టిడిపి రాష్ట్ర కమిటీలో జిల్లాకు సమచితస్థానం
జిల్లాలో ఏడుగురికి కీలక పదవులు,
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటించడంతో చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రకటించిన ఈ కమిటీలో చిత్తూరు జిల్లాకు సముచిత ప్రాధాన్యం లభించింది. జిల్లా నుండి మొత్తం ఏడుగురికి రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయి. గత మే నెలలో జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడును జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత జాతీయ, రాష్ట్ర కమిటీలపై ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు బుధవారం తెరదించుతూ పార్టీ కమిటీలను అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో చిత్తూరు జిల్లాలో టిడిపి శక్తి మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అత్యున్నత నిర్ణయాక మండలి పోలిట్ బ్యూరోలు సభ్యులుగా నియమితులయ్యారు. ఈ పదవి చాలా ప్రతిష్టాత్మకమైనది, అత్యున్నతమైనది. ఈ కమిటీలో ముఖ్యంగా పలమనేరు ఎమ్మెల్యే నూతన కాలువ అమర్నాథ్ రెడ్డికు తిరిగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2020 నుంచి ఈ బాధ్యతను నిర్వహిస్తున్న ఆయనకు మరోసారి అదే హోదా ఇవ్వడం పార్టీ ఆయనపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనంగా భావిస్తున్నారు. మంత్రి పదవి ఆశించిన అమర్నాథ్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం ద్వారా కీలక పాత్రను కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
జీడీ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన భీమినేని చిట్టిబాబు నాయుడు మరోసారి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కొనసాగనున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేసిన అనుభవంతో ఆయన పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహిస్తారని నాయకత్వం విశ్వసిస్తోంది. అదే విధంగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కూడా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించడం ద్వారా రాయలసీమలో పార్టీ పట్టు మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. కందుకూరు ప్రాంతానికి చెందిన ఆయన, ప్రస్తుతం కుప్పంలో పార్టీ వ్యవహారాలు చూస్తూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మహిళా నాయకత్వానికి కూడా ఈసారి ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ, తెలుగు మహిళ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షురాలు కె. అరుణతో పాటు లక్ష్మీ ప్రసన్న, ఆర్. మీరా నేతాజీ (నగరి)లను రాష్ట్ర కార్యదర్శులుగా నియమించింది. ఉద్యమాలలో చురుగ్గా పాల్గొని, గతంలో నిరసన కార్యక్రమాల్లో కేసులు ఎదుర్కొన్న ఈ మహిళా నాయకులకు పదవులు ఇవ్వడం ద్వారా పార్టీ వారి కృషిని గుర్తించినట్లు భావిస్తున్నారు.
అయితే ఈ నియామకాల్లో కొందరు సీనియర్ నాయకులకు అవకాశం దక్కకపోవడం గమనార్హం. రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొరబాబు, అధికార ప్రతినిధులు డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి, డాక్టర్ సప్తగిరి ప్రసాద్, వి. సురేంద్ర కుమార్, గౌనివాని శ్రీనివాస్ వంటి నేతలకు ఈసారి అవకాశం లభించలేదు. ఇది పార్టీ లోపలి సమీకరణాలపై చర్చకు దారి తీసింది. ఇక ఈ రాష్ట్ర కమిటీ రూపకల్పనలో నారా లోకేష్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, క్షేత్రస్థాయి నాయకులను ముందుకు తీసుకురావడం వంటి అంశాల్లో లోకేష్ మార్క్ కనిపిస్తోందని చెబుతున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టిడిపి అనూహ్య విజయాన్ని సాధించింది. పార్లమెంట్ సీటుతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా జిల్లాలో పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది.
ఈ విజయాన్ని మరింత బలోపేతం చేసుకోవడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలను పూర్తిగా కైవసం చేసుకోవడం లక్ష్యంగా పార్టీ ఈ రాష్ట్ర కమిటీని రూపొందించినట్లు తెలుస్తోంది. జిల్లాలో బలమైన నాయకత్వాన్ని గుర్తించి, వారికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని టిడిపి యోచిస్తోంది. పార్టీ నిర్మాణంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్యనిర్వాహక కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు కీలక పాత్ర పోషిస్తారు. నియోజకవర్గాల పర్యవేక్షణ, కార్యకర్తల సంక్షేమం, ప్రజా సమస్యలపై పోరాటాలు, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం వంటి అంశాల్లో వీరి బాధ్యతలు కీలకం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు ఈ నాయకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీ, ఈ జిల్లాను వ్యూహాత్మకంగా కీలకంగా భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో, ఇక్కడ పార్టీ బలంగా నిలబడటం రాజకీయంగా అత్యంత ముఖ్యంగా మారింది. మొత్తంగా చూస్తే, టిడిపి రాష్ట్ర కమిటీ రూపకల్పన ద్వారా పార్టీ భవిష్యత్ వ్యూహం స్పష్టమవుతోంది. అనుభవజ్ఞులైన నాయకత్వంతో పాటు యువ నాయకులను కలిపి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ కమిటీలో కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాకు లభించిన ప్రాధాన్యం, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి బలమైన పునాది వేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

