22, ఏప్రిల్ 2026, బుధవారం

యువ రక్తంతో టిడిపి కొత్త పయనం !

ఆ తరం నాయకులకు వీడ్కోలు 

అంకితభావం గల యువతకు పెద్దపీట 

మహిళలకు సముచితస్థానం

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

 ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ 1982లో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పునరుత్తేజం చెందుతోంది. ఈ నెల 15 వ తేదీ ప్రకటించిన జాతీయ రాష్ట్ర కమిటీలను పరిశీలిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. జాతీయ అధ్యక్షుడు, కుప్పం ఎమ్మెల్యే, ముఖ్య మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు మొత్తం కార్యవర్గంలో 83 శాతం కొత్తవారికి అవకాశం కల్పించి సంచలనం సృష్టించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పదవులు అనుభవిస్తున్న ఆ తరం నేతలను కొందరిని పక్కన పెట్టి కొత్త రక్తం ఎక్కించారు. ఆయన ప్రతినిధ్యంలోని చిత్తూరు జిల్లాలో కొత్తగా ముగ్గురు పార్లమెంటు స్థాయి మహిళలకు రాష్ట్ర కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. చిత్తూరు పార్లమెంటు అధ్యక్షురాలుగా ఉన్న కె అరుణ ( జి డి నెల్లూరు), కార్యదర్శులుగా ఉన్న ప్రసన్న లక్ష్మి మీరా నేతాజీ ( నగరి)కి అనూహ్యంగా ఈ పదవులు దక్కాయి. అలాగే జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమరనాథ రెడ్డికి రెండవ సారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించారు. ఆయన కుటుంబానికి జిల్లాలో మంచి పట్టు ఉంది. ఆయన వివిధ స్థాయిల్లో పార్టీకి సేవలు అందిస్తున్నారు.

కాగా గంగాధర నెల్లూరు నియోజక వర్గం పాలసముద్రం మండలానికి చెందిన భీమినేని చిట్టిబాబు నాయుడు రెండవ సారి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి అయ్యారు. 30 ఏళ్ల తరువాత నియోజక వర్గంలో టిడిపి గెలవడానికి ఆయన విశేష కృషి చేశారు. కాగా కుప్పం వ్యవహారాలు చూస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను ఆయన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఈ విషయాలను పరిశీలిస్తే అనేక విషయాలు అర్ధం అవుతాయి. దశాబ్దాల కాలంగా తెలుగు దేశం పార్టీ రాజకీయాల్లో ఒక ధ్రువతారగా వెలుగుతోంది. ఎన్టీఆర్ తర్వాత పార్టీ మనుగడపై నాడు అనేక సందేహాలు వ్యక్తమైనప్పటికీ, చంద్రబాబు నాయుడు తనదైన వ్యూహరచనతో, సాంకేతికతను జోడించి పార్టీని కేవలం ఒక రాజకీయ సంస్థగా కాకుండా, ఒక పటిష్టమైన వ్యవస్థగా తీర్చిదిద్దారు. ఇప్పుడు అదే పరంపరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ పగ్గాలను నారా లోకేష్‌కు అప్పగిస్తూ, యువ రక్తాన్ని పార్టీ నరనరాల్లోకి ఎక్కించే ప్రక్రియ సక్సెస్ ప్లానింగ్ లో ఒక భాగంగా కనిపిస్తోంది.

తాజాగా ప్రకటించిన పార్టీ కమిటీలు కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాదు, అది రాబోయే మూడు దశాబ్దాల రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేసిన ఒక భారీ మాస్టర్ ప్లాన్. నారా లోకేష్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ద్వారా పార్టీలో ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగళం పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన లోకేష్, ఇప్పుడు పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ తనదైన ముద్ర వేయబోతున్నారు. ఇది పాత తరం అనుభవాన్ని, కొత్త తరం వేగాన్ని మేళవించే ఒక అద్భుతమైన ప్రయోగం. పార్టీ కమిటీల ప్రకటనలో కనిపించిన ప్రధాన మార్పు విధేయత , పనితీరు, గత ఐదేళ్లలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉండి పోరాడిన నాయకులకు పెద్దపీట వేయడం ద్వారా, క్యాడర్‌లో ఒక కొత్త ఉత్సాహం నింపారు. పొలిట్ బ్యూరో నుంచి గ్రామ స్థాయి కమిటీల వరకు యువతకు, ముఖ్యంగా సమర్థత కలిగిన విద్యావంతులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా టీడీపీ తన రూపురేఖలను మార్చుకుంటోంది. సోషల్ మీడియా యుగంలో మారుతున్న రాజకీయ సమీకరణాలను తట్టుకునేలా, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువ టీమ్‌ను రంగంలోకి దించడం చంద్రబాబు, లోకేష్ దూరదృష్టికి నిదర్శనం.
ఈ మార్పు ఒక రాజకీయ సిద్ధాంత వారసత్వం. ఎన్టీఆర్ ఆశయాలను, చంద్రబాబు అభివృద్ధి మంత్రాన్ని పుణికిపుచ్చుకున్న ఈ సరికొత్త టీమ్, టీడీపీని మరిన్ని దశాబ్దాల పాటు ప్రజల గొంతుకగా పార్టీని నిలబెట్టే అవకాశం ఉంది. క్రమశిక్షణ కలిగిన క్యాడర్, స్పష్టమైన నాయకత్వం ఉన్న ఏ పార్టీ అయినా ఒడిదుడుకులు తట్టుకుంటుందని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. లోకేష్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి ఇది కేవలం రీ-బ్రాండింగ్ మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు పార్టీని పటిష్టంగా అప్పగించే ఒక బాధ్యతాయుతమైన ప్రయాణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *