2, ఏప్రిల్ 2026, గురువారం

లక్ష్యసాధనలో విఫలమైన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్

రైతులకు పంట రుణాల విషయంలో తీవ్ర నిరాశ!

సహకార బ్యాంకులో రుణం కోసం సుదీర్ఘ ప్రక్రియ

అరగంటలోనే రుణాలు ఇస్తున్న కమర్షియల్ బ్యాంకులు 

సుదీర్ఘ ప్రక్రియలు,  అదనపు ఖర్చులు, సహకార బ్యాంక్‌పై రైతుల్లో భయం 

సరళీకరణ లేకుంటే రైతులకు దూరంగా సహకార బ్యాంకులు 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

రైతుల కోసం, రైతుల చేత ఏర్పాటు అయిన చిత్తూరు జిల్లాలో సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) ఈ ఆర్థిక సంవత్సరంలో తన లక్ష్యాలను సాధించడంలో చతికిలబడింది. రుణాల మంజూరులో బ్యాంకు విఫలం కావడంతో రైతులకు ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో 40 బ్యాంకులు, 76 ప్రాథమిక సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. అన్ని కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని రైతులకు వివిధ రంగాల కింద రూ.1121 కోట్ల రుణాలు అందజేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటికీ, ఇప్పటివరకు కేవలం రూ.634 కోట్ల రుణాలు మాత్రమే అందజేసింది. అంటే మొత్తం లక్ష్యంలో 56 శాతం మాత్రమే సాధించగలిగింది. ఈ పరిస్థితి సహకార బ్యాంకుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా రైతులకు తక్షణ అవసరమైన సమయంలో రుణాలు అందకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో కమర్షియల్ బ్యాంకులు వేగవంతమైన సేవలు అందించడంతో రైతులు వాటి వైపు మగ్గుచూపుతున్నారు. సహకార బ్యాంకులలో సుదీర్ఘమైన రుణ ప్రక్రియ కారణంగా రైతులు సహకార బ్యాంకులకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.

రంగాల వారీగా పరిశీలిస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఖరీఫ్, రబీ పంటల రుణాల కింద రూ.786 కోట్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఇప్పటివరకు రూ.545 కోట్ల వరకు మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. ఇది 69 శాతానికి పరిమితమైంది. దీర్ఘకాలిక రుణాల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రూ.75 కోట్ల లక్ష్యంతో ముందుకు సాగిన బ్యాంక్ ఇప్పటివరకు కేవలం రూ.5 కోట్లను మాత్రమే విడుదల చేయగలిగింది. అంటే 7 శాతం మాత్రమే సాధించింది. స్వయం సహాయక సంఘాలకు రూ.250 కోట్ల లక్ష్యంతో ముందుకు వెళ్లగా ఇప్పటివరకు రూ.83 కోట్ల వరకు మాత్రమే అందజేసింది. ఇది 33 శాతం మాత్రమే. జాయింట్ లైబిలిటీ గ్రూపులకు రూ.10 కోట్ల లక్ష్యంలో కేవలం రూ.23 లక్షల రుణాలు మాత్రమే ఇవ్వగలిగింది. ఇది 2 శాతం మాత్రమే. ఈ గణాంకాలు చూస్తే ఏ ఒక్క రంగంలోనూ సహకార బ్యాంక్ ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచలేదని స్పష్టమవుతోంది. రైతులు సహకార బ్యాంకుల ద్వారా రుణాలు పొందడానికి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సుదీర్ఘమైన విధానమే. ఒక రైతు రుణం పొందాలంటే అనుసరించాల్సిన ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండటం వల్ల వారు ముందుకు రావడానికి వెనుకంజ వేస్తున్నారు. సాధారణంగా ఒక రైతు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మొదటగా తన భూమికి సంబంధించిన గత 10 సంవత్సరాల ఈసీ (ఎంకంబ్రెన్స్ సర్టిఫికేట్) తీసుకురావాల్సి ఉంటుంది. జిల్లాలో కార్యాలయాల విభజన తర్వాత ఒకే రైతు రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుండి ఈసీలు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సమయం తీసుకునే ప్రక్రియగా మారింది. దీనితో పాటు పట్టాదారు పాస్‌బుక్, 1-బి, అడంగల్ వంటి పత్రాలను సమర్పించాలి. ఇతర బ్యాంకులలో రుణాలు పొందలేదని ధృవీకరణ ఇవ్వాలి. గతంలో ఎక్కడైనా రుణాలు తీసుకున్నట్లయితే వాటిని పూర్తిగా క్లియర్ చేసి రికార్డులను సరిచేయాలి. పూర్వీకుల కాలంలో భూమిపై ఎలాంటి బకాయిలు ఉన్నా వాటిని కూడా తొలగించాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ప్రాథమిక సహకార సంఘాల చుట్టూ తిరిగి అవసరమైన ధృవీకరణలు పొందాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు వచ్చి రైతుకు ఎలాంటి బాకీలు లేవని నిర్ధారించాలి. అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమిని తాకట్టు పెట్టే ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతోంది. ఒక పంట సీజన్‌లో రైతుకు అత్యవసరంగా డబ్బు అవసరమైన సమయంలో ఇంతకాలం వేచి ఉండడం చాలా కష్టంగా మారుతోంది.

ఈ సుదీర్ఘ ప్రక్రియతో పాటు ఖర్చుల భారం కూడా రైతులపై పడుతోంది. ఈసీలు తీసుకోవడం, పాత రుణాల క్లియరెన్స్, పత్రాల సిద్ధం వంటి అంశాల కోసం సుమారు రూ.10 వేల వరకు ఖర్చు అవుతోంది. దీనికి తోడు బ్యాంక్‌కు రుణం మొత్తంలో 10 శాతం వాటా ధనం కింద చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక రైతు రూ.1 లక్ష రుణం తీసుకుంటే రూ.10 వేల వరకు ఖర్చు అవుతుంది. మరో రూ.10 వేలును వాటా ధనం కింద బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రైతు చేతికి కేవలం రూ.90 వేలే వస్తాయి. ఈ పరిస్థితి రైతులకు భారంగా మారుతోంది. ఇదే సమయంలో కమర్షియల్ బ్యాంకుల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రైతు పట్టాదారు పాస్‌బుక్, అడంగల్ వంటి ప్రాథమిక పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది. చాలా సందర్భాల్లో అరగంటలోనే రుణం మంజూరు అవుతోంది. ఖర్చు కూడా రూ.50 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సౌలభ్యం కారణంగా రైతులు సహకార బ్యాంకుల కంటే కమర్షియల్ బ్యాంకులనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. దీని ఫలితంగా సహకార బ్యాంకుల రుణాల పంపిణీ తగ్గిపోతూ, లక్ష్యాలు చేరుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు రాజకీయ ప్రభావం కూడా సహకార బ్యాంకుల పనితీరుపై ప్రభావం చూపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభావశీలులైన వ్యక్తులకు, రాజకీయ నాయకులకు మాత్రం వేగంగా పెద్ద మొత్తాల్లో రుణాలు మంజూరు అవుతున్నాయి. అయితే సాధారణ రైతులు మాత్రం విధి విధానాల పేరుతో నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. ఈ అసమానత రైతుల్లో అసంతృప్తిని పెంచుతోంది. సహకార బ్యాంకులపై నమ్మకం తగ్గిపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో సహకార బ్యాంకులు తమ పాత విధానాలను కొనసాగిస్తే భవిష్యత్తులో మరింత వెనుకబడే ప్రమాదం ఉంది. రుణ ప్రక్రియను సరళీకరించడం, అవసరంలేని పత్రాలను తగ్గించడం, వేగవంతమైన సేవలు అందించడం వంటి చర్యలు తక్షణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు సులభంగా, తక్కువ సమయంలో రుణాలు అందించే విధంగా వ్యవస్థను మార్చకపోతే సహకార బ్యాంకులు క్రమంగా ప్రాధాన్యత కోల్పోయే అవకాశముంది. రైతుల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే పారదర్శకతతో పాటు సమర్థవంతమైన సేవలు అందించడం అత్యవసరం. లేకపోతే ఈ బ్యాంకులు కేవలం కొంతమంది ప్రభావశీలులకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *