12, ఏప్రిల్ 2026, ఆదివారం

మండుతున్న ఎండలకు మొక్కుబడిగా ఉపాధి హామీ పనులు

కూలీలకు మూడు నెలలుగా అందని వేతనాలు

 ఏడాదిగా విడుదల గాని మెటీరియల్ కాంపోనెంట్

 మినీ గోకులాలకు అందని బిల్లులు

 జిల్లాకు రూ.132 కోట్ల ఉపాధి హామీ బకాయిలు


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు జిల్లాలో గ్రామీణ ఉపాధి భద్రతకు ఆధారంగా నిలవాల్సిన ఉపాధి హామీ పథకం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. మండుతున్న ఎండలు, నెలల తరబడి వేతనాల బకాయిలు, మెటీరియల్ బిల్లుల పెండింగ్ అన్నీ కలిసి ఈ పథకాన్ని నామమాత్రంగా మార్చేశాయి. కూలీలు పనుల వద్ద హాజరు మాత్రమే నమోదు చేసుకుంటూ, పని చేయకుండా వెనుదిరుగుతున్న పరిస్థితి జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భౌతికంగా కష్టమైన పనులు చేయడానికి కూలీలు ముందుకు రావడం సహజంగానే తగ్గింది. అయితే అధికారులు పనులు పూర్తి చేయాల్సిన ఒత్తిడితో సిబ్బందిపై తీవ్రంగా దృష్టి సారిస్తున్నారు. దీంతో ఉపాధి హామీ సిబ్బంది గ్రామాలకెళ్లి కూలీలను వేడుకుంటూ, కొన్నిసార్లు ఒత్తిడి తెచ్చి పనుల వద్దకు తీసుకెళ్లాల్సి వస్తోంది.

అయితే పనుల వద్దకు వచ్చిన కూలీలు కూడా గంటసేపు గడపకుండానే వెళ్లిపోతున్నారు. ఎండ తీవ్రతతో పాటు, వేతనాలు రావడంలేదన్న నిరాశ కారణంగా పని చేయాలనే ఉత్సాహం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ప్రారంభించిన పనులు ఎక్కడైతే అక్కడే నిలిచిపోతున్నాయి. చెరువుల పునరుద్ధరణ, మట్టి పనులు, మినీ గోకులాల నిర్మాణం వంటి కీలక పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ పరిస్థితికి మూల కారణం పరిశీలిస్తే, మూడునెలలుగా వేతనాలు చెల్లించకపోవడమే. ఉపాధి హామీ కూలీలకు రోజుకు సుమారు రూ.270 మాత్రమే లభిస్తుంది. అదే కూలీ బయటకు వెళితే రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదించే అవకాశం ఉంది. అదనంగా భోజనం, టీ, ఇతర సౌకర్యాలు కూడా అందుతాయి. దీంతో కూలీలు సహజంగానే ఎక్కువ ఆదాయం వచ్చే పనుల వైపు మళ్లుతున్నారు..ఇక మెటీరియల్ కాంపోనెంట్ సమస్య మరింత తీవ్రమైంది. మినీ గోకులాల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఏడాది రోజులుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. కొంతమేర నిధులు విడుదల చేసినప్పటికీ, అవి జిల్లా స్థాయిలో అవసరాలకు సరిపోకపోవడంతో పనులు పూర్తికాకుండానే నిలిచిపోయాయి. నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడంతో లబ్ధిదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లాలో గణాంకాల ప్రకారం 2,02,160 జాబ్ కార్డులు ఉన్నాయి. మొత్తం 3,04,526 మంది కూలీలు నమోదయ్యారు. అయితే ప్రస్తుతం యాక్టివ్‌గా పనిచేస్తున్న వారు కేవలం 1,75,412 మంది మాత్రమే. అంటే దాదాపు సగం మంది కూలీలు పథకానికి దూరమవుతున్నట్టు స్పష్టమవుతోంది..ఇప్పటివరకు జిల్లాలో 52,85,328 పని దినాలు కల్పించారు. కానీ 100 రోజుల పని పూర్తి చేసిన వారు కేవలం 8,079 మంది మాత్రమే ఉండటం పథకం అమలులో ఉన్న లోపాలను బయటపెడుతోంది. ఉపాధి హామీ కింద రూ.142.77 కోట్ల విలువైన పనులు నిర్వహించగా, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.83.08 కోట్ల పనులు చేపట్టారు. మొత్తం రూ.225.86 కోట్ల పనులు జరిగినప్పటికీ, చెల్లింపుల విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోంది. ప్రస్తుతం కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.63.43 కోట్లకు చేరాయి. మెటీరియల్ కాంపోనెంట్ కింద సుమారు రూ.131 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం మీద రూ.132 కోట్లకు పైగా బకాయిల భారం జిల్లా మీద పడింది. ఈ బకాయిలే పథకం అమలుకు ప్రధాన అడ్డంకిగా మారాయి.

పనుల నిర్వహణలో మేట్‌లపై పడుతున్న బాధ్యతలు కూడా అధికమయ్యాయి. కూలీలను సమీకరించడం, పనుల వద్దకు తీసుకురావడం, ఆటోలు ఏర్పాటు చేయడం, మొబైల్ ద్వారా అటెండెన్స్ నమోదు చేయడం అన్నీ బాధ్యతలు మేట్‌లపైనే ఉన్నాయి. కానీ వారికి ప్రత్యేక వేతనాలు లేకపోవడంతో వారు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫేషియల్ అటెండెన్స్ విధానం కూలీలకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ముఖ గుర్తింపు ద్వారా హాజరు నమోదు చేయాల్సి రావడంతో సాంకేతిక సమస్యలు, నెట్‌వర్క్ లోపాలు, మొబైల్ ఫోన్ల లోపం వంటి అంశాలు కూలీలకు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ విధానం వల్ల పనుల వద్ద అనవసర ఆలస్యం కూడా జరుగుతోంది. కూలీలు పనులకు రాకపోతే సిబ్బందినే బాధ్యులుగా చేస్తూ, అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. గత సంవత్సరం పనిచేసిన వారి సంఖ్య, ఈ సంవత్సరం తగ్గిన హాజరు వంటి అంశాలపై వివరణలు కోరుతూ, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, జీతాలు నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ నెల వరకు మాత్రమే పథకాన్ని పొడిగించారు. గుర్తించిన పనులన్నింటినీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూలీలు లేకుండా, నిధులు లేకుండా పనులు పూర్తి చేయడం ఎలా అన్న ప్రశ్న సిబ్బందిని వేధిస్తోంది.

మే నెల నుంచి వికసిత్ భారత్  గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) పేరిట వీబీ జీ రామ్ జీ  కొత్త విధానం అమల్లోకి రానుంది. అయితే ప్రస్తుతం ఉన్న బకాయిల సమస్యలు, వేతనాల ఆలస్యం, సాంకేతిక లోపాలు పరిష్కరించకపోతే కొత్త పథకం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ పేదలకు ఉపాధి భద్రత కల్పించాల్సిన పథకం ప్రస్తుతం కూలీలకు భారం అవుతోంది. వేతనాలు సమయానికి చెల్లించకపోతే, పనులకు సరైన గిట్టుబాటు లేకపోతే, సాంకేతిక ఇబ్బందులు తొలగించకపోతే ఈ పథకం లక్ష్యాలు పూర్తిగా దెబ్బతింటాయని స్పష్టమవుతోంది. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు కాగితాలపై… కూలీలు ఇతర పనుల్లో అన్న పరిస్థితికి చేరుకుంది. వెంటనే బకాయిలు చెల్లించి, కూలీలకు నమ్మకం కల్పించి, వ్యవస్థను సరిచేయకపోతే గ్రామీణ ఉపాధి భద్రతపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *