19, ఏప్రిల్ 2026, ఆదివారం

పరిపూర్ణ నాయకత్వానికి నిర్వచనం… నారా చంద్రబాబు

పరిపూర్ణ నాయకత్వానికి నిర్వచనం… 

చిత్తూరు ముద్దుబిడ్డ, అమరావతి రాజధాని నిర్మాణకర్త

దూరదృష్టి, అభివృద్ధి, సాంకేతికతతో రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన మహానాయకుడు

నేడే నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాలుగా ప్రభావం చూపుతూ, దేశ రాజకీయాల్లోనూ తన ముద్ర వేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో 1950 ఏప్రిల్ 20న జన్మించిన ఆయన, 75 వసంతాలను పూర్తి చేసుకుని సోమవారంతో 76వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. చిత్తూరు జిల్లాకు ముద్దుబిడ్డగా మాత్రమే కాకుండా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ఆయన, ఈ జిల్లాలో నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన తొలి నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఆయన తొమ్మిది సార్లు శాసనసభ్యుడిగా గెలిచి రికార్డు సృష్టించారు. అలాగే నాలుగవ పర్యాయం ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించారు. నైస్ ఫ్రెండ్ కన్వీనర్ గా పనిచేసిన సమయంలో అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తను రాష్ట్రపతగా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన జన్మదినం సందర్భంగా ఆయన రాజకీయ ప్రయాణం, నాయకత్వ లక్షణాలు, అభివృద్ధి దిశగా చేసిన కృషిని స్మరించుకోవడం సముచితం.

విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు కనబరిచిన చంద్రబాబు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆర్థిక శాస్త్రంలో పీజీ పూర్తి చేసి పరిశోధక విద్యార్థిగా ఉన్న సమయంలోనే యువ నాయకుడిగా ఎదిగారు. 1975లో యువజన కాంగ్రెస్‌లో బాధ్యతలు చేపట్టి, 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై తన రాజకీయ జీవితానికి బలమైన పునాది వేశారు. 1980లో మంత్రి పదవి చేపట్టి పరిపాలనా అనుభవాన్ని సంపాదించారు.1982లో నందమూరి తారక రామారావు కుటుంబంలోకి అల్లుడిగా చేరిన ఆయన, రాజకీయంగా మరింత ప్రభావం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఓటమి ఎదురైనా వెనక్కి తగ్గకుండా తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలను సంఘటితం చేశారు. 1989లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి నుంచి వరుస విజయాలతో ప్రజాదరణను కొనసాగిస్తున్నారు. 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా సంస్కరణలను ప్రారంభించారు. ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసి, హైదరాబాద్‌ను అంతర్జాతీయ సమాచార సాంకేతిక కేంద్రంగా నిలిపారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచింది. ఎలక్ట్రానిక్ పరిపాలన, డిజిటల్ సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవన విధానాన్ని మార్చేశాయి. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అమరావతిని రాజధానిగా రూపకల్పన చేసి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు నడిపించారు. పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను తీసుకురావడం, మౌలిక వసతులను అభివృద్ధి చేయడం వంటి చర్యలు రాష్ట్రానికి కొత్త దిశను చూపించాయి. 2019లో ఓటమి ఎదురైనా వెనుకడుగు వేయకుండా పార్టీని పునర్‌వ్యవస్థీకరించి, 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చి తన నాయకత్వాన్ని చాటుకున్నారు.

జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. జాతీయ సమాఖ్య కన్వీనర్‌గా వ్యవహరించి దేశ రాజకీయాల్లో సమన్వయకర్తగా నిలిచారు. భారత దేశ రాష్ట్రపతిగా డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం ఎంపికలో ఆయన పాత్ర ప్రాధాన్యం పొందింది. దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా ఆయనకు గుర్తింపు లభించింది. చంద్రబాబు నాయకత్వంలోని ప్రధాన లక్షణం దూరదృష్టి. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా ఆయన పేరుగాంచారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని పరిపాలనలో ప్రవేశపెట్టి ప్రజలకు చేరువ చేశారు. తక్షణ పరిపాలన వ్యవస్థలు, డిజిటల్ సేవల ద్వారా పరిపాలనలో పారదర్శకతను పెంచారు. పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయడంలో ఆయన వ్యూహాలు ప్రత్యేకంగా నిలిచాయి. వ్యక్తిత్వ పరంగా క్రమశిక్షణ, సమయపాలన, కష్టపడి పనిచేసే స్వభావం ఆయనను ఇతర నాయకుల నుంచి ప్రత్యేకంగా నిలబెడతాయి. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు కృషి చేయడం ఆయన నాయకత్వ శైలిలో ప్రధాన లక్షణం. సంభాషణ నైపుణ్యం, నిర్ణయ సామర్థ్యం, సేవాభావం, సహనం వంటి గుణాలు ఆయనను ప్రజానాయకుడిగా నిలబెట్టాయి. మొత్తంగా చూస్తే, నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం దూరదృష్టి, అభివృద్ధి, పట్టుదలల సమ్మేళనం. చిత్తూరు జిల్లాలో జన్మించిన ఈ మహానేత మరిన్ని సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజలు ఆశిస్తున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *