28, ఏప్రిల్ 2026, మంగళవారం

రెండు రోజుల తర్వాత ఆయిల్ ధరలు పెరుగుతాయని పుకార్లు

క్యాన్లలో ఆయిల్ నింపుకొని నిల్వంచుకుంటున్న వాహనదారులు 

పెట్రోల్ బంకులకు అప్పు ఇవ్వని ఆయిల్ కంపెనీలు 

ఫలితంగా మూతబడిన పలు పెట్రోల్ బంకులు 


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

పశ్చిమ బెంగాల్‌లో ఈనెల 29న జరగనున్న రెండవ దశ ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.25 వరకు పెరుగుతాయని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుండటం చిత్తూరు జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పుకార్లతో ప్రజల్లో భయాందోళనలు నెలకొని, రైతులు, వాహనదారులు ముందస్తుగా భారీగా ఇంధనాన్ని నిల్వ చేసుకోవడానికి పరుగులు తీస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు పెద్ద పెద్ద క్యాన్లు, డబ్బాలు తీసుకుని పెట్రోల్ బంకులకు వెళ్లి ఇంధనం నింపించుకోవడం సాధారణ దృశ్యంగా మారింది. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, కార్లు, లారీలు నడిపేవారు అన్న తేడా లేకుండా అందరూ ట్యాంకులు ఫుల్ చేసుకోవడమే కాకుండా అదనంగా నిల్వలు చేసుకుంటున్నారు. కొందరు రైతులు వ్యవసాయ పనుల కోసం అవసరమని భావించి డీజిల్‌ను పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుకుంటుండగా, మరికొందరు భవిష్యత్తులో ధరలు పెరుగుతాయన్న భయంతో అధిక పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితితో జిల్లాలోని అనేక పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.

ఈ హడావిడితో కొన్నిచోట్ల బంకుల్లో ఇంధన నిల్వలు తాత్కాలికంగా తగ్గిపోవడంతో నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ప్రజల్లో మరింత భయం పెరిగి, మరింత వేగంగా నిల్వలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితి పూర్తిగా కృత్రిమ కొరతకు దారి తీస్తోంది. వాస్తవానికి సరఫరాలో పెద్దగా అంతరాయం లేకపోయినా, వినియోగం ఒక్కసారిగా పెరగడంతో సరఫరా-డిమాండ్ మధ్య తేడా ఏర్పడింది. ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంక్ యజమానులకు అప్పుగా ఇంధనం ఇవ్వడం నిలిపివేయడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. గతంలో బంక్ యజమానులు ముందస్తు చెల్లింపులు చేయకుండా ఇంధనం తీసుకుని, విక్రయాల తర్వాత ఆయిల్ కంపెనీలకు డబ్బులు చెల్లించే విధానం అమలులో ఉండేది. ఈ విధానం చిన్న, మధ్య తరహా బంక్ యజమానులకు చాలా ఉపయుక్తంగా ఉండేది. అయితే ప్రస్తుతం ఆ సౌకర్యం లేకపోవడంతో బంక్ యజమానులు ముందుగానే భారీ మొత్తాలు చెల్లించి ఇంధనం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కొంతమంది యజమానులు ఒకేసారి అంత మొత్తాన్ని సమకూర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంతో జిల్లాలో సుమారు 15 నుంచి 20 వరకు పెట్రోల్ బంకులు గత నెల రోజులుగా మూతపడినట్లు సమాచారం. కొందరు యజమానులు వ్యాపారం కొనసాగించడం కష్టమవుతుండటంతో పూర్తిగా బంకులను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిణామాలు ఇంధన సరఫరాపై ప్రభావం చూపడంతో ప్రజల్లో మరింత అనిశ్చితి నెలకొంది. దీనికి తోడు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. ఎన్నికల తర్వాత ధరలు భారీగా పెరుగుతాయన్న వదంతులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీలతో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సమాచారం. బంక్ యజమానులకు మళ్లీ అప్పు విధానంలోనే ఇంధన సరఫరా చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఈ విధానం అమలు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లాలో పరిస్థితిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి సంయుక్తంగా చిత్తూరు పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా బంకుల్లో ఉన్న ఇంధన నిల్వలు, సరఫరా విధానం, విక్రయాల పరిస్థితిని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్, డీజిల్‌కు ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇంధనాన్ని నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా, లేదా అసత్య ప్రచారాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరానికి మించి నిల్వలు చేసుకోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఇంధన సరఫరా వ్యవస్థ పూర్తిగా సజావుగా కొనసాగుతోందని చెప్పారు. ప్రజలు వదంతులను నమ్మకుండా, అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. బంక్ నిర్వాహకులు కూడా పారదర్శకంగా విక్రయాలు నిర్వహించి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఎవరైనా డీజిల్, పెట్రోల్‌ను బ్లాక్ చేసి నల్లబజారులో విక్రయించినా, లేదా కొరత ఉందని అసత్య ప్రచారం చేసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. మొత్తం మీద పుకార్లు, మార్కెట్ పరిస్థితులు, ఆయిల్ కంపెనీల విధాన మార్పులు కలిసి చిత్తూరు జిల్లాలో ఇంధన రంగంలో తాత్కాలిక సంక్షోభాన్ని సృష్టించాయి. అయితే వాస్తవంగా సరఫరాలో పెద్దగా లోటు లేకపోయినా, భయంతో ప్రజలు భారీగా నిల్వలు చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి చేరుకునే అవకాశముందని భావిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *