14, ఏప్రిల్ 2026, మంగళవారం

చిత్తూరు జిల్లా రహదారులకు మహర్దశ

రూ. 15 కోట్లతో 19 రహదారుల పునరుద్ధరణ 

జిల్లా రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రణాళిక 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు జిల్లాలో రూ. 15 కోట్లతో 19 రహదారుల పునర్ నిర్మాణం చేయనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పాడైన రహదారులను మరమ్మతు చేసి పునరుద్ధరించనున్నారు. మొత్తం 65 కిలోమీటర్ల పొడవైన రహదారుల మరమ్మతులకు రాష్ట్ర రహదారులు భవనాల శాఖ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు టెండర్లను పిలిచి రాష్ట్ర రహదారులను బాగుచేయనున్నారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఈ పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా గంగాధర నెల్లూరు, కుప్పం, నగరి, పలమనేరు, పూతలపట్టు ప్రాంతాల్లో రహదారుల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇచ్చారు.

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రాచపాలెం నుంచి వనదుర్గాపురం వరకు బాలిగకండిగ్రిగ రహదారిని కలుపుతూ 3.150 కిలోమీటర్ల రహదారిని రూ.2.40 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. అలాగే చిత్తూరు నుండి పెనుమూరు మీదుగా  నేండ్రగుంట వయా అదిరిపల్లి మార్గంగా 1.9 కిలోమీటర్ల మేర రూ.25 లక్షలతో పునరుద్ధరిస్తారు. చంద్రగిరి నుంచి వెదురుకుప్పం వరకు దోర్నకంబాల మార్గంగా 2.2 కిలోమీటర్ల రహదారిని రూ.40 లక్షలతో మెరుగుపరుస్తారు. చిత్తూరు నుండి పుత్తూరు రహదారిని నరిసింగపురం, బలగంగనపల్లి మార్గంగా 6.4 కిలోమీటర్ల మేర రూ.70 లక్షలతో అభివృద్ధి చేస్తారు.

కుప్పం నియోజకవర్గంలో కుప్పం నుంచి నాయనూరు వరకు పెద్దవంక మార్గంగా తమిళనాడు సరిహద్దు వరకు 1.25 కిలోమీటర్ల రహదారిని రూ.45 లక్షలతో నిర్మిస్తారు. గడ్డురు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఎస్.గొల్లపల్లి, కొనేరూ కుప్పం మార్గంగా 1.40 కిలోమీటర్ల రహదారిని రూ.35 లక్షలతో అభివృద్ధి చేస్తారు. కుప్పం నుండి మల్లనూరు సరిహద్దు రహదారిని గరికచెనుపల్లి మార్గంగా 2.60 కిలోమీటర్ల మేర రూ.40 లక్షలతో పునరుద్ధరిస్తారు.

నగరి నియోజకవర్గంలో ఏ ఆర్ రహదారి నుంచి సత్రవాడ వరకు గండ్రాజుకుప్పం మార్గంగా 7.0 కిలోమీటర్ల రహదారిని రూ.30 లక్షలతో అభివృద్ధి చేయనున్నారు. అలాగే పెన్నలూరుపేట నుంచి వెంగలతూర్ వరకు 3.465 కిలోమీటర్ల రహదారిని రూ.60 లక్షలతో పునరుద్ధరిస్తారు.

పలమనేరు నియోజకవర్గంలో రామకుప్పం నుంచి వి.కోట, పెర్నంబట్టు వరకు బండ్రలపల్లి, పముగనిపల్లి మార్గంగా మొత్తం 8.845 కిలోమీటర్ల రహదారిని రూ.3.25 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. అలాగే ఏంబిటి రహదారి నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు బట్టమద్దడి మార్గంగా 0.8 కిలోమీటర్ల రహదారిని రూ.20 లక్షలతో, వి.కోట నుంచి కర్ణాటక సరిహద్దు వరకు అత్రపల్లి, కొంగటం మార్గంగా 4.7 కిలోమీటర్ల రహదారిని రూ.20 లక్షలతో పునరుద్ధరిస్తారు.

పూతలపట్టు నియోజకవర్గంలో చిత్తూరు ఆరగొండ నుంచి మైనగుండ్లపల్లి వరకు 0.900 కిలోమీటర్ల రహదారిని రూ.30 లక్షలతో అభివృద్ధి చేస్తారు. చిత్తూరు ఐరాల నుంచి కారకాయపల్లి వరకు కాణిపాకం మార్గంగా 3.0 కిలోమీటర్ల రహదారిని రూ.50 లక్షలతో పునరుద్ధరిస్తారు. వుయ్యాలచింత కీనాటంపల్లి రహదారిని 5.0 కిలోమీటర్ల మేర రూ.40 లక్షలతో మెరుగుపరుస్తారు.

అదేవిధంగా జిల్లాలోని ప్రధాన రాష్ట్ర రహదారులపై కూడా పనులు చేపడుతున్నారు. చిత్తూరు పుత్తూరు రాష్ట్ర రహదారిపై 4.2 కిలోమీటర్లకు రూ.3 కోట్లు, మరో విడతలో 1.6 కిలోమీటర్లకు రూ.30 లక్షలు కేటాయించారు. పుంగనూరు కోలార్ రహదారిపై 3.8 కిలోమీటర్లకు రూ.50 లక్షలు, పుంగనూరు పులిచర్ల చిన్నగొట్టుగల్లు రహదారిపై 2.4 కిలోమీటర్లకు రూ.50 లక్షలు మంజూరు చేశారు. మొత్తంగా జిల్లాలో కీలక గ్రామీణ, రాష్ట్ర రహదారులను ట్రాఫిక్‌కు అనుకూలంగా  ఈ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనులు పూర్తి అయితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *