19, ఏప్రిల్ 2026, ఆదివారం

చిత్తూరు జిల్లాను వణికిస్తున్న చిరుతపులులు…

 సంఖ్య పెరుగుదలతో ఆహారం, నీటి కోసం గ్రామాలపై దాడులు
అప్పుడప్పుడు పశువులు మనుషులపై దాడులు

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్న మూగజీవాలు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)


చిత్తూరు జిల్లాలో చిరుతపులుల సంచారం రోజురోజుకూ పెరిగి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఒకప్పుడు అడవులకే పరిమితమైన చిరుతలు ఇప్పుడు గ్రామాలు, పట్టణాల అంచుల వరకూ చేరుతున్నాయి. తాగునీరు, ఆహారం కోసం అడవులను వదిలి బయటికొస్తున్న ఈ చిరుతలు ఒకవైపు పశువులపై దాడులు చేస్తున్నాయి. జిల్లాలో సంవత్సర కాలంలో ప్రజలకు పైగా పశువుల పైన దాడులు చేసి పొట్టనపెట్టుకున్నాయి. ఐదు మందికి పైగా మనుషులు గాయపడ్డారు. సంవత్సర కాలంలో అరడజనుులకు పైగా చిరుతపులులు మృత్యువాత పడ్డాయి. ప్రమాదాలు, గాయాలతో ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా చిత్తూరు నగర శివారులో జరిగిన చిరుత మరణం ఈ పరిస్థితిని మరింత స్పష్టంగా బయటపెట్టింది.


చిత్తూరు పట్టణంలోని దొడ్డిపల్లి జగనన్న హౌసింగ్ కాలనీ సమీపంలో ఆదివారం ఓ చిరుతపులి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అటవీ ప్రాంతం నుంచి దారితప్పి వచ్చిన ఈ చిరుత ముళ్లకంపలు, రాళ్ల మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. సుమారు మూడు రోజులపాటు తిండి, నీరు లేక అలమటించిన ఈ చిరుత శనివారం అర్ధరాత్రి సమయానికి సమీపంలోని అసంపూర్తి గృహ నిర్మాణంలోకి చేరి తలదాచుకుంది. ఆదివారం తెల్లవారుజామున చిరుత గాండ్రింపును గుర్తించిన స్థానికులు అటవీశాఖకు సమాచారం అందించడంతో అక్కడికి భారీగా జనసంచారం చేరింది. జనం కదలికతో భయపడిన చిరుత బయటకు పాక్కుంటూ రావడం, ఒక దశలో గర్జించడంతో ప్రజలు పరుగులు తీయడం చోటుచేసుకుంది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు రెస్క్యూ చర్యలు చేపట్టగా, అప్పటికే చిరుత మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించగా, శరీరంపై తీవ్ర గాయాలు, కుడి కాలు ఎముక విరగడం వంటి విషయాలు బయటపడ్డాయి. గాయాలు, ఆకలి, దాహం కలిసి ఈ మరణానికి కారణమయ్యాయని వైద్యులు నిర్ధారించారు. స్థానికుల సమాచారం ప్రకారం, ఈ చిరుతకు ముందు మరో రెండు చిరుతలు అదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో దొడ్డిపల్లి, లక్ష్మీరెడ్డిపల్లి, కొట్రకోన గ్రామాలతో పాటు జగనన్న కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. రాత్రివేళ ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇదే సమయంలో జిల్లాలో చిరుతపులుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అటవీశాఖ అంచనా వేస్తోంది. ఐదు సంవత్సరాల క్రితం సుమారు 120 వరకు ఉన్న చిరుతల సంఖ్య ప్రస్తుతం 500కు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ పెరుగుదలతో పాటు అడవుల్లో ఆహారం, నీటి కొరత పెరగడంతో చిరుతలు గ్రామాల వైపు వస్తున్నాయి. పంట పొలాలు, మామిడి తోటలు, చెరుకు తోటలు వీటికి ఆశ్రయంగా మారుతున్నాయి. గత ఏడాది కాలంలో జిల్లాలో 10 నుండి 15 పశువులు చిరుతల బారిన పడ్డాయి. పలమనేరు, బంగారుపాళ్యం, యాదమరి, ఐరాల, సోమల, చౌడేపల్లి ప్రాంతాల్లో ఈ దాడులు ఎక్కువగా నమోదయ్యాయి. కొన్ని చోట్ల రైతులు, పశువుల కాపరులపై దాడి ప్రయత్నాలు కూడా జరిగాయి. సుమారు 3 నుండి 5 మంది వరకు గాయపడిన ఘటనలు నమోదయ్యాయి. మరోవైపు చిరుతలకే ప్రమాదాలు పెరుగుతున్నాయి. బావుల్లో పడిపోవడం, ఉచ్చుల్లో చిక్కుకోవడం, రోడ్డు ప్రమాదాలు, పరస్పర పోరాటాల్లో గాయపడడం వంటి కారణాలతో చిరుతలు ప్రాణాలు కోల్పోతున్నాయి. దొడ్డిపల్లి ఘటన కూడా ఇదే కోవకు చెందినదిగా అధికారులు భావిస్తున్నారు. వేసవి కాలంలో అడవుల్లో నీటి వనరులు ఎండిపోవడం, ఆహారం కొరత, అడవుల క్షీణత, గ్రామాల విస్తరణ అన్నీ కలిసి ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే మానవ-మృగ సంఘర్షణ మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని అడవుల్లో నీటి వనరులను పెంచడం, వేట నియంత్రణ, గ్రామాల వద్ద భద్రతా చర్యలు అమలు చేయడం అవసరమని స్థానికులు కోరుతున్నారు. లేకపోతే చిత్తూరు జిల్లాలో చిరుతల భయం రానున్న రోజుల్లో మరింత భయానక రూపం దాల్చే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *