గ్రామీణ ప్రాంతాల్లో వేళాపాలలేని విద్యుత్ కోతలు
ఉక్కపోతలో అల్లాడిపోతున్న గ్రామీణ ప్రజలు
నరకం చూస్తున్న పిల్లలు, వృద్దులు, వ్యాధిగ్రస్తులు
గంటల తరబడి కొనసాగుతున్న విద్యుత్ కోతలు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ, చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని మరింత పెంచుకుంటూ పోతుండగా, అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజల జీవితాన్ని నరకయాతనగా మార్చేశాయి. గ్రామీణ ప్రాంతాలలో వేళాపాల లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఈ కోతలు 10 నిమిషాల నుంచి రెండు మూడు గంటలకు కూడా కొనసాగుతున్నాయి. పగలు, రేయి అన్న తేడా లేకుండా విద్యుత్ కోతలు కొనసాగుతుండడంతో ఉక్కపోత భరించలేక ప్రజలు విలవిలలాడిపోతున్నారు. జిల్లాలో పగటిపూట ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతుండగా, కొన్ని మండలాల్లో 45 డిగ్రీల దాకా చేరుతున్నాయి. రాత్రిపూట కూడా వేడి తగ్గకపోవడంతో కనీస ఉపశమనం లేక ప్రజలు రాత్రంతా నిద్రలేక తల్లడిల్లుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 30 డిగ్రీల కంటే దిగకపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
ఈ మండుటెండలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం ప్రజల కష్టాలను మరింత పెంచింది. గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. గంటకోసారి కరెంటు కోత విధించడం సాధారణంగా మారింది. ఒకసారి కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముందస్తు సమాచారం లేకుండా కోతలు విధించడం వల్ల ప్రజలు తీవ్ర అయోమయంలో పడుతున్నారు. ఫ్యాన్లు తిరగకపోవడం, గాలి రాకపోవడం వల్ల ఇళ్లు నిప్పుల కొలిమిలా మారి జీవించడం కూడా కష్టంగా మారుతోంది. చిన్నపిల్లలు వేడిని తట్టుకోలేక ఏడుస్తూ రాత్రంతా నిద్ర లేక అలసిపోతుంటే, వృద్ధులు ఉక్కపోతతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో కరెంటు కోతలు విధించడంతో గదుల్లో ఉండలేక బయటకు వచ్చి చెట్ల కింద, వీధుల్లో గాలికి ఆశ్రయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అర్థరాత్రి సమయంలో కూడా విద్యుత్ నిలిపివేయడం ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది. “ఈ వేడి కంటే కరెంటు కోతలే ఎక్కువ కష్టంగా ఉన్నాయి” అని గ్రామస్తులు వాపోతున్నారు. విద్యుత్ కోతల ప్రభావం వ్యవసాయంపై కూడా తీవ్రంగా పడుతోంది. రైతులు అనిశ్చిత విద్యుత్ సరఫరా కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియక రాత్రివేళల్లో పొలాలకు వెళ్లి మోటార్లు ఆన్ చేయాల్సి వస్తోంది. ఇది రైతుల ఆరోగ్యానికి, భద్రతకు ప్రమాదకరంగా మారింది. సరైన సమయానికి నీరు అందక పంటలు ఎండిపోవడం, మోటార్లు కాలిపోవడం వంటి సమస్యలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఎండల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ పరిస్థితి మరింత భారంగా మారింది.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం పరిస్థితిని మరింత విషమం చేస్తోంది. విద్యుత్ కోతలపై ఫిర్యాదు చేయడానికి సబ్‌స్టేషన్లకు లేదా అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడం ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది. పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడం, ఎత్తినా సరైన సమాధానం ఇవ్వకపోవడం సాధారణమైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మెయింటెనెన్స్ పేరుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు కోతలు విధిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మెయిన్ సప్లై కట్ అయిందని, లైన్ ట్రిప్ అయిందని చెబున్నారు. చలికాలంలో చేయాల్సిన మరమ్మత్తులను వేసవి మధ్యలో చేపట్టడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని విమర్శిస్తున్నారు.
పట్టణాల్లో విద్యుత్ సరఫరా కొంతవరకు సక్రమంగా కొనసాగుతుండగా, గ్రామాల్లో మాత్రం ఈ దారుణ పరిస్థితులు నెలకొనడం ప్రజల్లో అసంతృప్తిని రగిలిస్తోంది. పట్టణాలకు ఒక న్యాయం, పల్లెలకు మరో న్యాయమా? అని గ్రామీణులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాలపై వివక్ష చూపుతున్నారని, తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు విద్యుత్ కోతలు కలిసి ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఇక విద్యుత్ కోతల ప్రభావం చిన్న వ్యాపారాలపై కూడా పడుతోంది. వెల్డింగ్ షాపులు, కిరాణా దుకాణాలు, చిన్న పరిశ్రమలు తరచూ కరెంటు లేకపోవడంతో నష్టపోతున్నాయి. ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచే వస్తువులు పాడైపోతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఆధారంగా నడిచే చిన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది. ఇన్వర్టర్లు ఉన్న ఇళ్లలో కూడా సరైన ఛార్జింగ్ లేకపోవడంతో అవి పనికిరాకుండా పోతున్నాయి. జనరేటర్లు కొనుగోలు చేసే స్థోమత లేని సామాన్య ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ కోతలు కొనసాగితే పరిస్థితి మరింత విషమిస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామాల్లో ఆందోళనలు చెలరేగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సబ్‌స్టేషన్ల ముట్టడికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. విద్యుత్ కోతలపై ముందస్తు షెడ్యూల్ ప్రకటించాలని, నిరంతరాయ విద్యుత్ సరఫరా కల్పించాలని, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చిత్తూరు జిల్లాలో పల్లెల్లో నెలకొన్న ఈ చీకటి పరిస్థితి కేవలం విద్యుత్ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రజల ఆరోగ్యం, జీవన విధానం, వ్యవసాయం అన్నింటినీ ప్రభావితం చేస్తున్న తీవ్రమైన సమస్యగా మారింది. వేడికి తోడు చీకటి బాధలు అనుభవిస్తున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ సమస్య పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

