార్పు ఈసారి వాయిదా పడింది. పుత్తూరు, పాకాల, బంగారుపాల్యం పేర్లు కేవలం చర్చలకే పరిమితమయ్యాయి. కొత్త నియోజకవర్గాల కలలు తాత్కాలికంగా ఆగిపోయాయి. మహిళా నాయకుల ఆశలు నిలిచిపోయాయి. అయినా… ఆశలు పూర్తిగా చనిపోలేదు. మళ్లీ ఒక రోజు అవకాశం వస్తుందనే నమ్మకం ఇంకా మిగిలే ఉంది.

