28, ఏప్రిల్ 2026, మంగళవారం

అగ్నిమాపక శాఖలో ఫైర్ మెన్ల కొరత


అరాకోర సిబ్బందితో నడుపుతున్న అగ్నిమాపక కేంద్రాలు

అదనపు అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటును పట్టించుకోని ప్రభుత్వం 

గ్రామాలకు చేరుకునే లోపే బుగ్గిపాలవుతున్న ఆస్తులు 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

అగ్ని ప్రమాదం సంభవించిన క్షణంలో ప్రాణాలకు తెగించి పోరాడే అగ్నిమాపక సిబ్బంది సేవలు అమూల్యమైనవి. అయితే, అలాంటి అత్యవసర సేవలు అందించే అగ్నిమాపక శాఖే ఇప్పుడు తీవ్రమైన సిబ్బంది కొరతతో నడుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాలు, ఆస్తులను కాపాడాల్సిన కీలక శాఖలో ఖాళీలు పెరిగిపోవడం వల్ల జిల్లాలో భద్రతపై ప్రశ్నార్థక పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో అదనంగా అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాలలో అగ్నిమాపక యంత్రం వెళ్లేసరికి ప్రజల ఆస్తులు భోగి పాలు అవుతున్నాయి. సుదూర ప్రాంతాలకు అగ్నిమాపక సిబ్బంది వెళ్లేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సిబ్బంది కొరత కారణంగా అగ్నిప్రమాదంలో గురించి ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన విభాగం ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అగ్నిమాపక శాఖ సరైన తనిఖీలు లేకపోవడంతో ఒక్కొక్కసారి ప్రమాదం జరిగినప్పుడు భారీగా నష్టం జరుగుతుంది.

జిల్లాలో చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి వంటి ప్రధాన పట్టణాల్లో మాత్రమే అగ్నిమాపక కేంద్రాలు పనిచేస్తున్నాయి. చిత్తూరులో రెండు ఫైర్ ఇంజిన్లు ఉన్నప్పటికీ, మిగతా ప్రాంతాల్లో ఒక్కొక్క యంత్రంతోనే సేవలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ యంత్రాలను నిర్వహించడానికి అవసరమైన సిబ్బంది సంఖ్య సరిపోకపోవడం పెద్ద సమస్యగా మారింది. మొత్తం 46 మంది ఫైర్‌మ్యాన్‌లు ఉండాల్సిన చోట కేవలం 12 మంది మాత్రమే విధుల్లో ఉండటం గమనార్హం. మిగిలిన 34 పోస్టులు ఖాళీగా ఉండగా, ఈ లోటును పూడ్చేందుకు 20 మంది హోంగార్డులతో నిర్వహణ కొనసాగుతోంది. అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత ఎంత తీవ్రమో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు చూస్తే స్పష్టమవుతోంది. గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో అగ్నిమాపక కేంద్రాలే లేకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు యంత్రాలు చేరుకునేలోపు పెద్ద నష్టం జరిగిపోతోంది. వీ. కోట, పూతలపట్టు మండలాల్లో కేంద్రాల ఏర్పాటు కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినా అవి అమలుకు నోచుకోకపోవడం ఆశ్చర్యకరం. అగ్నిమాపక శాఖ ద్వారా ప్రభుత్వానికి ప్రత్యక్ష ఆదాయం రాకపోవడం వల్లే ఈ శాఖపై నిర్లక్ష్యం పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం జిల్లాలో సగటున 250 నుంచి 300 వరకు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత సంవత్సరం మాత్రమే 231 అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల వల్ల సుమారు రూ.2.18 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. అయితే, అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించడం వల్ల రూ.12.8 కోట్ల ఆస్తులను కాపాడగలిగారు. ఈ గణాంకాలే ఈ శాఖ ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

పట్టణ ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాలు వేగంగా చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో దూరం, రోడ్ల పరిస్థితులు, సిబ్బంది కొరత వంటి కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తొలి 10 నుంచి 15 నిమిషాలు అత్యంత కీలకం. కానీ ఈ సమయం దాటేసరికి అగ్నికి ఆహుతైన ఆస్తి బూడిదగా మారిపోతుంది. దీంతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. అగ్నిమాపక శాఖ బాధ్యతలు కేవలం మంటలను ఆర్పడమే కాదు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం కూడా కీలకం. పాఠశాలలు, ఆస్పత్రులు, హోటళ్లు, పరిశ్రమలు వంటి ప్రాంతాల్లో తరచూ తనిఖీలు నిర్వహించి భద్రతా చర్యలు సూచించాల్సి ఉంటుంది. అవసరమైతే నిబంధనలు పాటించని సంస్థల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేసే అధికారమూ ఉంది. కానీ సిబ్బంది కొరత కారణంగా ఈ తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అవగాహన కార్యక్రమాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. సాధారణంగా అగ్నిమాపక వారోత్సవాల సమయంలో మాత్రమే మాక్ డ్రిల్స్, అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. మిగతా సమయంలో ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు లేకపోవడం వల్ల ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలో చాలామందికి తెలియదు. ఇది నష్టాలను మరింత పెంచుతోంది.

వేసవికాలం వచ్చేసరికి పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో అగ్ని ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ సమయంలో అగ్నిమాపక సిబ్బందికి విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. కానీ ఉన్న సిబ్బంది పరిమితమే కావడంతో, ఒకేసారి రెండు మూడు చోట్ల ప్రమాదాలు జరిగితే సమర్థవంతంగా స్పందించడం కష్టంగా మారుతోంది. అగ్నిమాపక కేంద్రాల మధ్య దూరాన్ని తగ్గించడం, కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడం అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో కనీసం ఒక కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయడం ద్వారా సేవలను బలోపేతం చేయాలి. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించే బాధ్యత ఉన్న అగ్నిమాపక శాఖను నిర్లక్ష్యం చేయడం తగదు. ప్రమాదం జరిగాక స్పందించడం కంటే ముందుగానే సిద్ధంగా ఉండడం ముఖ్యమని అధికారులు గుర్తించాలి. జిల్లాలో పెరుగుతున్న అగ్ని ప్రమాదాల దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకుని సిబ్బంది నియామకాలు, కొత్త కేంద్రాల ఏర్పాటు చేపట్టకపోతే భవిష్యత్తులో మరింత భారీ నష్టాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *