26, ఏప్రిల్ 2026, ఆదివారం

అయోమయంలో మామిడి రైతులు

మూడు దపాలుగా వచ్చిన మామిడి పంట 

గత సంవత్సరంతో పోల్చుకుంటే తగ్గనున్న దిగుబడి 

గత సంవత్సరం బకాయిలు చెల్లించని పల్ప్ ఫ్యాక్టరీలు 

ఈ సంవత్సరం మామిడి ధరపై అయోమయం 

బకాయిల చెల్లింపుపై బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశం


(ఆంధ్రప్రభ బ్యూరో , చిత్తూరు.)

చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఈ ఏడాది తీవ్ర అయోమయం, ఆందోళనను ఎదుర్కొంటున్నారు.  ఒకవైపు ధరలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి, మరోవైపు కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టత లేదు. దీంతో రైతులను ఆర్థికంగా కుదేలు చేసే పరిస్థితిని తీసుకొచ్చింది. దీనికి తోడు ఈసారి పంట స్వభావం కూడా అసాధారణంగా ఉండడంతో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దిగుబడి గణనయంగా తగ్గనుంది. నాలుగు లక్షల టన్నులు దిగుబడి రావచ్చని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం జూస్ ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేసిన రైతులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో బిల్లులు అందలేదు. చాలా ఫ్యాక్టరీలు 80 నుంచి 90 శాతం వరకు బిల్లులు చెల్లించాయి. జిల్లాలో రెండు ఫ్యాక్టరీలు మాత్రం ఇప్పటివరకు మామిడి రైతులకు రూపాయి కూడా ఇవ్వలేదు. మామిడి రైతులకు బిల్లుల విషయమై బుధవారం జిల్లా కలెక్టర్ జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు యుద్ధం కారణంగా జిల్లా నుండి మామిడి పళ్ళు పేగుమ్మతులు సక్రమంగా జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం తన భవిష్యత్తు ఎలా ఉంటుందోనని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఏడాది మామిడి పంట సాధారణ కాలంతో పోలిస్తే ఆలస్యంగా ప్రారంభమైంది. అంతేకాకుండా పంట ఒకేసారి కాకుండా మూడు దఫాలుగా రావడం రైతులకు పెద్ద సవాలుగా మారింది. ఒకే తోటలో, ఒకే చెట్టుపై మూడు రకాల పరిమాణాల్లో కాయలు కనిపిస్తున్నాయి. పెద్ద కాయలు పండిన సమయంలో చిన్న కాయలు ఇంకా ముదురకపోవడంతో ఒకేసారి కోత చేపట్టే వీలు లేకుండా పోయింది. దశలవారీగా కోత చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట పండిన కాయలను కోసిన తర్వాత రెండో దఫాలో వచ్చిన కాయలు పూర్తిగా పక్కవానికి రాకపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. చివరిదశలో వచ్చిన కాయలు ఎదగడానికి సమయం పట్టేలోపే, ముందుగా పండిన కాయలు చెట్ల నుంచి రాలిపోతున్నాయి. ఇలా పంటను పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ విచిత్ర పరిస్థితి కారణంగా దిగుబడిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 1,40,000 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా సుమారు 6 లక్షల టన్నుల మామిడి దిగుబడి నమోదైంది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఉద్యానవన శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది దిగుబడి సుమారు 4 లక్షల టన్నులకే పరిమితమయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు 2 లక్షల టన్నుల తగ్గుదల ఉండే అవకాశం ఉంది. దిగుబడి తగ్గుతుందని అంచనా ఉన్నప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈసారి మార్కెట్ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ముఖ్యంగా మామిడి గుజ్జు (పల్ప్) పరిశ్రమల పరిస్థితి రైతులకు ఆందోళన కలిగిస్తోంది. గత సంవత్సరం ఉత్పత్తి అయిన పల్ప్ చాలా వరకు ఫ్యాక్టరీల నుంచి ఖాళీ అయినప్పటికీ, అంతకుముందు సంవత్సరానికి చెందిన పల్ప్ నిల్వలు ఇంకా అనేక ఫ్యాక్టరీల్లో పేరుకుపోయి ఉన్నట్లు సమాచారం.

అంతర్జాతీయ పరిస్థితులు కూడా దీనిపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ పరిస్థితుల కారణంగా గత సంవత్సరం ఎగుమతులు సక్రమంగా జరగకపోవడంతో పల్ప్ నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఫలితంగా ఈ సంవత్సరం కొత్తగా వచ్చే మామిడికాయలను కొనుగోలు చేయడానికి పలు ఫ్యాక్టరీలు ముందుకు రావడంలో ఆసక్తి చూపడం లేదు. ఈ పరిణామం రైతుల ఆందోళనను మరింత పెంచుతోంది. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు కిలోకు రూ.4 మద్దతు ధరను ప్రకటించింది. అలాగే ఫ్యాక్టరీలు కనీసం రూ.8 ఇవ్వాలని సూచనలు జారీ చేసినప్పటికీ, జిల్లాలోని చాలా ఫ్యాక్టరీలు రూ.4 నుంచి రూ.5 మధ్యే ధర చెల్లించాయి. అంతేకాకుండా ఇప్పటికీ కొంతమంది రైతులకు బకాయిలు చెల్లించలేదు. జిల్లాలోని రెండు ఫ్యాక్టరీలు అయితే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని రైతులు ఆరోపిస్తున్నారు..ఈ పరిస్థితిపై మామిడి ఉత్పత్తిదారుల సంఘాలు ఆందోళనకు దిగాయి. బకాయిల చెల్లింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బుధవారం మామిడి జ్యూస్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి బిల్లుల చెల్లింపులపై చర్చించారు. అయినప్పటికీ స్పష్టమైన హామీ రావాల్సి ఉంది.

ఇక ఈ ఏడాది సీజన్ ప్రారంభంపై కూడా రైతుల్లో అనిశ్చితి నెలకొంది. మే 15వ తేదీ నుంచి జిల్లాలో మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో చిత్తూరులోని మామిడి యార్డులో కూడా క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అయితే గత సంవత్సరం ఫ్యాక్టరీలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట సిద్ధంగా ఉన్న సమయంలో ఫ్యాక్టరీలు తెరుచుకోకపోవడంతో రైతులు ఒకేసారి కాయలను కోసి ఫ్యాక్టరీల వద్దకు తరలించారు. దీంతో అన్‌లోడ్ చేయడానికి రెండు నుంచి మూడు రోజులు పట్టింది. ఈ సమయంలో కాయలు నాణ్యత కోల్పోయి నష్టాలు చవిచూశారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే ఫ్యాక్టరీలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే పంట తగ్గుదల నేపథ్యంలో కనీసం గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. కిలోకు కనీసం రూ.10 కంటే తక్కువ కాకుండా ధర ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మొత్తంగా చూస్తే చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి ఈ ఏడాది తీవ్ర అయోమయం, ఆందోళనతో నిండి ఉంది. పంట స్వభావం మార్పు, దిగుబడి తగ్గుదల, మార్కెట్ అనిశ్చితి, ఫ్యాక్టరీల నిర్లక్ష్యం అన్నీ కలిసివచ్చి రైతులను సంక్షోభంలోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం, పరిశ్రమలు సమన్వయంతో చర్యలు తీసుకుంటేనే రైతులు కొంతమేర ఉపశమనం పొందే అవకాశం ఉంది.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *